బాణసంచా కేంద్రాల్లో భద్రత కరువు !
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:47 AM
తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో రెండేళ్ల క్రితం బాణసంచా తయారీ కేంద్రం వద్ద గంధకం వాడకం వద్ద ఎక్కువ కావడంతో ఒక్కసారిగా విస్పోట నం రావడంతో భారీ పేలుడు సంభ వించింది.

కనీస ప్రమాణాలు పాటించని వ్యాపారులు
కూలీల ప్రాణాలకు ముప్పు
పట్టించుకోని అధికారులు
తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో రెండేళ్ల క్రితం బాణసంచా తయారీ కేంద్రం వద్ద గంధకం వాడకం వద్ద ఎక్కువ కావడంతో ఒక్కసారిగా విస్పోట నం రావడంతో భారీ పేలుడు సంభ వించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు తునాతునకలై తల ఒక చోట, చేతులు ఇంకోచోట చెల్లా చెదురుగా పడి మృతి చెందారు. వారి శరీర అవయవాలు వెతుక్కుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తణుకు మండలం దువ్వ వద్ద చిచ్చుబుడ్ల రాపిడి వల్ల నిప్పు రవ్వలు ఏర్పడి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమా దంలో ముగ్గురు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్తలు మృతి చెందగా ఆ కుటుంబం నిరాదరణకు గురైంది.
కనీస వసతులు, భద్రతలేమితో బాణసంచా తయారీ, దుకాణాలు, గోదాముల్లో కూలీల ప్రాణాలు గాలిలో దీపంలా మారిపోతున్నాయి. పొట్టకూటి కోసం పనికి వెళ్తున్న కూలీల ప్రాణాలకు కనీస బీమా లేకపోవడంతో వందలాది మంది కూలీల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లాలోని కైలాస పట్నంలో ఎనిమిది మంది కూలీలు బాణ సంచా దుకాణం వద్ద అగ్ని ప్రమా దంతో ప్రాణాలు వదిలిన ఘటనతో పశ్చిమ గోదావరి జిల్లాలోని బాణాసంచా ప్రమాద ప్రభావిత కుటుంబాలు ఉలిక్కి పడ్డాయి. జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు, గోదాములు, దుకాణాల వద్ద వసతులు కల్పించకపోవడంపై ఆంధ్రజ్యోతి కథనం.
తాడేపల్లిగూడెం రూరల్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) :
బాణసంచా దుకాణాలు, తయారీ కేంద్రాలు, గోదాముల వద్ద ఉండాల్సిన కనీస సదుపా యాలు లేక ప్రమాదాల భారిన పడుతున్నాయి. కనీసం విద్యుత్ సరఫరా కూడా ఉండకూడదనే నిబంధన ఉన్నా దాన్ని అంతా బేఖాతరు చేస్తుం టారు. దానికి తోడు అగ్నిప్రమాదం సంబవిం చినప్పుడు ప్రమాద తీవ్రతను తగ్గించే పరిక రాలు తూతూమంత్రంగా ఏర్పాటు చేయడం, ప్రమాదం సంబవించినప్పుడు ఏం చేయాలో సిబ్బందికి కనీస అవగాహన ఉండదనే ఆరోపణ లు ఉన్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూ రుస్తూ తరచూ సంభవించే అగ్ని ప్రమాదాల వల్ల పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జిల్లాలో చాలానే జరిగాయి.
కూలీలకు బీమా కరువే..
బాణసంచా దుకాణాల వద్ద నిప్పుతో చెలగాటం ఆడాలని కూలీలకు తెలిసినా పొట్టకూటి కోసం తెగించి పనులు చేస్తుంటారు. కూలీలకు కనీసం బీమా కట్టకుండా గాలికి వదిలేస్తుండటం బాణసంచా తయారీ కేంద్రాల యజమానులు నిబద్దతకు అద్దం పడుతోంది. అధికారులైనా తప్పనిసరిగా ప్రమాద నివారణ ఎక్యూప్‌మెంట్ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత తీసుకునేలా జాగ్రత్తలు పాటించాలి. కూలీలకు బీమా సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలి.
జిల్లాలో అనుమతి ఇవ్వకున్నా..
గతేడాది దీపావళికి బాణసంచా తయారీ కేంద్రాలకు పశ్చిమ గోదావరి జిల్లాలో లైసెన్స్‌లు ఇవ్వకపోవడంతో వ్యాపారులు సరిహద్దు రాజకీ యాలు చేసి మరీ వ్యాపారాలు సాగించారు. పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ సమీపంలోని తూర్పుగోదావరి జిల్లా సూర్యారావుపాలెం వద్ద బాణసంచా తయారీ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఆ కేంద్రం వద్ద అగ్నిప్రమాదం సంబవించి ముగ్గురు మృతి చెందడం చర్చనీయాంశమైంది.
అన్నింటా అప్రమత్తత అవసరం
ఈ అగ్నిప్రమాదాల నివారణకు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో బాణసంచా వ్యాపా రాలు ఎక్కువ. ఆయా ప్రాంతాల్లో దుకాణాల వద్ద భద్రత ప్రమాణాలు నూరుశాతం అమలయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. కొత్తగా బాణసంచా గోదాములు, తయారీ కేంద్రాలకు అనుమతి ఇచ్చేప్పుడు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.
పేలుడు ఘటనలు ఇలా..
బాణసంచా తయారీ కేంద్రాల్లోనే ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరిగాయి. అత్యంత భయంకరంగా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి ఘటనలో పటాసుల తయారీలో గంధకం వాడకం ఎక్కువగా ఉండడంతో పేలుడు సంభవించి ఏకంగా ఎనిమిది మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. అప్పట్లో ఈ ఘటన ఓ సంచలనం. ఆ తరువాత తాడేపల్లిగూడెం పడాలలో మరో ఘటనలో ఓ కూలీ మృతి చెందగా, తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో జరిగిన అగ్నిప్రమా దంలో గంధకం వాడకం ఎక్కువగా ఉండడంతో చిచ్చుబుడ్ల తయారీలో నిప్పుకనికలు ఏర్పడి ముగ్గురు కూలీలను బలితీసుకున్నాయి. దువ్వలో బాణసంచా తయారీ కేంద్రంలో ముగ్గురు, కానూరులో సీమటపాకాయల పేలుడు ఘటనలో ముగ్గురు, గతేడాది దువ్వ సమీపంలోని తూర్పు గోదావరి జిల్లా సూర్యారావుపాలెం వద్ద దీపావళి ముందు బాణసంచా దుకాణం వద్ద పిడుగుపడి ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటనలు అన్నీ నిర్లక్ష్యం వల్లే జరిగాయనడానికి నిదర్శనం.