ధాన్యం కొనుగోళ్లు షురూ..
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:35 AM
దాళ్వా వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఆ ధాన్యం దళారుల చేతిలోకి వెళ్లి రైతులు మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ముందస్తుగానే ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేసింది.

తాడేపల్లిగూడెంలో మొట్ట మొదటి కొనుగోలు కేంద్రం ప్రారంభం
జిల్లాలో 348 కేంద్రాలు.. 6 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యం
తాడేపల్లిగూడెం రూరల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): దాళ్వా వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఆ ధాన్యం దళారుల చేతిలోకి వెళ్లి రైతులు మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ముందస్తుగానే ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేసింది. తొలిగా జిల్లాలోనే మొట్టమొదటి మాసూళ్లు నిర్వహించే తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా అధికారులు గురువారం ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటికే వరి మాసూళ్లు ప్రారంభమైన తాడేపల్లిగూడెం మండలంలోనే తొలిసారిగా ధాన్యం కొనుగోలు నిర్వహించడంతో తమ ధాన్యం దళారులకు అందించకుండా ప్రభుత్వానికే ఆరుదల ధాన్యం అందించేందుకు వీలుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం సొమ్ముకూడా గత సార్వా సీజన్‌లో 24 గంటల లోపే రైతుల ఽఖాతాల్లోకి జమ కావడంతో తొలి ప్రాధాన్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలకే ఇచ్చేందుకు వారంతా ఉత్సాహం చూపుతున్నారు.
జిల్లాలో 348 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో 348 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తిచేసింది. ఈ మేరకు ధాన్యం కేంద్రాల వద్ద ఉన్న సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తిచేయడంతోపాటు సొసైటీల వారికి మార్గదర్శకాలు అందించారు. జిల్లాలోని 115 సొసైటీల ద్వారా 348 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. ఆ కేంద్రాల వద్ద రైతులకు అందించేందుకు 15 లక్షల గోనె సంచులు సిద్ధం చేయగా మరో 20 లక్షల గోనె సంచులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా నిర్ణయించు కున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం 208 రైస్ మిల్లులకు కేటాయించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
అంతా దళారుల దోపిడీనే..
దళారులు రైతులను దోచుకుంటున్నారు. ప్రస్తుతం మండలంలో వరి మాసూళ్లు జరుగుతుండగా వారి వద్ద బస్తా ధాన్యం రూ.1300లకే కొంటున్నారు. అదే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరుదల ధాన్యం రూ.1725 వస్తోంది. రైతులకు సకాలంలో డబ్బులు రాక తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. తూకంలోనూ మోసం చేస్తూ రైతుల కష్టాలను దోచుకోవడం దళారులకు కొట్టిన పిండిగా మారింది.
ధాన్యం కేంద్రాల ఏర్పాటు అభినందనీయం
ధాన్యం కొనుగోల్లు చేసేందుకు ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటుచేయడం అభినందనీయం. మా దగ్గర బయట దళారులు బస్తా ధాన్యం రూ.1300లకే కొనుగోలు చేస్తూ మమ్మల్ని దోచుకుంటున్నారు. ముందస్తుగానే ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో బాగుంది.
– కోడే బాలాజి, మోదుగగుంట
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే విక్రయిస్తాం
ధాన్యం కొనుగోలు చేసేందుకు దళారులు ముందుకు వస్తున్నారు. కానీ చాలావరకూ తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ద్వారా విక్రయుస్తే 24 గంటల లోపే మాకు సొమ్ములు చేతికి వస్తున్నాయి. మేం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే విక్రయిస్తాం.
– పెనుగుర్తి పెద్దిరాజు, మోదుగగుంట