Share News

Permit Rooms: మందు బాబులకు శుభవార్త.. పర్మిట్ రూమ్‌కు అనుమతి

ABN , Publish Date - Apr 14 , 2025 | 01:25 AM

మందు బాబులకు మందు తాగడమే పెద్ద సమస్య. వైన్‌ షాపులో దర్జాగా కొనుగోలు చేస్తారు. అక్కడ తాగడానికి నిబంధనలు అడ్డం.

Permit Rooms: మందు బాబులకు శుభవార్త.. పర్మిట్ రూమ్‌కు అనుమతి

రోడ్డుపైన.. ఇళ్లు.. చేల వద్ద మద్యపానం

స్థానికులు, అధికారుల నుంచి అభ్యంతరం

మందుబాబుల అవస్థలు

ముందుగా గ్రామాల్లో సిట్టింగ్‌ రూమ్‌

తర్వాత పట్టణాల్లో ఏర్పాటు

మందు బాబులకు మందు తాగడమే పెద్ద సమస్య. వైన్‌ షాపులో దర్జాగా కొనుగోలు చేస్తారు. అక్కడ తాగడానికి నిబంధనలు అడ్డం. రోడ్డు పక్కనో.. చేల వద్దనో తాగుదామంటే బహిరంగ మద్యపానం నేరం. మందు బాబులకు ఇక ఇలాంటి అవస్థలు ఉండవు. మద్యం దుకాణాల వద్ద పర్మిట్‌ రూమ్‌లో దర్జాగా పెగ్‌ బిగించవచ్చు. ప్రభుత్వ అనుమతితో పర్మిట్‌ రూమ్‌లకు రంగం సిద్ధమైంది. త్వరలో అందుబాటులోకి రానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

భీమవరం క్రైం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): మద్యం షాపుల వద్ద పర్మిట్‌ రూమ్‌లు లేకపోవడం వల్ల మందుబాబులు ఇబ్బందులు పడుతున్నారు. మద్యం కొనుగోలు చేసి రోడ్డు పక్కన, పంట పొలాలు, నివాసాల మధ్యలో సేవిస్తూ స్థానికులను ఇబ్బందులకు గురిచేయడం సర్వసాధారణంగా మారింది. కొన్ని మద్యం దుకాణాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా పర్మిట్‌ రూమ్‌లు నిర్వహిస్తున్నా మందు బాబులకు ఇబ్బందులు తప్పడం లేదు. మద్యం దుకాణాల వద్ద పర్మిట్‌ రూమ్‌లకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది. గత ప్రభుత్వం కూడా సిటింగ్‌ రూమ్‌లు లేకపోవడం, నాసిరకం మద్యం విక్రయాలతో చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం క్వాలిటీ మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ సిటింగ్‌ రూమ్‌లు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని మందుబాబులు వాపోతున్నారు. సిటింగ్‌ రూమ్‌లు లేక పోవడంతో మద్యం కొనుగోళ్లుపైనా ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం ఆదాయం కోల్పోతుందని అధికారులు చెబుతున్నారు. సిటింగ్‌ రూమ్‌లు ఇస్తే మద్యం అమ్మకాలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెబుతున్నారు.

జిల్లాలో 193 మద్యం దుకాణాలు

జిల్లాలో 193 మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. వేలంద్వారా మద్యం దుకాణాల లైసెన్స్‌లు కేటాయించారు. అప్పట్లోనే సిట్టింగ్‌ రూమ్‌లకు పర్మిషన్‌ ఇచ్చి ఉంటే జిల్లాలో సుమారు రూ.10 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని తెలుస్తుంది. దుకాణానికి వచ్చి సిటింగ్‌ రూమ్‌ల ఏర్పాటుకు రూ.5 లక్షలు ధరగా గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. కానీ సిటింగ్‌ రూమ్‌లు ఇవ్వడానికి సంశయించారు. కానీ మందుబాబుల్లో వ్యతిరేకతతోపాటు మద్యం అమ్మకాలు మందకొడిగా సాగడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది. కొద్దిరోజుల్లోనే సిటింగ్‌ రూమ్‌ల ఏర్పాటుకు ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి.

బార్‌ యజమానుల వ్యతిరేకత

మద్యం దుకాణాల వద్ద సిటింగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తే బార్‌కు వచ్చేవారి సంఖ్య తగ్గుతుందని బార్‌ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణాల్లో ధర తక్కువ ఉండడంతోపాటు తినుబండారాలు అందుబాటులో ఉండడం వల్ల బార్ల వైపు ఎవరూ చూడరని చెబుతున్నారు. బార్‌లలో క్వార్టర్‌కు రూ. 30 నుండి రూ. 50 వరకు అదనంగా వసూలు చేయడం వల్ల మందుబాబులు ఎక్కువ శాతం మద్యం దుకాణాల వైపే చూస్తారని చెబుతున్నారు. కొద్ది రోజుల్లో బార్‌ల లైసెన్స్‌లు గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం బార్‌ల లైసెన్స్‌ల ఫీజులు తగ్గించి వారికి న్యాయం చేసే అవకాశం ఉంటుందన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతుంది.

ముందుగా గ్రామాల్లో అనుమతి..

బార్‌ల నిర్వాహకుల సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుగా గ్రామీణ ప్రాంత మద్యం దుకాణాలకు సిటింగ్‌ రూమ్‌ అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. కొంత కాలం అనంతరం పట్టణాలకు కూడా సిటింగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేసే విధంగా ఎక్సైజ్‌ శాఖ అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. సిటింగ్‌ రూమ్‌ల ఏర్పాటుకు అన్ని దుకాణాలకు ఒకేవిధంగా రూ.5 లక్షలు చొప్పున లైసెన్స్‌ ఫీజు ఉంటుందా.. లేక గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు వేర్వేరు ఫీజులు ఉంటాయా అనే స్పష్టత లేదు. సిటింగ్‌ రూమ్‌ల ఏర్పాటు కోసం కసరత్తు ప్రారంభమైందనే తెలుస్తుంది.

వరుస సెలవులతో జాప్యం

వరుస సెలవుల వల్ల పర్మిట్‌ రూమ్‌ల ఏర్పాటు ఆలస్యమైంది. వారం రోజుల్లో సిటింగ్‌ రూమ్‌ల ఏర్పాటుకు ఉత్తర్వులు రానున్నాయి. గతంలో ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ మంత్రివర్గం నిర్ణయాల వల్ల ఏర్పాటు ఆలస్యమైంది. సిటింగ్‌ రూమ్‌లు లేకపోవడం వల్ల మద్యం సేవించేవారు ఎక్కడబడితే అక్కడ సేవించి ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవారు. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం త్వరలోనే సిటింగ్‌ రూమ్‌ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది.

ఆర్‌ఎస్‌ కుమరేశన్‌, జిల్లా ఎక్సైజ్‌ అధికారి

Updated Date - Apr 14 , 2025 | 07:29 AM