గాలి, వాన బీభత్సం
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:43 AM
పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం గాలీ వాన బీభత్సం సృష్టిం చింది.

కూలిన చెట్లు.. విద్యుత్ స్తంభాలు.. పవర్ కట్
తాడేపల్లిగూడెం రూరల్/ఏలూరు సిటీ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం గాలీ వాన బీభత్సం సృష్టిం చింది. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో గంటపాటు వీచిన గాలు లకు భారీ వృక్షాలు నేలకూలాయి. మెట్ట ఉప్పరగూడెం రైస్‌మిల్ సమీపంలో ఓ తాటి చెట్టు నేలకూలి లారీపై పడి ధ్వంసమైంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్న సమయంలో గాలి వానతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. రోడ్లపై వున్న ధాన్యాన్ని కాపాడుకునే సమయంలో గాలికి బరకాలు ఎగిరిపోయి తడిసిపోయాయి. పెంట పాడు, గణపవరం, తణుకు, భీమవరం, కాళ్ల, ఆకివీడు, ఉండి, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు గట్టిగా వీచాయి. ఆయా ప్రాంతాల్లో గంటపాటు కరెంటు సరఫరా నిలు పుదల చేశారు. ఏలూరు నగరంతోపాటు చింతలపూడి, కొయ్యలగూడెం, జీలుగు మిల్లి, జంగారెడ్డిగూడెం, లింగపాలెం, నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి. ముసునూరు, కామవరపుకోట, టి.నరసాపురం, కుక్కునూరు, వేలేరు పాడు, పోలవరం, బుట్టాయిగూడెం, పెదవేగి, పెదపా డు, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, కైకలూరు తదితల ప్రాంతాల్లో ఈదురుగాలులు, వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి. రాత్రి ఎనిమిది గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏలూరు రూరల్ మండలం మాదేపల్లిలో విద్యుత్ తీగలపై చెట్టు పడటంతో స్తంభం దెబ్బతింది. పగలు భారీగా ఎండ తీవ్రత, సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది.