హాజరుంటేనే జీతాలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:22 AM
గ్రామ, వార్డు, సచివాల యాల ఉద్యోగులు కొందరిలో నిర్లక్ష్య ధోరణి ఇంకా పోవడం లేదు.

ఏలూరు రూరల్, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి):గ్రామ, వార్డు, సచివాల యాల ఉద్యోగులు కొందరిలో నిర్లక్ష్య ధోరణి ఇంకా పోవడం లేదు. సచివాలయ ఉద్యోగులంతా హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టం పోర్టల్ యాప్‌లో లాగిన్ అయ్యి తప్పక ఇన్‌వార్డు, అవుట్ వార్డు హాజరును మార్కింగ్ చేయాలని పదే పదే ప్రభుత్వం ఆదేశిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. కుంటి సాకులు చెబుతూ హాజరు వేయకుండా జీతాలు డ్రా చేస్తున్నారు. దీనివల్ల సర్వీసు డెలివరీ, ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించడంలో ఇబ్బందులు తలెత్తుతుండ డంతో ఇక నుంచి ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయాల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత 2021లో ఫిబ్రవరి 4న రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఉద్యోగి తప్పకుండా బయోమెట్రిక్ అటెండెన్స్ రోజుకు రెండుసార్లు వేయాలని ఆదేశించిం ది. ఆ తరువాత ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఎంఎస్ యాప్‌ను తీసుకుని వచ్చింది. ఇది జియో కో–ఆర్డినేట్స్ ఆధారంగా అటెండెన్స్‌ను మార్కింగ్ చేస్తుంది. ఉద్యోగి సంబంధిత సచివాలయానికి 300 మీటర్లలోపు ఉంటే అటెండెన్స్ మార్కింగ్ అవుతుంది. జాబ్‌కార్డు ప్రకారం ఇన్ వార్డు, అవుట్ వార్డు టైమింగ్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఏలూరు జిల్లాలోని పలుచోట్ల కొందరు నిర్లక్ష్య ధోరణితో ఉంటూ సమయానికి వచ్చి అటెండెన్స్‌ను మార్కింగ్ చేయకుండా ఆలస్యంగా వస్తున్నారు. కొంద రైతే తీరిగ్గా మధ్యాహ్నం వచ్చి ఇన్‌వార్డు, అవుట్ వార్డు ఒకేసారి మార్కింగ్ చేస్తున్నారు. అదేమంటే తాము ఫీల్డులో ఉన్నామని, ఫలానా అధికారి పని చెప్పారని, పింఛన్ల పంపిణీ ఆలస్యమైందని కారణాలు చెబుతున్నారు.
జిల్లాలో 605 సచివాలయాలు ఉన్నాయి. 4,700 మంది ఉద్యో గులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కీ ఫెర్ఫార్మెన్స్ ఇండి కేటర్ (కేపీఐ)లను సక్రమంగా పర్యవేక్షించలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ప్రజలకు సర్వీసు డెలివరీ సకాలంలో చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కారణాలతో హెచ్‌ఆర్‌ఎం పోర్టల్‌లో అటెండెన్స్ వేస్తేనే జీతాలు చెల్లించా ల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి తరచూ సమీక్షిం చాలని సూచించింది. డిప్యుటేషన్‌లో మినహా మిగిలినవన్నింటినీ రద్దు చేసి సిబ్బంది సచివాలయాల నుంచే విధులు నిర్వహించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది.