Eluru: మీరు దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా.. వైసీపీ నేతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే..
ABN, Publish Date - Feb 13 , 2025 | 03:09 PM
ఏలూరు జిల్లా వట్లూరులో ఓ వివాహ కార్యక్రమానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. అయితే ఫంక్షన్ హాల్ కారిడార్ మధ్యలో చింతమనేని వాహనానికి అడ్డుగా వైసీపీ నేత అబ్బయ్య చౌదరి డ్రైవర్ తన కారును పెట్టాడు.

ఏలూరు: దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. వట్లూరులోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి మధ్య రాజుకున్న వివాదం నియోజకవర్గ స్థాయి దాటి రాష్ట్రస్థాయిలో పొలిటికల్ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు పెను సంచలనం సృష్టిస్తోంది. కాగా, ప్రస్తుతం ఏలూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం సైతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అయితే ఈ వివాదంపై ఎమ్మెల్యే చింతమనేని మరోసారి స్పందించారు. దీంట్లో తమ తప్పేమీ లేదంటూ వైసీపీ నేత అబ్బయ్య చౌదరిపై విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ.."కొంతమంది తమ ఉనికి కాపాడుకోవడానికి సంచలనాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నేతలు చేసిన అరాచకాన్ని ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్తాను. చట్టం ప్రకారం కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. ఉద్దేశపూర్వకంగా నియోజకవర్గంలో గొడవలు సృష్టించేందుకు అబ్బయ్య చౌదరి ప్రయత్నించారు. వైసీపీ నేతలు అలా చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోనే పరిస్థితి లేదు. ఘటనపై విచారణ చేపట్టి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. నేను ఆగ్రహంతో బరస్ట్ అయిన మాట వాస్తవమే.
నా కారుకు అబ్బయ్య చౌదరి డ్రైవర్ తమ కారును అడ్డంపెట్టి, నా డ్రైవర్‌ను, మా వాళ్లను తిడితే చూస్తూ కూర్చుంటామా?. నా కారుకు ఎందుకు అడ్డంపెట్టారు. మీ ఉద్దేశం ఏంటి?. వైసీపీ నేతలంతా ప్రజల సొమ్ముతో తిరుగుతున్నారు. వాళ్లది దొంగల పార్టీ. మీకు సంస్కారం లేదు కాబట్టే సంస్కార హీనులుగా ప్రవర్తించారు. ఇది ప్రజాస్వామ్యం.. ఖబడ్దార్. మీరు ఏం చేసినా మేము చూస్తూ కూర్చోవాలా?. నేను అబ్బయ్య చౌదరి డ్రైవర్‌ను మందలించిన తర్వాతే వారు కారు పక్కకు తీశారు. నేను దుర్భాషలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది. మీ వల్ల కాదా?. నా కారుకు కెమెరా ఉంది. కావాలంటే విజువల్స్ ఇస్తాను. ఎవరిది తప్పో తెలిపోతుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ ఎమ్మెల్యే అయ్యావు. నీది, నీ ఫ్యామిలీది ఒక బతుకా?" అంటూ విమర్శలు గుప్పించారు.
అసలేం జరిగిందంటే..
ఏలూరు జిల్లా వట్లూరులో ఓ వివాహ కార్యక్రమానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. అయితే ఫంక్షన్ హాల్ కారిడార్ మధ్యలో చింతమనేని వాహనానికి అడ్డుగా వైసీపీ నేత అబ్బయ్య చౌదరి డ్రైవర్ తన కారును పెట్టాడు. అడ్డు తీయమని చెప్పినా వినకపోవడంతో ఆగ్రహానికి గురైన చింతమనేని.. వైసీపీ నేత డ్రైవర్‌పై దుర్భాషలాడారు. అనంతరం అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అయితే కాసేపటి తర్వాత ఇరువర్గాల నేతలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడంతా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హుటాహుటిన పోలీసులు చేరుకుని వారికి సద్దిచెప్పి పంపించేశారు. అయితే ఘటనపై ఏలూరు మూడో పట్టణ పోలీసులకు చింతమనేని డ్రైవర్ సుధీర్ ఫిర్యాదు చేశారు. ఇనుప రాడ్లతో తనతో సహా ఎమ్మెల్యే, గన్‌మెన్‌పై దాడి చేశారని తెలిపాడు. అబ్బయ్య చౌదరి సహా దాదాపు 25 మంది దాడి చేశారంటూ పోలీసులకు వెల్లడించాడు. అయితే ఘటనపై పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారుల సూచన మేరకు కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు తెలిపారు.
Updated Date - Feb 13 , 2025 | 03:09 PM