Gold Price Surge: పసిడి రూ.96,000 దాటి..
ABN , Publish Date - Apr 12 , 2025 | 03:52 AM
ఒక్కరోజే రూ.6,250 పెరిగిన పసిడి ధర రూ.96,450కి చేరి జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయంగా ట్రేడ్ వార్ ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి

ఒక్కరోజే రూ.6,250 పెరుగుదల
రూ.96,450కి చేరిన 10 గ్రాముల ధర
సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి ఇది..
రూ.2,300 పెరిగి రూ.95,500కు చేరుకున్న కిలో వెండి రేటు
అంతర్జాతీయ మార్కెట్లో 3,200 డాలర్లు దాటిన ఔన్స్ గోల్డ్
అమెరికా-చైనా ట్రేడ్ వార్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ: పసిడి తగ్గినట్టే తగ్గి మళ్లీ కొండెక్కింది. ఈసారి మరింత పైకి ఎగబాకింది. ఢిల్లీ మార్కెట్లో మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం ఒక్కరోజే రూ.6,250 పెరిగి సరికొత్త జీవితకాల రికార్డు స్థాయి రూ.96,450కి చేరింది. దేశీయంగా 10 గ్రాముల బంగారం రూ.96,000 దాటడం ఇదే తొలిసారి. 99.5 శాతం స్వచ్ఛత లోహం సైతం ఇదే స్థాయిలో పెరిగి రూ.96,000గా నమోదైంది. కిలో వెండి సైతం రూ.2,300 పెరుగుదలతో రూ.95,500 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్ అమాంతం పెరగడం ఇందుకు ప్రధాన కారణం. అమెరికా-చైనా మధ్య సుంకాల యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ కొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి 3,249 డాలర్లకు ఎగబాకింది. సిల్వర్ మళ్లీ 32 డాలర్లకు చేరువైంది. భారత్ సహా ఇతర దేశాలపై సుంకాల అమలును 90 రోజుల పాటు వాయిదా వేసిన ట్రంప్.. చైనాపై సుంకాలను మాత్రం మరింత పెంచి అమలులోకి తెచ్చారు. దాంతో చైనా కూడా దీటుగా అమెరికాపై సుంకాలు పెంచింది. ఈ రెండు ప్రధాన దేశాల మధ్య సుంకాల యుద్ధం అంతర్జాతీయ ఎగుమతి వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించవచ్చన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగా డాలర్ మరింత బలహీనపడటం కూడా బులియన్ ర్యాలీకి మరో కారణమైంది.
మరింత పైకేనా..? మళ్లీ కిందికా..?
పసిడి ధరల భవిష్యత్ గమనంపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్య యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితులు, మాంద్యం, ద్రవ్యోల్బణం మళ్లీ పెరగవచ్చన్న భయాందోళనల నేపథ్యంలో బంగారం మరింత పెరగనుందని యూబీఎస్, గోల్డ్‌మన్ శాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, మాక్వెరీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు భావిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఔన్స్ గోల్డ్ 3,500 డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా వేశాయి. అంతర్జాతీయ ఆర్థిక సలహాల సంస్థ డెవేర్ గ్రూప్ 4,500 డాలర్ల వరకు పెరిగే అవకాశాల్లేకపోలేవని అంటోంది. అయితే, దీర్ఘకాలికంగా గోల్డ్ బుల్లిష్‌గానే కన్పిస్తున్నప్పటికీ స్వల్ప, మధ్యకాలికంగా భారీ దిద్దుబాటుకు లోనుకావచ్చన్న అంచనాలూ ఉన్నాయి. వినియోగ డిమాండ్‌తో సంబంధం లేకుండా బంగారం ధర ఈ ఏడాదిలో అతివేగంగా పెరుగుతూ వచ్చిందని పేస్ 360 చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ అంటున్నారు. వచ్చే 6-10 నెలల్లో ఔన్స్ గోల్డ్ ధర మళ్లీ 2,400-2,600 డాలర్ల వరకు పడిపోయే అవకాశాలున్నాయని ఆయ న అంచనా వేశారు. పసిడిలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి అది మంచి అవకాశమని గోయల్ పేర్కొన్నారు.