Share News

దూసుకుపోయిన వాణిజ్య లోటు

ABN , Publish Date - Apr 16 , 2025 | 04:42 AM

ఎగుమతుల రంగం నాలుగు నెలల వరుస క్షీణతకు తెర దించింది. మార్చి నెలలో ఎగుమతులు 0.7ు పెరిగి 4,197 కోట్ల డాలర్లకు (రూ.3,57 లక్షల కోట్లు) చేరాయి. వాణిజ్య లోటు 2,154 కోట్ల డాలర్లకు (రూ.1.83 లక్షల కోట్లు) పెరిగింది. మార్చి నెలలో...

దూసుకుపోయిన వాణిజ్య లోటు

2024-25లో రూ.24.04 లక్షల కోట్లు.. మార్చి ఎగుమతుల్లో స్వల్ప వృద్ధి

న్యూఢిల్లీ: ఎగుమతుల రంగం నాలుగు నెలల వరుస క్షీణతకు తెర దించింది. మార్చి నెలలో ఎగుమతులు 0.7ు పెరిగి 4,197 కోట్ల డాలర్లకు (రూ.3,57 లక్షల కోట్లు) చేరాయి. వాణిజ్య లోటు 2,154 కోట్ల డాలర్లకు (రూ.1.83 లక్షల కోట్లు) పెరిగింది. మార్చి నెలలో దిగుమతులు నాలుగు నెలల గరిష్ఠ స్థాయి 11.3ు వృద్ధితో 6,351 కోట్ల డాలర్లకు (రూ.5.40 లక్షల కోట్లు) చేరాయి. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎగుమతులు 0.08 శాతం పెరిగి 43,742 కోట్ల డాలర్లకు (రూ.37.18 లక్షల కోట్లు) చేరాయి. ఇదే కాలంలో దిగుమతులు 6.62ు పెరిగి 72,024 కోట్ల డాలర్లకు (రూ.61.22 లక్షల కోట్లు) చేరడంతో వాణిజ్య లోటు 28,282 కోట్ల డాలర్లుగా (రూ.24.04 లక్షల కోట్లు) నమోదయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 24,114 కోట్ల డాలర్లు (రూ.20.50 లక్షల కోట్లు)గా ఉంది.


వస్తుసేవల ఎగుమతులన్నింటినీ కలిపితే 2024-25లో వాటి విలువ రికార్డు స్థాయిలో 82,093 కోట్ల డాలర్లకు (రూ.69.80 లక్షల కోట్లు) చేరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 77,813 కోట్ల డాలర్లతో (రూ.66.14 లక్షల కోట్లు) పోల్చితే ఇది 5.5ు అధికం. ప్రపంచ స్థాయిలో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తంలో వస్తు ఎగుమతులు జీవితకాల గరిష్ఠ స్థాయిని నమోదు చేశాయని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ భరత్‌వాల్‌ అన్నారు. ప్రధానంగా ఇంజనీరింగ్‌, ఎలక్ర్టానిక్స్‌, ఫార్మా, రెడీమేడ్‌ గార్మెంట్లు, బియ్యం, పత్తి, కాటన్‌ యార్న్‌/ఫ్యాబ్రిక్స్‌, ప్లాస్టిక్‌, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, టీ, పొగాకు ఎగుమతులకు ఉత్తేజంగా నిలిచాయి.


ఆరేళ్ల కనిష్ఠానికి

రిటైల్‌ ద్రవ్యోల్బణం

దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం మార్చి నెలలో ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 3.34 శాతానికి దిగి వచ్చింది. కూరగాయలు, ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహార వస్తువుల ధరలు తగ్గడం ఇందుకు కారణం. 2019 ఆగస్టులో నమోదైన 3.28ు తర్వాత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఈ స్థాయికి దిగి రావడం ఇదే ప్రథమం. ఇది ఫిబ్రవరిలో 3.61ు ఉండగా గత ఏడాది మార్చిలో 4.85ు ఉంది. మార్చిలో ఆహార ద్రవ్యోల్బణం 3.75 శాతానికి దిగి వచ్చింది. రిజర్వ్‌ బ్యాంక్‌ రెపోరేటు నిర్ణయించేందుకు రిటైల్‌ ద్రవ్యోల్బణాన్నే పరిగణనలోకి తీసుకుంటుంది గనుక రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు మరింతగా తగ్గించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇదిలా ఉండగా టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కూడా మార్చి నెలలో 6 నెలల కనిష్ఠ స్థాయి 2.05 శాతానికి దిగి వచ్చింది. కూరగాయలు, బంగాళాదుంపలు, ఇతర ఆహార వస్తువుల ధరలు గణనీయంగా తగ్గడం ఇందుకు దోహదపడింది.

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 16 , 2025 | 04:42 AM