Business News: చిరు వ్యాపారులకు శుభవార్త.. అందుబాటులోకి కొత్త పథకం
ABN , Publish Date - Apr 08 , 2025 | 10:47 PM
సైరస్ పూనావాలా గ్రూప్ ప్రమోటర్ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (పీఎఫ్ఎల్) నూతనంగా షాప్‌కీపర్ లోన్ వ్యాపారాన్ని ప్రారంభించింది. చిన్న రిటైలర్లు, కిరాణా దుకాణాలు నగదు ప్రవాహం, నిల్వలు, వినియోగదారుల నిర్వహణ వంటి కీలక ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుంది.

ముంబై: సైరస్ పూనావాలా గ్రూప్ ప్రమోటర్ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (పీఎఫ్ఎల్) నూతనంగా షాప్‌కీపర్ లోన్ వ్యాపారాన్ని ప్రారంభించింది. చిన్న రిటైలర్లు, కిరాణా దుకాణాలు నగదు ప్రవాహం, నిల్వలు, వినియోగదారుల నిర్వహణ వంటి కీలక ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుంది. వారు తమ నిర్వహణ సామర్ధ్యాలను మెరుగుపరుచుకునేందుకు తోడ్పడుతుంది. దేశవ్యాప్తంగా చిన్న రిటైలర్లు, కిరాణా దుకాణాదారులకు సరిపోయే ఆర్థిక పరిష్కారాలను అందించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో 44 ప్రాంతాల్లో పీఎఫ్‌ఎల్ కార్యకలాపాలు ప్రారంభించనుంది. షాప్‌కీపర్ లోన్ వ్యాపారంతో పీఎఫ్ఎల్ మొత్తంగా 4 నూతన వ్యాపారాలను ప్రారంభించినట్లు అవుతుంది. "భారతదేశ చిన్న రిటైలర్లు, మన వినియోగదారు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివారు. అయినప్పటికీ, సమయానికి రుణ సదుపాయం అందుబాటులో లేకపోవడం వారి వృద్ధికి అవరోధంగా మారుతోంది. వారి నిర్వహణ మూలధన అవసరాలను తీర్చే పరిష్కారాలను అందించడం ద్వారా, దీర్ఘకాలికంగా వ్యాపారానికి మద్దతుగా నిలిచేలా షాప్‌కీపర్ లోన్ ద్వారా ఈ అంతరాన్ని పూరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తీవ్ర పోటీ ఉండే రిటైల్ రంగంలో తమ వ్యాపారాలను నిలబెట్టుకోవడంలో వారిని ఆదుకోవాలని భావిస్తున్నాం" అని పూనావాలా ఫిన్‌కార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అరవింద్ కపిల్ పేర్కొన్నారు.
గోద్రెజ్ అరుదైన ఘనత..
రియల్ ఎస్టేట్ డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ అరుదైన ఘనత సాధించింది. ఆర్థిక సంవత్సరం, త్రైమాసికాలవారీగాను అత్యధిక బుకింగ్స్ నమోదు చేసినట్లు ప్రకటించింది. త్రైమాసికాలవారీగాను, పూర్తి సంవత్సరానికి గాను గోద్రెజ్ ప్రాపర్టీస్ అత్యధిక బుకింగ్స్ నమోదు చేసింది. బుకింగ్ విలువ Q4 FY25లో QoQ ప్రాతిపదికన 87%, YoY ప్రాతిపదికన 7% పెరిగి రూ. 10,163 కోట్లకు చేరింది. 7.52 మిలియన్ చ.అ.విస్తీర్ణంలో మొత్తం 3,703 గృహాల విక్రయించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.