బ్యాంకింగ్ షేర్ల దన్ను
ABN , Publish Date - Jan 29 , 2025 | 02:17 AM
వరుసగా రెండు రోజులు భారీ నష్టాలు చవిచూసిన సెన్సెక్స్, నిఫ్టీ.. మంగళవారం ట్రేడింగ్‌లో మళ్లీ పుంజుకున్నాయి. ఆర్థిక వ్యవస్థలో రూ.1.5 లక్షల కోట్ల మేర ద్రవ్య లభ్యత పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోవడంతో...

ఆర్థిక వ్యవస్థలోకి రూ.1.5 లక్షల కోట్లు విడుదల చేయాలని ఆర్‌బీఐ నిర్ణయం
ఆర్థిక రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు
ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,146 పాయింట్లు అప్
చివరికి 535 పాయింట్ల లాభంతో ముగింపు
ముంబై: వరుసగా రెండు రోజులు భారీ నష్టాలు చవిచూసిన సెన్సెక్స్, నిఫ్టీ.. మంగళవారం ట్రేడింగ్‌లో మళ్లీ పుంజుకున్నాయి. ఆర్థిక వ్యవస్థలో రూ.1.5 లక్షల కోట్ల మేర ద్రవ్య లభ్యత పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోవడంతో బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల షేర్లలో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడం సూచీల ర్యాలీకి దోహదపడింది. ఆరంభం నుంచే పాజిటివ్‌గా ట్రేడవుతూ వచ్చిన సెన్సెక్స్.. ఒకదశలో 1,146.79 పాయింట్లు ఎగబాకి 76,512.96 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆఖరి అరగంటలో మదుపరులు మళ్లీ లాభాల స్వీకరణకు పాల్పడటంతో సూచీ 535.24 పాయింట్ల లాభంతో 75,901.41 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 308 పాయింట్ల పెరుగుదలతో 23,138 స్థాయికి చేరుకున్నప్పటికీ, చివర్లో 128.10 పాయింట్ల లాభంతో 22,957.25 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 18 రాణించాయి.
నిధుల కొరత తీర్చేందుకు ఆర్‌బీఐ చర్యలు
బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న నిధుల కొరత తీర్చేందుకు ఆర్‌బీఐ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ చర్యల ద్వారా బ్యాంకింగ్ రంగానికి రూ.1.5 లక్షల కోట్ల నిధులు సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో రూ.43,000 కోట్లు ఈ నెల 31న బ్యాంకుల నుంచి 500 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిఽధుల కొనుగోలు ద్వారా ఆర్‌బీఐ సమకూరుస్తుంది. మళ్లీ ఆరు నెలల్లో ఈ మొత్తాన్ని బ్యాంకులకు విక్రయిస్తుంది. ఇంకో, రూ.60,000 కోట్లు బ్యాంకుల వద్ద ఉన్న ప్రభుత్వ రుణ పత్రాలు కొనుగోలు ద్వారా, మరో రూ.50,000 కోట్లు వేరియబుల్ రేటు రెపో (వీఆర్‌ఆర్) వేలం ద్వారా సమకూర్చనున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.
ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 26 పైసలు నష్టపోయి 86.57 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో పాటు ట్రంప్ సుంకాల హెచ్చరికలు మన కరెన్సీని కుంగదీశాయి.
ఇవి కూడా చదవండి:
Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Read More Business News and Latest Telugu News