తగ్గిన రెపో రేటు.. మీకు ఎంత డబ్బు సేవ్ అవుతుందో తెలుసా..
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:57 PM
Repo Rate: ఆర్బీఐ రెపో రేటును 6.25 శాతంనుంచి 6 శాతానికి తగ్గించింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో లోన్లు తీసుకుని వడ్డీ కడుతున్న వారికి.. ఇకపై లోన్లు తీసుకోవాలనుకునేవారికి లాభం కలుగనుంది. వడ్డీ రేటు టైపును బట్టి పెద్ద మొత్తంలో ఆదా అయ్యే అవకాశం ఉంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. రెపో రేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఈ బుధవారం నిర్ణయం తీసుకుంది. 6.25 శాతం ఉన్న రెపో రేటును 6 శాతానికి తగ్గించింది. లోన్లు తీసుకుని ఈఎమ్ఐలు కడుతున్న వారికి, కొత్తగా లోన్లు తీసుకోబోయే వారికి ఇది గుడ్‌న్యూస్ అని చెప్పాలి. గృహ, పర్సనల్, వాహనాల రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి. మీరు లోన్లు తీసుకుని ఈఎమ్ఐలు కడుతుంటే.. ఆ ఈఎమ్ఐల అమౌంట్ కూడా తగ్గనుంది. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీరు ఏ రకమైన వడ్డీతో లోన్ తీసుకున్నారు?.. ఫిక్స్‌డ్ వడ్డీ రేటుతో లోను తీసుకున్నారా? ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో లోను తీసుకున్నారా?..
ఆర్బీఐ తీసుకున్న రెపోరేటు తగ్గింపు నిర్ణయం ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో లోను తీసుకున్న వారికే లాభంగా ఉంటుంది. ఎందుకో తెలియాలంటే.. ఫిక్స్‌డ్ వడ్డీ రేటు, ఫ్లోటింగ్ వడ్డీ రేటుల మధ్య తేడా తెలుసుకోవాలి. మీరు గనుక ఫిక్స్‌డ్ వడ్డీ రేటు కింద లోను తీసుకుంటే.. మీరు ఆ లోను తిరిగి చెల్లించే వరకు వడ్డీ రేటు ఒకేలా ఉంటుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు. రెపో రేటు పెరిగినా తగ్గినా మన వడ్డీ రేట్లపై ప్రభావం పడదు. ఇక, ఫ్లోటింగ్ వడ్డీ రేటు విషయానికి వస్తే.. రెపో రేటును బట్టి ఈ వడ్డీ పెరుగుతుంది.. తగ్గుతుంది. ఆర్బీఐ రెపో రేటు పెంచింది అనుకోండి.. వడ్డీ పెరుగుతుంది. అదే రెపో రేటు తగ్గితే.. లోను మీద వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. రెపో రేటు ఎంత పెరుగుతోంది.. ఎంత తగ్గుతోంది అన్నదాని మీదే వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది.
రెపో రేటు తగ్గుదలతో ఎంత లాభం?
ఒక వేళ మీరు ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో లోను తీసుకుని ఉంటే.. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంత లాభం చేకూరనుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు.. మీరు ఫ్లోటింగ్ వడ్డీ రేటు కింద.. 8.70 వడ్డీతో 50 లక్షల రూపాయలు లోను తీసుకుని ఉన్నారు. దాన్ని 30 సంవత్సరాల్లో కట్టేలా ఈఎమ్ఐ పెట్టుకున్నారు. అప్పుడు మీరు నెలకు 39,157 రూపాయలు ఈఎమ్ఐ కట్టాల్సి ఉంటుంది. రెపోరేటు మీద ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు తగ్గింది కాబట్టి.. వడ్డీ రేటు 8.70 నుంచి 8.45 శాతానికి తగ్గుతుంది. అప్పుడు మీరు నెలకు కట్టాల్సిన ఈఎమ్ఐ 38,269 రూపాయలు ఉంటుంది. అంటే మీరు నెలకు 888 రూపాయలు సేవ్ చేశారన్న మాట. సంవత్సరానికి 12 ఈఎమ్ఐలు.. నెలకు 888 చొప్పున సంవత్సరానికి 10,656 రూపాయలు సేవ్ అవుతుంది. ఇక, 30 సంవత్సరాలకు 3,19,680 రూపాయలు సేవ్ అవుతాయి.
ఆర్బీఐ నిర్ణయం హర్షనీయం: సీఎస్ శెట్టి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తీసుకున్న నిర్ణయాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ సీఎస్ సెట్టి స్వాగతించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపు సకాలంలో తీసుకున్న నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ... “RBI వడ్డీ రేటు తగ్గింపు సత్వరమైన, సమయోచిత చర్య. ఈ నిర్ణయం మార్కెట్‌కు మద్దతుగా నిలుస్తుంది. అనుకూల విధానం సుంకాల వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఏర్పడే పరోక్ష ప్రభావాన్ని తగ్గిస్తుంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటంతో, 2026 ఆర్థిక సంవత్సరంలో దేశం వృద్ధి పథంలో పయనిస్తుంది” అని తెలిపారు.