Share News

RBI Forex Strategy: ఫారెక్స్‌లో పెరిగిన పసిడి వాటా

ABN , Publish Date - Apr 14 , 2025 | 02:59 AM

ఆర్‌బీఐ ఫారెక్స్‌ పెట్టుబడుల్లో కీలక మార్పులు చేస్తూ అమెరికా బాండ్స్‌ వాటా తగ్గించి బంగారంలో మదుపు పెంచింది. ఫారెక్స్‌ నిల్వల్లో పసిడి వాటా 8% నుంచి 11%కి పెరిగింది

RBI Forex Strategy: ఫారెక్స్‌లో పెరిగిన పసిడి వాటా

  • తగ్గిన అమెరికా ప్రభుత్వ బాండ్స్‌

  • పెట్టుబడుల వ్యూహాలు మార్చిన ఆర్‌బీఐ

ముంబై: విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్‌) నిల్వల పెట్డుబడుల వ్యూహాన్ని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మార్చింది. అమెరికా ప్రభుత్వ రుణ పత్రాల్లో (బాండ్స్‌) పెట్టుబడులు తగ్గించి పసిడిలో పెట్టుబడులు పెంచుతోంది. ఈ ఏడాది జనవరి నాటికి ఉన్న 63,060 కోట్ల డాలర్ల (సుమారు రూ.54.61 లక్షల కోట్లు) ఫారెక్స్‌లో 22,570 కోట్ల డాలర్లను (సుమారు రూ.19.54 లక్షల కోట్లు) అమెరికా ప్రభుత్వ రుణ పత్రాల్లో మదుపు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 1,040 కోట్ల డాలర్లు తక్కువ. అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ తాజా వివరాలు విడుదల చేసింది.

8 నుంచి 11 శాతానికి పసిడి వాటా: ఇదే సమయంలో మొత్తం ఫారెక్స్‌ నిల్వల్లో పసిడి వాటా 8 శాతం నుంచి 11 శాతానికి చేరింది. ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద 879 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. గడిచిన 14 నెలల్లో 12 నెలలు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెలా సగటున 6.3 టన్నుల చొప్పున బంగారం కొనుగోలు చేసింది.


కారణాలు ఏంటి?

ఆర్‌బీఐ ఫారెక్స్‌ నిల్వల్లో అమెరికా ప్రభుత్వ రుణ పత్రాల వాటా తగ్గడానికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. మారకం రేటులో మార్పులు లేదా అమ్మకం లేదా కాలం తీరిపోవడం కారణమై ఉండవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ప్రధాన ఆర్థికవేత్త మదన్‌ సబ్నవిస్‌ చెప్పారు. ఏదేమైనా ఆర్‌బీఐ ఫారెక్స్‌ నిల్వలను ఒకటి రెండు పెట్టుబడులకే పరిమితం కాకుండా మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా పసిడి, యూరో, పౌండ్‌ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడుల్లోకి వివిధీకరిస్తోందన్నారు. ఇటీవల ప్రదాన కరెన్సీలతో డాలర్‌ మారకం రేటు గణనీయంగా తగ్గటం ఇందుకు కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - Apr 14 , 2025 | 03:01 AM