Interest Rates: ఇన్వెస్ట్ చేస్తున్నారా, లోన్ తీసుకుంటున్నారా.. SBI, HDFC, BOI కొత్త వడ్డీ రేట్లు చూశారా..
ABN , Publish Date - Apr 14 , 2025 | 04:26 PM
భారత రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో, దేశీయ బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రధాన బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) వంటివి తమ వడ్డీ రేట్లను తిరిగి సమీక్షించాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

ఇటీవల భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆఫ్ ఇండియా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత, దేశంలోని కీలక బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పునఃసమీక్షించాయి. దీంతోపాటు బ్యాంకింగ్ రంగంలో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రధాన బ్యాంకులైన HDFC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) వంటివి ఇప్పటికే తమ డిపాజిట్, లోన్ సంబంధిత వడ్డీ రేట్లను సవరించాయి. ఈ పరిణామాలు మీ పొదుపులు, పెట్టుబడులు లేదా లోన్లపై ఎలా ప్రభావం చూపిస్తాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
HDFC బ్యాంక్
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్ తన సేవింగ్ ఖాతా వడ్డీ రేటును తగ్గించింది. ఈ క్రమంలో రూ. 50 లక్షల లోపు నిల్వలకు: వడ్డీ రేటు 3% నుంచి 2.75%కి తగ్గింది. రూ. 50 లక్షలకంటే ఎక్కువ నిల్వలకు: వడ్డీ రేటు 3.5% నుంచి 3.25%గా ఉంది. ఇది HDFC కస్టమర్లకు చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే గత 14 సంవత్సరాలలో సేవింగ్ ఖాతా వడ్డీ మార్పు జరగలేదు. 2011లో గరిష్టంగా 4% వద్ద ఉన్న రేటు ఇప్పుడు 2.75%కి చేరింది. ఇదే తరహాలో, ఏప్రిల్ 1 నుంచి HDFC బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రేట్లను కూడా 35–40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇది డిపాజిట్ దారుల రాబడిని ప్రభావితం చేస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన SBI కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. ఏప్రిల్ 15 నుంచి కొత్త FD వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి:
1 నుంచి 2 సంవత్సరాల FDలు: వడ్డీ 6.80% నుంచి 6.70%కి తగ్గింది
2 నుంచి 3 సంవత్సరాల FDలు: వడ్డీ 7% నుంచి 6.90%కి తగ్గింది.
సీనియర్ సిటిజెన్ల కోసం SBI "SBI We Care" అనే ప్రత్యేక పథకాన్ని కొనసాగిస్తోంది. ఇందులో వడ్డీ రేట్లు 4% నుంచి 7.5% వరకు ఉన్నాయి.
ఇంకా, SBI తన ప్రత్యేక FD పథకం అయిన “అమృత వృష్టి” (444 రోజుల FD)ను తిరిగి తీసుకువచ్చింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI)
బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లపై కీలకమైన మార్పులు చేసింది. ఏప్రిల్ 15 నుంచి కొన్ని FDలకు వడ్డీ రేట్లు తగ్గించబడ్డాయి.
91–179 రోజులు: వడ్డీ రేటు 4.5% నుంచి 4.25%.
180 రోజులు – 1 సంవత్సరం: వడ్డీ 5.75%.
1 సంవత్సరం FD: వడ్డీ 6.8% నుంచి 7.05%కి పెరిగింది (కొంత ఉపశమనంగా!).
1–2 సంవత్సరాల FDలు: 6.75% (5 బేసిస్ పాయింట్లు తగ్గింది).
రూ. 3 కోట్లు కంటే ఎక్కువ FDలపై కూడా మార్పులు చోటుచేసుకున్నాయి.
ఉదాహరణకు: 91–179 రోజులు FDలపై వడ్డీ 6% నుంచి 5.75%కి తగ్గింది.
180–210 రోజులు: వడ్డీ 6.5% నుంచి 6.25%.
400 రోజుల ప్రత్యేక FD స్కీమ్ (7.3% వడ్డీతో)ను బ్యాంక్ ఉపసంహరించుకుంది
ఈ మార్పులన్నీ చూస్తే, చిన్న పొదుపుదారులు, సీనియర్ సిటిజెన్లు తమ డిపాజిట్లపై తక్కువ ఆదాయం పొందే ఛాన్సుంది. అయితే, ఇది కొంత మంది పెట్టుబడిదారులకు మత్రం కొత్త అవకాశాలను అందిస్తుందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
Forex vs Credit Card: జీరో ఫారెక్స్ కార్డ్ vs క్రెడిట్ కార్డ్..వీటిలో ఏది బెస్ట్ ఛాయిస్
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
Meta: మెటా మార్క్ జుకర్‌బర్గ్ చైనాతో ఒప్పందం..అమెరికాను మోసం చేశాడా..
Read More Business News and Latest Telugu News