భారత ఫార్మాకు ట్రంప్ సుంకాల ముప్పు
ABN , Publish Date - Feb 20 , 2025 | 02:31 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. యూఎ్‌సలోకి దిగుమతయ్యే ఔషధాలు, సెమీకండక్టర్లపై 25 శాతం లేదా అంతకంటే అధిక సుంకం విధిస్తానని, ఆపై సుంకాన్ని మరింత పెంచుకుంటూ పోతానని హెచ్చరించారు...

అమెరికాలోకి దిగుమతయ్యే ఔషధాలపై కనీసం 25% టారిఫ్
మన జనరిక్ ఔషఽధ సంస్థలకు అమెరికానే అతిపెద్ద మార్కెట్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. యూఎ్‌సలోకి దిగుమతయ్యే ఔషధాలు, సెమీకండక్టర్లపై 25 శాతం లేదా అంతకంటే అధిక సుంకం విధిస్తానని, ఆపై సుంకాన్ని మరింత పెంచుకుంటూ పోతానని హెచ్చరించారు. అదే గనక జరిగితే, భారత ఫార్మాస్యూటికల్స్ రంగం, ప్రధానంగా హైదరాబాద్‌కు చెందిన ఔషధ కంపెనీలపై అధిక ప్రభావం పడనుంది. దేశీయ ఫార్మా సంస్థల జనరిక్ ఔషధాలకు అమెరికా అతిపెద్ద మార్కెట్ కావడమే అందుకు కారణం.. ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక కౌన్సిల్ (ఫార్మెక్సిల్) లెక్కల ప్రకారం..2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మా కంపెనీలు అమెరికాకు 870 కోట్ల డాలర్ల (ప్రస్తుత మారకం విలువ ప్రకారం రూ.75,690 కోట్లు) ఔషధాలను ఎగుమతి చేశాయి. ఫార్మా ఎగుమతుల్లో అమెరికా వాటాయే 31 శాతంగా ఉంది.
అమెరికా వినియోగదారులకే నష్టం: ఫార్మెక్సిల్
అమెరికా చర్య ఆ దేశ వినియోగదారులకే నష్టమని ఫార్మెక్సిల్ అభిప్రాయపడింది. ‘‘అమెరికా టారి్‌ఫలతో తక్షణ ప్రభావమేమీ ఉండదు. ఒకవేళ సుంకం విధిస్తే, దిగుమతుల భారం పెరగడం వల్ల అమెరికా వినియోగదారులకే నష్టం. ప్రస్తుతం ఇండస్ట్రీ ఈ విషయంలో వేచి చూసే ధోరణిలో ఉంది. సాధారణంగా మన కంపెనీలు అత్యంత ఖరీదైన పేటెంట్ డ్రగ్స్‌కు జనరిక్ వెర్షన్లను యూఎ్‌సకు సరఫరా చేస్తుంటాయి’’ అని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజ భాను అన్నారు. ప్రముఖ రీసెర్చ్ కంపెనీ ఐక్యూవీఐఏ ప్రకారం.. 2022లో అమెరికాలో డాక్టర్లు పేషెంట్లకు రాసిచ్చిన జనరిక్ ఔషధాల్లో దాదాపు సగం భారత కంపెనీలు సరఫరా చేసినవే. తద్వారా యూఎస్ హెల్త్‌కేర్ సిస్టమ్ ఆ ఏడాదిలో 21,900 కోట్ల డాలర్లు (రూ.19.05 లక్షల కోట్లు) ఆదా చేయగలిగిందని భాను అన్నారు. 2013-22 మధ్యకాలంలో ఏకంగా 1.3 లక్షల కోట్ల డాలర్లు (రూ.113 లక్షల కోట్లు) ఆదా జరిగిందన్నారు. వచ్చే ఐదేళ్లలో అమెరికా మరో 1.3 లక్షల కోట్ల డాలర్లు ఆదా చేసుకోగలిగే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుత సుంకం సున్నా
అమెరికా ప్రస్తుతం భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఔషధాలపై ఎలాంటి సుంకం విధించడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2,900 కోట్ల డాలర్ల విలువైన ఔషధాలను అమెరికా సహా ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజ భాను తెలిపారు. ఆర్థిక సంవత్సరంలో గడిచిన 10 నెలల్లో (ఏప్రిల్-జనవరి) ఫార్మా ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 7.84 శాతం వృద్ధితో 2,430 కోట్ల డాలర్లకు చేరుకున్నాయన్నారు.
అమెరికా ఎగుమతి చేస్తున్న ఔషధ కంపెనీలు..
సన్ ఫార్మా: దేశంలో అతిపెద్ద ఔషధ కంపెనీ సన్ ఫార్మాస్యూటికల్‌కు 2023-24 ఆర్థిక సంవత్సర ఆదాయంలో 32 శాతం అమెరికా మార్కెట్ నుంచే సమకూరింది. మన ఔషధాలపై ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తే, ఆ భారాన్ని వినియోగదారుల పైకి బదిలీ చేయకతప్పదని కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ అన్నారు. సన్ ఫార్మా 100 దేశాలకు ఔషధాలను ఎగమతి చేస్తోంది. కంపెనీ వార్షికాదాయంలో ఎగుమతుల వాటాయే 72.7 శాతంగా ఉంది.
డాక్టర్ రెడ్డీస్: హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీ్‌సకు ఉత్తర అమెరికానే అతిపెద్ద మార్కెట్. 2023-24 ఆర్థిక సంవత్సర అమ్మకాల్లో ఈ మార్కెట్ వాటాయే 47 శాతంగా ఉంది. కంపెనీ ఈ మార్కెట్‌కు అధికంగా ఆంకాలజీ, ఇమ్యూనాలజీ థెరపీలకు సంబంధించిన జనరిక్ ఔషధాలను సరఫరా చేస్తుంది. 2022-23తో పోలిస్తే వీటి విక్రయాలు 28 శాతం పెరిగాయి.
అరబిందో ఫార్మా: హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మాకు గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా మార్కెట్ నుంచి ఆదాయం వార్షిక ప్రాతిపదికన 24 శాతం వృద్ధితో రూ.13,867 కోట్లకు పెరిగింది. కంపెనీ మొత్తం రెవెన్యూలో ఈ మార్కెట్ వాటాయే 48 శాతంగా ఉంది. అంతేకాదు, కంపెనీకిదే అతిపెద్ద మార్కెట్ కూడా.
నాట్కో ఫార్మా: గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయంలో 78 శాతం అంతర్జాతీయ వ్యాపారం ద్వారానే సమకూరింది. సంస్థకు అతిపెద్ద ఎగుమతి మార్కెట్లలో అమెరికా ఒకటి. ఈ దేశానికి కంపెనీ కేన్సర్ సహా పలు జనరిక్ ఔషధాలను ఎగమతి చేస్తోంది.
దివీస్ లేబరేటరీస్: గత ఆర్థిక సంవత్సరానికి అమెరికా మార్కెట్లో దివీస్ అమ్మకాలు రూ.1,310 కోట్లుగా నమోదయ్యాయి. కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ వాటా 17.1 శాతంగా ఉంది. సంస్థకు యూరప్ తర్వాత అతిపెద్ద మార్కెట్ అమెరికాయే.
సిప్లా: గత ఆర్థిక సంవత్సరంలో సిప్లా ఆదాయంలో 30 శాతం ఉత్తర అమెరికా మార్కెట్ నుంచే సమకూరింది. కంపెనీకిది రెండో అతిపెద్ద మార్కెట్ కూడా. అమ్మకాలపరంగా అమెరికాలోని టాప్-15 ఔషధ కంపెనీల్లో సిప్లా ఒకటి.
బయోకాన్: 2023-24 ఆర్థిక సంవత్సరానికి బయోకాన్ ఆదాయంలో 44 శాతం అమెరికా మార్కెట్ నుంచే లభించింది. కంపెనీకిదే అతిపెద్ద మార్కెట్. ఈ కంపెనీ యూఎస్‌కు అధికంగా కీళ్లవాతం, కేన్సర్ చికిత్సలో ఉపయోగించే సంక్లిష్ట బయోలాజిక్స్‌కు కాపీ అయిన బయోసిమిలర్స్‌ను ఎగమతి చేస్తుంటుంది. ఐక్యూవీఐఏ ప్రకారం.. 2022లో అమెరికాలో అమ్ముడైన బయోసిమిలర్స్‌లో 15 శాతం భారత కంపెనీలు సరఫరా చేసినవే.
లుపిన్: 2022-23 ఆర్థిక సంవత్సరానికి లుపిన్ మొత్తం విక్రయాల్లో ఉత్తర అమెరికా మార్కెట్ వాటా 30 శాతంగా ఉండగా.. 2023-24లో 37 శాతానికి పెరిగింది. కంపెనీకి చెందిన యాంటీ రెట్రోవైరల్ తోపాటు శ్వాసకోస సమస్యలకు సంబంధించిన జనరిక్ ఔషధాలకు పెరిగిన డిమాండ్ పెరగడం ఇందుకు తోడ్పడింది.
గ్లెన్‌మార్క్ ఫార్మా: కంపెనీకి ఉత్తర అమెరికా రెండో అతిపెద్ద మార్కెట్. 2023-24లో సంస్థ ఆదాయంలో 26 శాతం ఈ మార్కెట్ నుంచే లభించింది.
జైడస్: అమెరికాకు జైడస్ 200కు పైగా జనరిక్ ఔషధాలను ఎగుమతి చేస్తోంది. కంపెనీకిదే అతిపెద్ద మార్కెట్ కూడా. గత ఆర్థిక సంవత్సర ఆదాయంలో 46 శాతం ఈ మార్కెట్ నుంచే సమకూరింది.
ఒత్తిడిలో ఫార్మా షేర్లు
ట్రంప్ సుంకాల హెచ్చరికతో భారత ఫార్మా రంగ కంపెనీల షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. డాక్టర్ రెడ్డీస్ స్టాక్ 2.63 శాతం క్షీణించగా.. జైడస్ లైఫ్ సైన్సెస్ 2.47 శాతం, అరబిందో ఫార్మా 2.41 శాతం, లుపిన్ 1.75 శాతం, సన్ ఫార్మా 1.46 శాతం, సిప్లా 1.21 శాతం, గ్లెన్‌మార్క్ 0.71 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 0.71 శాతం తగ్గింది.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
Read More Business News and Latest Telugu News