Delhi Shocker: ఎంత బరితెగింపు.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రాజధాని
ABN , Publish Date - Apr 12 , 2025 | 03:36 PM
రాజధాని రోడ్ల మీదకి స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు బీభత్సం చేశారు. కేవలం గంట వ్యవధిలోనే మూడు చోట్ల దోపిడీ, దౌర్జన్యాలకి పాల్పడి ఒక పోలీస్ అధికారి సహా ఐదుగురుని కత్తితో పొడిచి దోచుకున్నారు.

Scooter-Borne Miscreant: దేశ రాజధాని ఢిల్లీ ఆదర్శ్ నగర్‌లో దుండగులు బరితెగించారు. కేవలం ఒక గంట వ్యవధిలో ఒక పోలీసు కానిస్టేబుల్ సహా ఐదుగురిని కత్తితో పొడిచి దోచుకున్నారు. స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు యువకులు నిర్జన ప్రదేశాల్లో దారి కాచి దోపిడీకి, దౌర్జన్యానికి పాల్పడ్డారు. రోడ్డుపై వెళ్లే వారిని అడ్డగించి దాడి చేసి వారి నుండి మొబైల్ ఫోన్లు, నగదుతో సహా విలువైన వస్తువులను దోచుకున్నారు. దుండగుల దోపిడీ, దౌర్జన్య దృశ్యాలు CCTV ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
ఆదర్శ్ నగర్‌లోని కేవాల్ పార్క్‌లో, ఒక యువకుడు పని ముగించుకుని ఇంటికి వెళుతుండగా దొంగలు స్కూటర్‌పై వచ్చారు. రోడ్డుపై బ్యాగ్‌తో వెళ్తున్న అతన్ని ఆపి అతని మొబైల్ ఫోన్, రూ.1,200 నగదును లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో అటుగా ప్రయాణిస్తున్న టాక్సీ డ్రైవర్ దోపిడీని చూసి బాధితుడికి సహాయం చేయడానికి ప్రయత్నించాడు. కానీ దొంగలు అతనిపై కత్తితో దాడి చేశారు. అదే సమయంలో, అటుగా వెళ్తున్న ఢిల్లీ కి చెందిన ఒక పోలీసు అధికారి దుండగుల్ని అడ్డుకున్నాడు. అయితే, ఆశ్చర్యకరంగా, ఇద్దరు దుండగులు పోలీస్ అధికారి అని కూడా చూడకుండా, పోలీస్ పై కూడా కత్తితో దాడికి తెగబడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన పోలీస్ అధికారి ఎస్ఐ ప్రేమ్‌పాల్ దివాకర్‌గా గుర్తించారు. వెంటనే అతడ్ని షాలిమార్ బాగ్‌లోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. దివాకర్ వజీరాబాద్‌లోని నార్త్ ఈస్ట్ జోన్ పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR)లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్థానిక ఆజాద్‌పూర్‌లోని మందిర్ వాలి గలిలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు.
పోలీస్ అధికారిపై దాడి చేసిన తర్వాత కూడా దుండగులు తమ దౌర్జన్యాల్ని ఆపలేదు. ఎస్ఐ పై దాడి చేసిన కేవలం 15 నిమిషాల తర్వాత, అక్కడికి కొద్ది దూరంలోనే, దొంగలు రాంలీలా పార్క్ సమీపంలో మళ్ళీ దాడి చేశారు. మరో ఇద్దరు యువకుల్ని దోచుకున్నారు. వారిని బెదిరించి, వారి బ్యాగులు, విలువైన వస్తువులను లాక్కున్నారు. తర్వాత మళ్లీ మరొక వ్యక్తిని కత్తితో బెదిరించి, అతని ఫోన్, డబ్బు దొంగిలించారు. పోలీసులు CCTV ఫుటేజ్‌లను సమీక్షించి, అనుమానితుల ముఖాలను గుర్తించారు. కానీ వారిని ఇంకా పట్టుకోలేదు. ఘటన తర్వాత ఆదర్శ్ నగర్ నివాసితులలో భయాందోళనలు చెలరేగాయి. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది. కేవలం గంట వ్యవధిలోనే దుండగులు ఈ దారుణాలకు ఒడిగట్టడం స్థానికులకు భయం పుట్టించింది.
ఈ వార్తలు కూడా చదవండి
AP Inter Results 2025: ఇంటర్ ఫలితాలు త్వరగా తెలుసుకోవాలంటే దీనిపై క్లిక్ చేయండి
Tirumala Temple Incident: తిరుమలలో అపచారం.. ఏం జరిగిందంటే
59 ఏళ్ల వయసులో చెట్టెక్కిన హీరో
Read Latest AP News And Telugu News