Share News

Honeytrap: రూ.13 వేల కోట్ల స్కాం.. మెహుల్ చోక్సీ హనీట్రాప్ నిజమా.. కాదా..

ABN , Publish Date - Apr 14 , 2025 | 09:20 PM

గీతాంజలి గ్రూప్ పేరుతో జెమ్స్ అండ్ జ్యువెలరీ వ్యాపారం పేరుతో మంది సొమ్ము నిండా మింగేశాడు మెహుల్ చోక్సీ, అతని మేనల్లుడు నీరవ్ మోదీ. తాజాగా చోక్సీ వ్యవహారంలో హనీట్రాప్ అంశం హాట్ టాపిక్ అవుతోంది.

Honeytrap: రూ.13 వేల కోట్ల స్కాం..  మెహుల్ చోక్సీ హనీట్రాప్ నిజమా.. కాదా..
Mehul Choksi Honeytrap ?

Mehul Choksi Honeytrap: గీతాంజలి గ్రూప్ డైమండ్ల(జెమ్స్ అండ్ జ్యువెలరీ) వ్యాపారమంటూ పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)కు దాదాపు రూ.13 వేల కోట్లకు పంగనామాలు పెట్టి 2018లో భారతదేశం వదిలి పరారైపోయాడు మెహుల్ చోక్సీ. భార్యని బెల్జియంకు, మేనళ్లుడు నీరవ్ మోడీని అమెరికాకు పంపించి తను ఆంటిగ్వాకు చెక్కేశాడు. తాను చేసిన తప్పుడు పనులు (కుంభకోణం) బయటపడుతుందని తెలిసి దాదాపు 15 రోజుల ముందే బిషాణా ఎత్తేసిన చోక్సీ.. కరేబియన్ దేశమైన ఆంటిగ్వాలో పెట్టుబడులు పెడతానంటూ అక్కడ పౌరసత్వం పొంది విలాసాలు అనుభవించాడు. బ్యాంకులో దాచుకున్న డిపాజిటర్ల సొమ్ములు కాజేసి ఫుల్ ఖుషీగా లైఫ్ లీడ్ చేశాడు చోక్సీ.

ఇలా ఉండగా, 2021 మేలో అక్రమంగా ప్రవేశించినందుకు చోక్సీని డొమినికాలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో చోక్సీని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి CBI బృందం ద్వీప దేశం డొమినికాకు వెళ్లింది. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. జూలై 2021లో డొమినికా హైకోర్టు అతన్ని వైద్య చికిత్స కోసం ఆంటిగ్వాకు తిరిగి వెళ్లడానికి అనుమతించింది. తర్వాత చోక్సీ భార్య బెల్జియం దేశస్తురాలు కావడంతో అక్కడ కొన్ని తప్పుడు పత్రాలు సమర్పించి బెల్జియంకు మకాం మార్చేశాడు. అయితే, ఇప్పుడు తాజాగా ఏప్రిల్ 12, 2025న బెల్జియం పోలీసులు చోక్సీని అరెస్ట్ చేశారు. తప్పుడు పత్రాలు, నిజాలు దాచాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేశారు. చోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ దీనిని ధృవీకరించారు. ఇప్పుడు బెల్జియం నుంచి ఎలాగైనా భారత్ కు రప్పించాలని మన సీబీఐ, ఈడీ ప్రయత్నిస్తున్నాయి. ఇవి ఎప్పటికి నెరవేరతాయో చూడాలి.

అయితే, మధ్యలో హనీ ట్రాప్ ఉదంతం మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. తన భర్త చోక్సీని డొమినికాలో పోలీసులు పట్టుకోవడానికి హనీట్రాప్ కారణమని చోక్సీ భార్య ప్రీతి ఆరోపించింది. 2020లో హంగేరియన్ జాతీయురాలు బార్బరా జబారికాను తన భర్త కలిశారని, తన భర్త డొమినికాకు అపహరించబడ్డం.. హనీట్రాప్ ప్లాన్‌లో భాగమని ఆమె ఆరోపించింది. హనీ ట్రాప్ వెనుక భారత ఏజెంట్ల పాత్ర కూడా ఉందని చోక్సీ తరపు న్యాయవాదులు కూడా అప్పట్లో ఆరోపించారు. అయితే, బార్బరా.. ప్రీతి ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తాను చోక్సీ "గర్ల్‌ఫ్రెండ్" అని వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. నాకు నా సొంత ఆదాయం, వ్యాపారం ఉన్నాయి. "నాకు అతని డబ్బు, ఫ్యామిలీ సపోర్ట్, హోటల్ బుకింగ్, నకిలీ ఆభరణాలు లేదా మరేదైనా అవసరం లేదు." అని బార్బరా తేల్చి చెప్పింది.

చోక్సి తనను తాను రాజ్ అని పరిచయం చేసుకున్నాడని, తాము మొదట 2020 ఆగస్టులో కలిశామని చెప్పింది. "రాజ్ (మెహుల్ చోక్సి) నన్ను సంప్రదించి, నా నంబర్ అడిగి, 'నాతో స్నేహం చేసుకున్నాడు', ఇది అతని భార్య చెప్పే దానికి పూర్తిగా వ్యతిరేకం" అని బార్బరా చెప్పింది. చోక్సి క్యూబాలో కలవవచ్చని తనకు చెప్పాడని, అక్కడికి వెళ్లాలని యోచిస్తున్నట్లు కూడా చెప్పాడని బార్బరా చెప్పింది.

అయితే, బార్బరా తనను కొట్టి తన భర్తను వాటర్ బోట్‌లో డొమినికాకు తీసుకెళ్లిందని, తన భర్తకు ఆపద సమయంలో బార్బరా కనీసం సహాయం చేయడానికి ప్రయత్నించలేదని ఆరోపించింది. బార్బరా ప్రవర్తించిన తీరు "ఈ మొత్తం ప్రణాళికలో ఆమె ఒక అంతర్భాగమని" సూచిస్తుందని కూడా ప్రీతి ఆరోపించారు. చోక్సి కేవలం తనకు రాజ్ అని మాత్రమే తెలుసునని బార్బరా చెబుతున్న మాటల్ని కూడా ప్రీతి ఆక్షేపించింది. "ఈ కేసు చుట్టూ మొత్తం మీడియా దృష్టి, ప్రజల ఆగ్రహం ఉన్నప్పటికీ, వేలాది మంది అనుచరులతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కలిగి ఉన్న బార్బరాకి చోక్సీ స్కాం గురించి తెలియదని చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రీతి అంది.

ఇదంతా ఒకెత్తయితే, ఇంతకీ ఆ 13వేల కోట్ల సంగతేంటి? ఈ ఏడేళ్లలో చోక్సీ నుంచి, మేనళ్లుడు నీరవ్ మోదీ నుంచి, చోక్సీ భార్య నుంచి ఎంత వసూలు చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం పెట్టిన ఖర్చులైనా వచ్చాయా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు ఊదరగొడుతున్నారు నెటిజనం.


Also Read:

Nitin Gadkari: హైవేల బలోపేతానికి 10 లక్షల కోట్లు

లవర్స్‌కు గుడ్ న్యూస్.. లక్షలు సంపాదించే అవకాశం.

SC Sub-Categorization: ఎస్సీ వర్గీకరణ నేటి నుంచే..

Updated Date - Apr 14 , 2025 | 09:55 PM