Maha Shivratri Special: ఈ శివాలయాన్ని దర్శిస్తే పిల్లలు పుడతారంట.. ఎక్కడుందో తెలుసా..

ABN, Publish Date - Feb 26 , 2025 | 09:11 AM

మీకు సంతానం లేదని బాధపడుతున్నారా? అయితే, ఈ శివలింగాన్ని మూడు సార్లు ఎత్తితే పిల్లలు పుడతారంట. శ్రీ శైలానికి మించి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకత ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Maha Shivratri Special: ఈ శివాలయాన్ని దర్శిస్తే పిల్లలు పుడతారంట.. ఎక్కడుందో తెలుసా..
Matsya Lingeswara Swamy

Matsya Lingeswara Swamy: సహజ సిద్ధమైన ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సమస్యలన్నీ తొలగిపోయి, కోరిన కోర్కెలు తీరతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఈ ఆలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది. ఈ ఆలయంలో చేపలను ఎంతో ప్రత్యేకంగా కొలుస్తారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులు పాములను కూడా పూజిస్తారు. చుట్టు కొండలు, పచ్చని తోటలు, గల గలా సవ్వడి చేస్తూ ముందుకు సాగే నీటి ప్రవాహాల మధ్య.. కొండరాయిపై గంగా సమేత పరమేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు.

మన్యం కొండల్లో వెలసిన మత్య్సలింగేశ్వర స్వామి ఆలయం విశాఖ నగరానికి 100 కి.మీ. దూరంలో ఉన్న పాడేరు సమీపంలో వెలసింది. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మత్స్యలింగేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఉన్న కోరికలింగాన్ని మూడు సార్లు ఎత్తితే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని ఇక్కడ భక్తుల గట్టి నమ్మకం. మత్స్యగుండాలు వద్ద నున్న మత్స్యాల(చేపలు)కు మరమరాలు, కొబ్బరి ముక్కలు వేసినప్పుడు అవి దర్శనమిస్తే సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఏజెన్సీ మండలాల నుంచే కాకుండా మైదాన ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు.


1964 సంవత్సరంలో అప్పటి పాడేరు తహసీల్దార్‌ కుసర్లపాటి సత్యనారాయణ, సత్యవతి దంపతులు ఎన్నో ఏళ్లుగా పిల్లలు లేక బాధపడుతుండేవారు. మత్స్యలింగేశ్వరస్వామి విశిష్టిత తెలుసుకుని అక్కడికి వెళ్లి మొక్కుబడులు తీర్చుకోని పిల్లలు పుట్టాలని కోరుకున్నారు. వారికి ఏడాదిలోనే పిల్లలు పుట్టడంతో 1966- 67 సంవత్సరంలో గ్రామస్థులతో చర్చించి ఆలయం నిర్మాణానికి మట్టిగోడలతో శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో 2004లో ఏపీ టూరిజం, విశాఖ నగరాభివృద్ధి సంస్థల ఆధర్యంలో నూతన ఆలయ నిర్మాణానికి రూ. కోటి వెచ్చించారు. తరువాత 2016- 17లో వుడా ఆధ్వర్యంలో రూ.30 లక్షలు వెచ్చించి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సుందరంగా తీర్చిదిద్దారు.

మత్స్యగుండం పురాణ గాథ

పూర్వం జి. మాడుగుల మండలం మత్స్యగెడ్డ వద్ద సింగరాజులు, మత్స్యరాజులు అనే రెండు రకాల దేవతలు (మత్స్యాలు) నివశించేవారు. నిత్యం జీవనదిగా ప్రవహించే మత్స్యగెడ్డపై ఈ రెండు వర్గాల మధ్య పోరు ఏర్పడింది. సుమారుగా మూడు నెలల పాటు మత్స్యరాజులు, సింగరాజుల మధ్య భారీ యుద్ధం జరిగింది. ఈ పోరులో మత్స్యరాజులు తన సంతానాన్ని మత్స్యలింగేశ్వరస్వామి కొలువై ఉన్న మత్స్యగుండం వద్ద స్వామివారికి అప్పగించి యుద్ధానికి వెళ్లారు. ఆ యుద్ధంలో మత్స్యరాజులు విజయం సాధించి వచ్చి మత్స్యగుండంలో స్థిరపడినట్టు అక్కడి గిరిజనులు చెబుతుంటారు. తరువాత మత్స్యగుండంలో ఉన్న మత్స్యాలు (చేపలు) లను కొందరు సాధువులు సాధారణ చేపలుగా భావించి వాటిని పట్టుకుని, ప్రాణాలు తీయడంతో అవి పెద్ద పెద్ద బండరాళ్లుగా మారిపోయాయని, దీంతో అప్పటి నుంచి ఆ మత్స్యాలను ఎవ్వరూ చంపకుండా పూజిస్తారనేది స్థానిక గిరిజనుల విశ్వాసం. కొబ్బరి ముక్కలు, మరమరాలు, అరటిపండ్లు వేసి భక్తులు పిలిస్తే అవి బయటకొచ్చి తిని వెళ్లడం భక్తుల విశ్వాసాన్ని మరింత పెంచుతుంది.

Also Read:

మహా శివరాత్రి రోజు ఈ తప్పులు చేస్తే శివుడి కటాక్షం మీకు ఉండదని తెలుసా..

ఈ రసం తాగితే ఉపవాసం ఉన్నా ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటారు..

Updated Date - Feb 26 , 2025 | 10:06 AM