Share News

దేవలోకపు పాటకు ప్రేమలేఖ

ABN , Publish Date - Jan 27 , 2025 | 01:21 AM

రఫీ సినిమా పాటనూ, జీవితాన్నీ తెలుగు పాఠకుల ముందు నిలిపే ఒక అద్భుత ప్రయత్నం సాహితీ వేత్త సి. మృణాళిని రచించిన ‘రఫీ – ఒక ప్రేమ పత్రం’ పుస్తకం. రఫీ పాటలతో హీరోలుగా వెలుగొందిన వారిని...

దేవలోకపు పాటకు ప్రేమలేఖ

రఫీ సినిమా పాటనూ, జీవితాన్నీ తెలుగు పాఠకుల ముందు నిలిపే ఒక అద్భుత ప్రయత్నం సాహితీ వేత్త సి. మృణాళిని రచించిన ‘రఫీ – ఒక ప్రేమ పత్రం’ పుస్తకం. రఫీ పాటలతో హీరోలుగా వెలుగొందిన వారిని, అతనితో పాడించిన సంగీత దర్శకులను స్మరించుకుంటూ, రఫీ పాడిన అమృత గీతాలను మరోసారి గుర్తు చేసుకుంటూ పుస్తకం సాగడం పాఠకులకు మధురానుభూతిని కలిగిస్తుంది.

‘‘రఫీ శ్రావ్యమైన గొంతులో పాట నీ దాకా వచ్చినప్పుడు అది చుట్టూ ఉన్న రద్దీ నుంచి నిన్ను దూరంగా ఒక దేవలోకంలోకి తీసుకుపోతుంది. అక్కడ ద్వేషం, ఈర్ష్య, నువ్వూ నేనూ అన్న తేడాలు ఏవీ ఉండవు. శాంతి ఎల్లెడలా విస్తరించి ఉంటుంది. ఆనందం మన నుదుటిని ముద్దాడుతూంటుంది’’ – ‘యాన్ ఈవినింగ్ విత్ రఫీ’ అనే హెచ్.ఎమ్.వి వారి కేసెట్ కోసం మహానటుడు పృధ్వీరాజ్ కపూర్ ఇచ్చిన సందేశమిది. రఫీ పాట గురించి ఇంతకంటే అందంగా ఇంకెవ్వరూ చెప్పలేరనిపిస్తుంది. 1950–-1970ల మధ్య కాలాన్ని భారతీయ సినీ సంగీత ప్రియులు రఫీ యుగంగా భావిస్తారు.


రఫీ సినిమా పాటనూ, జీవి తాన్నీ తెలుగు పాఠకుల ముందు నిలిపే ఒక అద్భుత ప్రయత్నం సాహితీవేత్త సి. మృణాళిని రచించిన ‘రఫీ – ఒక ప్రేమ పత్రం’ పుస్తకం. భారతీయ భాషల్లో రఫీపై వచ్చిన పుస్తకాల్లో ఇది ప్రత్యేకమైంది. రఫీ బాల్యాన్ని, ఆ వయసులోనే సంగీతం పట్ల అతనికున్న అవగాహనను నిశిత పరిశీలన ద్వారా వివరిం చారు మృణాళిని.

‘చౌదవీకా చాంద్ హో’ వస్తున్నపుడు వెన్నెలే తప్ప పాట వినిపించక పోవడం రఫీ గొంతు విశిష్టత. ఇదే కాదు రఫీ పాడిన ప్రతి పాటా శ్రోతను నేరుగా సన్నివేశానికి తీసుకు పోతుంది. రఫీ 1924 డిసెంబర్ 24న పంజాబ్ లోని కోట్లా సుల్తాన్ సింగ్ గ్రామంలో జన్మించాడు. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండటంతో వారు లాహోరుకు వలస వెళ్లారు. అక్కడ క్షుర వృత్తి చేపట్టాడు. 1943లో లాహోర్ రేడియోలో గాయకుడయ్యాడు. ‘సోనియే నీ, హీరియే నీ, తేరీ యాద్ నే ఆన్ సతాయా’ అనే పాటను శ్యామ్ సుందర్ సంగీత దర్శకత్వంలో పాడాడు. అవకాశాల కోసం మకాం బొంబాయికి మారింది. అక్కడ కూడా శ్యామ్ సుందరే రఫీకి ‘గావ్ కీ గోరే’ హిందీ చిత్రంలో పాడే అవకా శమిచ్చారు. తర్వాత మళ్లీ ఎవరూ అవకాశం ఇవ్వలేదు. సుప్రసిద్ధ సంగీత దర్శకులు నౌషాద్ తండ్రి వాహెద్ అలీ రఫీ పాట విని తన కొడుక్కి రఫీ గురించి సిఫారసు చేసాడు. ‘పెహలే ఆప్’ చిత్రంలో బృంద గానంలో ఒకరిగా అవకాశం వచ్చింది. ఆనాటి నుండి రఫీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. భారత దేశం అతని గొంతుకు బ్రహ్మరథం పట్టింది.


మృణాళిని పుస్తకం రఫీ పాటలతో హీరోలుగా వెలుగొందిన వారిని, అతనితో పాడించిన సంగీత దర్శకులను స్మరించుకుంటూ, రఫీ పాడిన అమృత గీతాలను మరోసారి గుర్తు చేసుకుంటూ పుస్తకం సాగడం పాఠకులకు మధురానుభూతిని కలిగిస్తుంది. మృణాళిని ఈ పుస్తకాన్ని 14 భాగాలుగా విభజించారు. అరుదైన చిత్రమాలికను, పాటల తోటని అందించారు. ‘ముల్లో కాలను మురిపించిన పాట’ అనే భాగంలో ప్రపంచ వేదికలపై స్టాండింగ్ ఒవేషన్ అందుకున్న క్రమాన్ని కవితాత్మకంగా వివరించారు. ‘ఆకా శంలో ఎగరాలని వుంది’లో రఫీ జీవితం లోని ఉత్థాన పతనాలను వివరించారు. వేదికల మీద రఫీ చేసిన గళ విన్యాసాలు విని తీరాల్సిందేనని రచయిత్రి తెలిపిన విధానం ప్రత్యేకంగా వుంది.

రఫీ పాటలు వినడమంటే ఒక్కోసారి మన మనసును వినడమూ, మరోసారి మన మనసును ఇంకా ఉన్నతం చేసుకోవడమని శ్రోతల ప్రపంచమంటుంటే ఆయన మాత్రం ‘‘నేను సంగీత దర్శకుడి చేతిలో రాయిని. అతను పాడ మన్నట్టు పాడతాను. ఆపైన అల్లాః దయ’’ అనే వినయశీలి.

1944లో మొదలుపెట్టి, 1980 వరకూ దాదాపు విరామం లేకుండా పాడి సినీ గీతాల అభిమానులకు నిత్య జీవితంలో అంతర్భాగమైపోయాడు రఫీ. తమ జీవితాల్లో అనేక సంద ర్భాల్లో రఫీని తలుచుకుంటూ తమ బాధను మరిచి పోయిన వారూ, ఆనందాన్ని పెంచుకున్నవారూ ఉన్నారు.


ప్రతి పాటను సొంతం చేసుకోవడం రఫీకి తెలిసిన రహస్యమని చెప్పుకోవచ్చు. తెరపై అభినయిస్తున్న నటుడి కంటే, కథను రాసిన రచయితకంటే, కథను చెబుతున్న దర్శకుడి కంటే ఎక్కువగా రఫీ ఆ సన్నివేశాన్ని, పాత్ర మనోభావాలని తనలో నింపుకుంటాడు. తనే ఆ పాత్ర అయిపోతాడు. అందుకే పాట వింటున్నంత సేపూ మనలో కూడా అదే భావం, అదే అనుభూతి కలుగుతాయి.

ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. ఆ సమయంలో ప్రైవేటు ఆల్బంలలో పాడడం మొదలు పెట్టాడు. అవి కూడా సినిమా పాటలతో సమాన స్థాయిలో ప్రజాదరణ పొందాయి. నిజానికి జీవితంలో రఫీ కోరుకున్న ఆనందాలు చాలా చిన్నవి. ఇష్టమైన వాళ్లతో ఇంట్లో భోజనం చేయడం, తనకిష్టమైన ఆటలు ఆడుకోవడం, కుటుంబసభ్యులతో కబుర్లు చెప్పడం వంటివి. ఏ నిర్మాతకైనా, ఎంత చిన్న సంగీత దర్శకుడికైనా తను పాడడం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుందని తెలిస్తే వెంటనే ఒప్పుకునేవాడు. రఫీ ఎంత గొప్ప కళాకారుడో, అతని వ్యక్తిత్వం కూడా గొప్పది కనుకనే అతన్ని జనం హృదయాల్లో నిలుపుకున్నారు. గంధర్వలోకం నుంచి వచ్చి ఆనందాన్ని పంచి‌ 57 ఏళ్ల వయసులో గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. సుప్రసిద్ధ సంగీత దర్శకులు నౌషాద్ ‘రఫీ సాబ్ సంగీత ప్రపంచానికి ప్రవక్త’ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వినూత్నమైన సమాచారంతో తెలుగు వారికి అద్భుతమైన ఈ పుస్తకాన్ని అందించిన రచయిత్రి కృషి అభినందనీయం.

ర్యాలి ప్రసాద్

94945 53425


ఈ వార్తలు కూడా చదవండి

Karimnagar: మళ్లీ హల్‌చల్ చేసిన నాగసాధు అఘోరీ.. ఈసారి ఏం చేసిందంటే..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jan 27 , 2025 | 01:21 AM