Share News

అరేబియన్‌ తీరాన అక్షర కెరటాలు

ABN , Publish Date - Feb 10 , 2025 | 06:47 AM

జనవరి 22 నుంచి 26 వరకు కేరళ లిటరరీ ఫెస్టివల్ కోళికోడ్ (కాలికట్) నగరంలో సముద్రపు ఒడ్డున జరిగింది. ఈ ఉత్సవాన్ని ప్రముఖ మలయాళీ ప్రచురణకర్తలు డి.సి. బుక్స్ గత ఎనిమిదేళ్ళుగా...

అరేబియన్‌ తీరాన  అక్షర కెరటాలు

జనవరి 22 నుంచి 26 వరకు కేరళ లిటరరీ ఫెస్టివల్ కోళికోడ్ (కాలికట్) నగరంలో సముద్రపు ఒడ్డున జరిగింది. ఈ ఉత్సవాన్ని ప్రముఖ మలయాళీ ప్రచురణకర్తలు డి.సి. బుక్స్ గత ఎనిమిదేళ్ళుగా నిర్వహిస్తున్నారు. ఈసారి అతిథి దేశంగా ఫ్రాన్స్‌ను ఆహ్వానించారు. సాహిత్యోత్సవంతో పాటుగా తొలిసారిగా ఈ ఏడాది ప్రచురణకర్తల సమావేశం (పబ్లిషర్ కాన్‌క్లేవ్‌) కూడా రెండు రోజుల పాటు ఏర్పాటు చేశారు. వారి ఆహ్వానం మేరకు, ‘ఎలమి’ ప్రచురణల నిర్వాహకురాలిగా నేను హాజరయ్యాను.

***

లిట్ ఫెస్ట్ అంటే– దేశీ విదేశీ రచయితలను, సాహిత్య కారులను, ప్రచురణకర్తలను, పాఠకులను కొన్ని రోజుల పాటు ఒక చోటకు తెచ్చే పుస్తకాల జాతర. పుస్తకాల అట్టల పైన పేరుగా మాత్రమే తెలిసిన రచయితలను పలకరించే అవకాశం ఇక్కడ కలుగుతుంది. ఎప్పటెప్పటి నుంచో తమ రచనల ద్వారా సోషల్ మీడియాలో ‘ఫ్రెండ్స్’గా మారిన వారిని మొదటిసారి ఆలింగనం చేసు కునే అవకాశాన్ని ఇస్తుంది. తాజాగా అచ్చైన పుస్తకాలను ప్రమోట్ చేసుకోడానికి ఇవి మంచి వేదికలు. కోటలు, హోటళ్ళు, ఐటీ పార్కులు, బీచులు – ఇలా రకరకాల ప్రాంగణాల్లో జరుగుతూ వేలల్లో, లక్షల్లో వచ్చే సందర్శకులని ఆకర్షిస్తాయి ఈ లిటరరీ ఫెస్టివల్స్‌. పుస్తకాలంటే ప్రాణం పెట్టే వారి సంఖ్య మరీ తక్కువేమీ కాదన్న సంగతిని గుర్తు చేస్తాయి. అన్ని లిటరరీ ఫెస్ట్‌లూ‌ ఒకేలా అనిపించినా, ఆ హంగూ హడావిడీ కాస్త ఇబ్బంది కలిగించినా, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రతి ఫెస్ట్‌కూ ఏదో ఒక ప్రత్యేకత ఉంది. 2012 నుంచి హైదరాబాద్, బెంగళూరు, జైపూర్ వంటి లిట్ ఫెస్టులకు వెళ్ళడం మామూలైపోయిన నన్ను ఈ కేరళ సాహిత్య ఉత్సవం కొన్ని విషయాల్లో అబ్బురపరిచింది.


‘‘ఆసియాలో రెండో అతి పెద్ద లిటరరీ ఫెస్ట్’’ అన్న టాగ్‌లైన్‌కు తగినట్టే ఈ ఉత్సవానికి ఈ ఏడాది దాదాపు ఆరు లక్షల మంది సందర్శకులు వచ్చారు. అరేబియన్ సముద్రం ఒడ్డున ఇంతమంది సాహిత్యంలో పడిమునకలు వేయడాన్ని చూస్తే మనసు నిండిపోయింది. కేరళలో 1940లలో జరిగిన గ్రంథాలయోద్యమం వల్ల ఆ రాష్ట్రంలో పుస్తక పఠనం బల పడింది. ఇప్పుడు సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ పుస్తకాల పురుగులే. అందుకే అంతమంది జనం!

నన్ను బాగా ఆశ్చర్యపరచిన, ఆకట్టుకున్న విషయం మాత్రం అత్యధిక సెషన్లు మలయాళ భాష లోనే ఉండడం. మలయాళీ రచయితలకూ, పాఠకులకే ఇక్కడ పెద్ద పీట వేశారు. బుక్ స్టాల్‌‍లో కూడా 70 శాతం వరకూ మలయాళీ పుస్తకాలే ఉన్నాయి. పోస్టర్లు, పాంపెట్లు, వేదికల పేర్లు... ఇలా అన్ని చోట్లా మలయాళానిదే హవా! ఆఖరుకి అతిథులుగా వెళ్ళిన మాకు ఇచ్చిన గిఫ్ట్ హాంపర్‌లో కూడా ఇతర గిఫ్టులతో పాటు ఒక మలయాళంలో ఉన్న కాలెండరు, వార పత్రిక ఇచ్చారు.


ఇలాంటి సాహిత్య ఉత్సవాలకు విదేశీ రచయితలు రావడం పరిపాటే! ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందు కున్నవారిని పిలుస్తారు. కేరళ లిట్ ఫెస్ట్‌కు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, బల్గేరియా దేశాల నుంచి రచయితలతోపాటు, వారిని ఆంగ్లంలోకి అనువదించిన వారూ వచ్చారు. అంతేగాక ఆ రచయితలు రాసిన పుస్తకాల మలయాళ అనువాదాలను ఈ సభల్లో వారి సమక్షంలోనే విడుదల చేయడం గొప్పగా అనిపించింది. భారతీయ భాషల్లోకి విదేశీ రచనలు అనువాదం అవ్వడమే అరుదు. అలాంటిది ఆ రచయిత సమక్షంలోనే అనువాదం ఆవిష్కరణ జరగటం ఇంకా అపురూపం.

***

ఈ ఫెస్టివల్‍లో భాగంగా ‘ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఇండియా’, ‘ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫీసు’ సంయు క్తంగా రెండు రోజులపాటు ప్రచురణ కర్తల సమావేశాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ఇండియాలో ఫ్రెంచ్ రాయబారి హెచ్.ఈ. థియరీ మథౌ; ప్రముఖ కవి, రచయిత కె. సచ్చిదానందన్; బుక్ బ్రహ్మ వ్యవ స్థాపకులు సతీష్ చప్పరికె అతిథు లుగా వచ్చారు. ఫ్రాన్స్ నుంచి గల్లీమార్డ్ వంటి పెద్ద సంస్థలు, లిటరరీ ఏజెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల ప్రచురణకర్తలు కూడా పాల్గొన్నారు.


మన దేశంలో పుస్తకాలకు, అను వాదాలకు ఎలాంటి మార్కెట్ ఉందన్న దానిపై ఈ సమావేశాల్లో చర్చ జరిగింది. ఇతర దక్షిణాది భాషలతో పోల్చుకుంటే తెలుగులో అమ్మకాలు తక్కువ గానే ఉన్నాయి. పుస్తకాల డిస్ట్రిబ్యూషన్ సమస్యలను దాదాపు అందరూ ప్రస్తావించినా ఒక్కో భాషలో ఆ సమస్యల తీవ్రత ఒక్కోలా ఉన్నది అనిపించింది. ప్రచురితమైన పుస్తకాలకు ఐ.ఎస్.బీ.ఎన్ కోడ్ ఉపయోగించకపోవడం వల్ల అసలు ఎన్ని పుస్తకాలు వెలువడుతున్నాయి అన్నది లెక్కలకు అందడం లేదు. అలానే, రచయితలకు ప్రచురణకర్తలకు మధ్య సరైన రాతపూర్వక అగ్రిమెంట్లు లేకపోవడంవల్ల అనువాదాలు చేయించేటప్పుడు వచ్చే గందరగోళాలు ప్రస్తావనకు వచ్చాయి.

ఫ్రాన్స్ వారు తమ దేశంలో పుస్తకాలు, అనువాద రచనల పరిస్థితి ఎలా ఉందో చెప్పుకొచ్చారు. మనతో పోల్చుకుంటే వారిది ఎక్కువ ఆర్గనైజ్డ్ మార్కెట్ అనిపించింది. ఉదాహరణకి– అక్కడ సెకండ్ హాండ్ పుస్తకాల అమ్మకాలు ఎంత పెద్ద మార్కెట్టో లెక్కలతో సహా చూపించారు. (ఇండియాలో పాత పుస్తకాల షాపుల విషయంలో ఇలాంటి గణాంకాలు అసాధ్యం.) వాళ్ళ పుస్తకాల అమ్మకాల సంఖ్య కూడా ఆశాజనకంగా ఉంది. ముఖ్యంగా అనువాద పుస్తకాలకు కూడా మార్కెట్ బాగుందని చెప్పారు.

***

తెలుగు నుంచి ఫ్రెంచ్‍ లోకి అనువాదాలు వెళ్ళాలన్నా, అక్కడ నుంచి ఇక్కడకి అనువాదాలు రావాలన్నా మనం – వ్యక్తులుగా, సంస్థలుగా – చేయవలసిన పనులు, గమనించు కోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.


రచయితలు తమ పుస్తకాలను ప్రచురణకు ఇచ్చేటప్పుడు రాతపూర్వక అగ్రీమెంట్లు ఉండేటట్టు చూసుకోవాలి. వాటిలో తమ రచనల అనువాద హక్కులకు ఆయా ప్రచురణకర్తలు ప్రాతినిధ్యం వహించేలా అనుమతి ఇస్తే తెలుగు రచనలను ఇలాంటి వేదికలపైకి తీసుకువెళ్ళి మాట్లాడ్డానికి వీలవుతుంది. లిటరరీ ఫిక్షన్ ప్రచురించే ఫ్రెంచ్ ప్రచురణకర్తలు తమ పాఠకులకు తెలియని కొత్త రచయితను ప్రచురణకు ఎంచుకు నేటప్పుడు వారి కథలను కాకుండా నవలలనే ఎంచుకుంటా మని చెప్పారు. నవలల తోపాటు మహిళల జీవితాలను ప్రతిబింబించే ఆత్మకథనాలపై కూడా ఆసక్తి చూపారు. బాల సాహిత్యం (ముఖ్యంగా బొమ్మల పుస్తకాలు), యంగ్ అడల్ట్ ఫిక్షన్ కూడా వారు తీసుకోడానికి ఇష్టపడుతున్నారు.

ఈ సమావేశానికి తెలుగు నుంచి ఎలమి ప్రచురణలు, ఛాయా బుక్స్ హాజరయ్యాయి. పోయిన ఏడాది జరిగిన బుక్ బ్రహ్మ లిటరరీ ఫెస్టివల్‍లో కేవలం భారతీయ ప్రచురణకర్తలం మాత్రమే సమావేశమయ్యాం. ఈసారి అంతర్జాతీయ ప్రచు రణ సంస్థలతో కలిసి మాట్లాడే అవకాశం చిక్కింది. మన సాహిత్యం వైపు ఈ ప్రచురణకర్తలు ఆశగా చూస్తున్నారని అర్థమైంది. మన రాజకీయ సామాజిక పరిస్థితులు, అందు లోంచి పుట్టుకొస్తున్న సాహిత్యం గురించి చక్కగా ‘పిచ్’ చేయగలిగితే మనకీ అవకాశాలు వస్తాయి. వాళ్ళ పుస్తకాలను మనం అనువాదం చేయాలంటే కాపీరైట్లు, రాయల్టీ ఖర్చులు చూసుకోవాలి. కొన్ని ప్రాజెక్టులకు గ్రాంట్స్ ఉన్నాయి. అవి మంజూరు అయితే ప్రచురణకర్తలపై భారం తగ్గుతుంది.


ఇక భాషలు నేర్చుకునే ఆసక్తి ఉన్నవారు ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ లాంటి యూరోపియన్ భాషలు నేర్చుకోగలిగితే అనువాద అవకాశాల్ని చేజిక్కించుకోవచ్చు. ప్రచురణకర్తలకు ఇచ్చే గ్రాంట్స్ కన్నా అనువాదకులకు గ్రాంట్స్ కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపించాయి. మూల భాష నుంచి నేరుగా అనువాదం చేయగలిగే వారికి ఎప్పుడూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అయితే, తెలుగు-–ఫ్రెంచ్ లేదా ఫ్రెంచ్–-తెలుగు నుంచి చేయదగిన పుస్తకాల సంఖ్యతో పోల్చుకుంటే ఈ రెండు భాషల్లో ప్రావీణ్యత ఉన్న అనువాదకులు తక్కువ కాబట్టి, మధ్యే మార్గాన ఇంగ్లీషు నుంచి చేసే అనువాదాల పట్ల కూడా ఈ ప్రచురణకర్తలు సుముఖంగానే ఉన్నారు.

‘‘దేశ విదేశ భాషల్లో మన సాహిత్యం ఎందుకు వెళ్ళడం లేదు?’’ అంటూ ఆవేశపూరితమైన ప్రశ్నల దగ్గర ఆగిపోకుండా, ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలుసుకుని, వాటి కోసమై రచయితలు, అనువాదకులు, ప్రచురణకర్తలు కలిసి పని జేస్తే ఫలితాలు కనిపించవచ్చు.

పూర్ణిమ తమ్మిరెడ్డి

purnimat07@gmail.com


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 10 , 2025 | 06:47 AM