కోవిడ్: నిన్న, నేడు, రేపు
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:59 AM
ఐదేళ్ల క్రితం (11 మార్చి, 2020) ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్–19ని ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. దీని విలయ తాండవం 2019 డిసెంబర్‌లో చైనాలో ప్రారంభమై రోజులు...

ఐదేళ్ల క్రితం (11 మార్చి, 2020) ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్–19ని ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. దీని విలయ తాండవం 2019 డిసెంబర్‌లో చైనాలో ప్రారంభమై రోజులు, వారాల వ్యవధిలో దావానలంలా సమస్త ప్రపంచానికి విస్తరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యాయి. కోట్లాది శ్రామికుల జీవనాధారాలు ధ్వంసమయ్యాయి. ఆరోగ్య విపత్తు ఒక మహాసంక్షోభంగా పరిణమించింది. వివేకం, మానవత, విజ్ఞానాల ఆలంబనతో మానవాళి ఆ విషక్రిమిని అణచివేసింది.
కోవిడ్ భయంకరానుభవాల నుంచి మానవాళి పూర్తిగా బయటపడినట్టేనా? లేదనే చెప్పక తప్పదు. డోనాల్డ్ ట్రంప్ గారి దేశంలో 2024 ఆఖరివారంలో సైతం 521 మంది కోవిడ్‌తో మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధిపరిచిన వ్యాక్సిన్ల కారణంగా మరణాలు, ఆస్పత్రులలో చేరవల్సిన అగత్యాలు తగ్గిపోయినప్పటికీ కరోనా మహమ్మారి తగ్గుస్థాయిలోనే అయినా తన ప్రతాపం చూపుతూనే ఉన్నది. కోవిడ్ సంక్షోభంతో ఆరోగ్య భద్రతాసేవల్లో అసమానతలు ఎల్లెడలా ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలిసివచ్చింది. అన్ని విధాలా సంపన్నదేశమైన అమెరికానే భవిష్యత్తులో విజృంభించే ప్రాణాంతక అంటువ్యాధుల విషయం అటుంచి అసలు కోవిడ్–19 నైనా సంపూర్ణంగా ఎలా నిరోధించగలుగుతుందనేది ఇదమిత్థంగా చెప్పలేని పరిస్థితి. ఆ వైరస్ నుంచే కాకుండా భావి ప్రాణాంతక అంటువ్యాధుల నుంచి, సంపూర్ణ విమోచన ఎప్పటికి, ఎలా సాధ్యమవుతుంది?
ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రతినెలా కనీసం 2000 మందిని బలి గొంటున్న కోవిడ్–19కి, సిఫిలిస్, ఎయిడ్స్, క్షయ ఇత్యాది సాంక్రామిక వ్యాధుల మధ్య కొన్ని సాదృశ్యాలు ఉన్నాయని మిచిగాన్ విశ్వవిద్యాలయ వైద్యశాస్త్ర ఆచార్యుడు పావెల్ హెచ్ కజాంజియన్ అన్నారు. మహమ్మారులు, సాంక్రామిక వ్యాధులను నిర్మూలించాలంటే నవీన చికిత్సా పద్ధతులు, శక్తిమంతమైన ఔషధాలు మాత్రమే సరిపోవని, ప్రజాహితకరమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఉండడం తప్పనిసరి అని ఆయన తన ‘Persisting Pandemics’ అన్న పుస్తకంలో విపులంగా నిర్ధారించారు. 15వ శతాబ్దం నుంచి పీడిస్తున్న సిఫిలిస్, గత శతాబ్ది పూర్వార్థంలో సల్వార్సన్, పెన్సిలిన్ అనే డ్రగ్స్‌తో అదుపులోకి వచ్చినప్పటికీ ప్రజారోగ్య వ్యవస్థలు ఆ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించడంలో విఫలమయ్యాయి. అధునాతన చికిత్సా పద్ధతులు, ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ వ్యాధి అంతమొందకపోవడానికి కారణం సామాజిక ఆర్థిక పరిస్థితులేనని కజాంజియన్ స్పష్టం చేశారు. 2020లల్లో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 80 లక్షల కొత్త సిఫిలిస్ కేసులు నమోదవుతున్నాయి. 1980వ దశకంలో వెలుగులోకి వచ్చిన ఎయిడ్స్ వ్యాధి నివారణకు పటిష్ఠమైన చికిత్సా పద్ధతులు, ఔషధాలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఏటా దాదాపు ఏడు లక్షల మంది ఆ వ్యాధితో చనిపోతున్నారని, దాదాపు నాలుగుకోట్లమంది హెచ్‌ఐవి వైరస్‌తో సహజీవనం చేస్తున్నారని ఆయన తెలిపారు. పారిశ్రామిక విప్లవానంతరం యూరోపియన్ నగరాలలో ప్రబలిన క్షయ వ్యాధి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఏటా కనీసం 17 లక్షల మందిని బలిగొంటూనే ఉన్నది. పేదరికంలో మగ్గుతున్నవారే ఈ వ్యాధికి బలవుతున్నారు. ఈ సాంక్రామిక వ్యాధులకు కారణమైన సూక్ష్మజీవుల నిర్మూలన లక్ష్యంగా చికిత్సా పద్ధతులు, ఔషధాల అభివృద్ధి ఎంతగా జరిగినా ప్రజారోగ్య కార్యక్రమాలను ఎంత సమర్థంగా అమలుపరిచినా అమానుష సామాజిక, ఆర్థిక పరిస్థితులే ఆ వ్యాధులు కొనసాగేందుకు కారణమవుతున్నాయని కజాంజియన్ నిర్ధారించారు. సాంక్రామిక వ్యాధుల నివారణకు, రోగకారక విషక్రిములను నిర్మూలించేందుకు ఆధునిక వైద్యశాస్త్రం మహాశక్తిమంతమైన చికిత్సాపద్ధతులు, ఔషధాలను అభివృద్ధిపరిచిందని, అయితే ఆ వ్యాధుల విస్తరణకు కారణమవుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను తొలగించినప్పుడు మాత్రమే సంపూర్ణ ప్రజారోగ్యం సాధ్యమవుతుందని కజాంజియన్ స్పష్టం చేశారు. మన ప్రజారోగ్య వ్యవస్థల బాధ్యులు ఈ సత్యాన్ని ఉపేక్షిస్తే మన ఆరోగ్య భవిష్యత్తు నిన్నటి దుఃఖమయ ఇతిహాసమే అవుతుందనడంలో సందేహం లేదు.
వాతావరణ మార్పు సంక్షోభం వలే, భావి మహమ్మారులను కూడా మానవాళి మనుగడకు ఒక మౌలిక సవాలుగా తీసుకోవాలి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కోవిడ్ ఆనవాళ్లను పూర్తిగా చెరిపివేసేందుకు, సంభావ్య మహమ్మారుల నెదుర్కొనే విషయమై చట్టసభల్లో ప్రత్యేక చర్చలు జరగాలి. భావి మహమ్మారులను నిరోధించే విషయమై పంచాయత్ స్థాయి నుంచి ప్రజాప్రతినిధులు అందరికీ అవగాహన కల్పించాలి. సమస్య తీవ్రతపై స్పష్టత ఉంటే ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో అవరోధాలను అధిగమించడం సులభమవుతుంది. కోవిడ్ విపత్తులో లాక్‌డౌన్ శృంఖలాలలో జనజీవనం అల్లాడిపోయినప్పుడు సామాన్య ప్రజలలో వెల్లువెత్తిన మానవతా స్పందనలను భావి మహమ్మారుల నిరోధానికి స్ఫూర్తిగా నిలుపుకోవాలి. ఆ మానవతా సేవలలో పాల్గొన్నవారి అనుభవాలను, సంబంధిత పాత్రికేయ కథనాలు, వ్యాఖ్యానాలను నిర్దుష్ట రీతుల్లో భద్రపరచుకోవడం మరీ ముఖ్యం.
ఈ వార్తలు కూడా చదవండి:
IT Raids: శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ దాడులు.. నిర్ఘాంతపోయిన అధికారులు..
AP News: రాజధానిలో భూకేటాయింపులపై మంత్రుల కమిటీ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..