ధనిక రాష్ట్రంలో 84శాతం పేదలా?
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:03 AM
తెలంగాణ ధనిక రాష్ట్రమని, తలసరి ఆదాయం లెక్కన దేశంలో మొదటిస్థానంలో ఉందని మన నాయకులు గొప్పగా చెపుతుంటారు. అయితే ఇంతవరకు 90 లక్షల రేషన్ కార్డులు మంజూరు కాగా, కొత్తగా ఇంకా...

తెలంగాణ ధనిక రాష్ట్రమని, తలసరి ఆదాయం లెక్కన దేశంలో మొదటిస్థానంలో ఉందని మన నాయకులు గొప్పగా చెపుతుంటారు. అయితే ఇంతవరకు 90 లక్షల రేషన్ కార్డులు మంజూరు కాగా, కొత్తగా ఇంకా 10 లక్షల కార్డులు ఇవ్వబోతున్నారు. ప్రభుత్వం ప్రకారం తెలంగాణలో 84శాతం జనాభాకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం సరఫరా ఉగాదినాడు ఆరంభమైంది. ఈ లెక్కన రాష్ట్ర జనాభాలో 84శాతం మంది పేదవారే.
స్వాతంత్య్రం వచ్చి దేశ విభజన జరిగినప్పుడు పంజాబ్ రాష్ట్రంలో మంచి పంటలు పండే భూములు పాకిస్తాన్‌కు వెళ్లాయి. దానితో దేశంలో తిండిగింజల కొరత ఏర్పడింది. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ భాక్రానంగల్ వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మించడంతో ఆహారధాన్యాల దిగుబడి పెరిగింది. అయినా, పెరుగుతున్న జనాభాకు అది సరిపోక ఆహార కొరత నెలకొంది. అప్పటి పరిస్థితుల్లో పేదలకు ఆహారభద్రత కల్పించడానికి 1955లో ప్రజాపంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేసి, పేదలకు రేషన్‌కార్డుల ద్వారా సబ్సిడీపై ఆహారధాన్యాలు పంపిణీ చేశారు. అయితే ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగినా, పేదలకు ఆహారధాన్యాలు సరిగా అందలేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం 2013లో ప్రజలకు ఆహారధాన్యాలు సబ్సిడీపై అందించడానికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (జాతీయ ఆహార భద్రత చట్టం) తీసుకొచ్చింది. దీనితో రాష్ట్రాలకు కావలసిన ఆహారధాన్యాలు, కిరోసిన్ వంటివి కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నది.
తెలంగాణ ఏర్పడ్డాక, రాష్ట్రానికి ప్రతినెలా ఒక లక్ష ఆరువేల టన్నుల బియ్యం, 4,300 టన్నుల గోధుమలు, 5 వేల టన్నుల చక్కెర వంటివి కేంద్రం ఇచ్చింది. 2015 ఏప్రిల్ నుంచి కేంద్రం ఇచ్చిన బియ్యం, గోధుమలకు అదనంగా రాష్ట్రం మరో 56 వేల టన్నుల బియ్యం, 8 వేల టన్నుల గోధుమలు ప్రతి నెల ప్రజా పంపిణీ వ్యవస్థకు అందజేసింది. అదీకాక కేంద్రం ఇచ్చే కార్డు ఉన్న కుటుంబంలో ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇవ్వగా, రాష్ట్రం ఇంకో కిలో బియ్యం తన వంతు వాటాగా కలిపి ఆరు కిలోలు ఇస్తున్నది. ఈ చర్య రాజకీయ లబ్ధి కోసం తీసుకున్నదే కాని, నిజంగా అవసరం ఉన్నదా అని చూడలేదు.
కరోనా సమయం నుంచి కేంద్ర ప్రభుత్వం దేశంలోని 80 కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఆహారధాన్యాలు సరఫరా చేస్తున్నది. అందులో భాగంగా తెలంగాణలో కేంద్రం తరపున 55 లక్షల కార్డుల ద్వారా కోటి 92 లక్షల జనాభాకు ఉచితంగా రేషన్ అందజేస్తున్నది. దీనికి అదనంగా రాష్ట్రం 35లక్షల రేషన్ కార్డుల ద్వారా 90 లక్షల మందికి రేషన్ అందజేస్తున్నది. అంటే మొత్తం 90 లక్షల రేషన్ కార్డులతో సుమారు 2కోట్ల 82లక్షల మందికి రేషన్ అందిస్తున్నారు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 10 లక్షలు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నది. దానితో రాష్ట్రంలో మొత్తంగా ఒక కోటి రేషన్ కార్డులతో సుమారు 3.12 కోట్ల జనాభాకు రేషన్ ఇస్తున్నారు. ఇంతకు పూర్వం దొడ్డు బియ్యం ఇవ్వగా, ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తున్నారు.
దేశంలో నీతీఆయోగ్ లెక్కల ప్రకారం జనాభాలో 3.74శాతం ప్రజలు అతి పేదలుగా ఉన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాభా ఏ లెక్కన చూసినా 20శాతం లోపే. అటువంటి పరిస్థితిలో ఉచితంగా సన్నబియ్యం 84శాతం ప్రజలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందజేయడమంటే ప్రజాధనాన్ని వృధాచేయడమే. బోగస్ రేషన్ కార్డులు తొలగించినా కేంద్రం ఇచ్చే ఆహారధాన్యాలు సుమారు 2 కోట్ల మందికి అంటే జనాభాలో 50శాతం మందికి సరిపోతాయి. అదనంగా రాష్ట్రం ప్రజాపంపిణీ వ్యవస్థపై ఏ విధమైన ఖర్చు చేయాల్సిన పని లేదు.
గత సంవత్సరం ప్రజాపంపిణీ వ్యవస్థ కొరకు 3 వేల కోట్లు ఖర్చు అయింది. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నారు కాబట్టి ఈ ఖర్చు 5 వేల కోట్ల వరకు చేరవచ్చు. రేషన్ కార్డు కొరకు అర్హత మొదట్లో గ్రామీణ ప్రాంతాలలో 2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట, అలాగే పట్టణ ప్రాంతాలలో సాలీనా ఆదాయం 1.5 లక్షల లోపుగా నిర్ణయించగా; దానిని 3.5 ఎకరాల మాగాణి, 7.5 ఎకరాల మెట్టకు పెంచారు. అలాగే పట్టణ ప్రాంతాలలో సాలీనా ఆదాయం 2 లక్షలకు పెంచారు. ప్రభుత్వ, ప్రైవేటు, పొరుగుసేవ ఉద్యోగులు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వ్యక్తులు, ప్రభుత్వ పెన్షన్‌దారులు వంటివారు రేషన్ కార్డు పొందడానికి అనర్హులు. నేడు తెలంగాణలో 90శాతం ఇళ్ళలో టీవీ, మోటారుసైకిల్ వంటివి ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో సేవారంగం, పొరుగు సేవలలో చాలామంది ఉపాధి పొందుతున్నారు.
ఈ మధ్య సుప్రీంకోర్టు... ప్రభుత్వాలు ఉచితాల పేరుతో ప్రజాధనం ఖర్చు చేస్తూ ప్రజలను సోమరిపోతులుగా చేస్తున్నది అన్నది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో స్థానికులు పనిచేయకపోవడంతో చాలామంది కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే సుప్రీంకోర్టు వారు చెప్పింది తెలంగాణకు వర్తిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డులు ఏరివేసి, రాష్ట్ర జనాభాలో 50శాతం జనాభాకు మాత్రమే రేషన్ అందేటట్లు చర్యలు తీసుకోవాలి. తెలంగాణలోని 84శాతం జనాభాకు కోటి రేషన్ కార్డుల ద్వారా ఉచితంగా సన్నబియ్యం ఇవ్వడమంటే రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతుంది. ప్రజలను సోమరిపోతులుగా మారుస్తుంది. ప్రస్తుతం కేంద్రం కోటి 92 లక్షల మందికి ఉచితంగా ఇచ్చే బియ్యం సరిపోతుంది. నేడు బియ్యం కన్నా పప్పు దినుసులు, వంట నూనె కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఈ రెండూ కూడ తక్కువ ధరలో ఈ 50శాతం జనాభాకు ఇచ్చినా మేలే. ప్రభుత్వం ప్రజల ధనానికి ఒక కస్టోడియన్ మాత్రమే. రాజకీయ లబ్ధికై ప్రజాధనాన్ని ఖర్చు చేయడాన్ని ప్రజలు సమర్థించరు.
యం. పద్మనాభరెడ్డి
అధ్యక్షులు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News And Telugu News