మధ్యతరగతి స్త్రీ నా ఇతివృత్తం
ABN , Publish Date - Jan 20 , 2025 | 12:34 AM
చెప్పడానికి 1963 అని ఒక లెక్క చెప్పినా, ఒకటో తరగతిలో బీర్కూరు ప్రభుత్వ పాఠశాలలో పాటల పోటీ పెడితే నేను స్వంతంగా పాట అల్లుకుని పాడాననీ, బహుమతులుగా రిబ్బన్ ముక్క, రెండు రంగు చాక్‌పీస్‌లూ, రెండు బలపాలూ...

‘‘There is no greater agony than bearing an untold story inside you’’ అని ఎప్పుడో మాయా ఏంజిలో అన్నట్టు స్వాతి శ్రీపాద ఎంత వేదనను మోస్తున్నారో బాల్యం నుంచీ– ఆరు దశాబ్దాలకు పైగా నిరంతర ప్రవా హంగా రాస్తూనే వున్నారు. కవిత, కథ, నవల, పాట– ఒకటేమిటి దాదాపు అన్ని ప్రక్రియల్లోనూ సృజించి తన ముద్ర చాటుకు న్నారు. ఇప్పటికి ఎనిమిది కవితా సంపుటాలు, ఏడు నవలలు, ఆరు కవితా సంకలనాలు వెలువరించడంతోపాటు, తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషల వారికి చేర్చాలనే ఉన్నతాశయంతో సుమారు మూడు డజన్ల పుస్తకాలను ఆంగ్లంలోకి అనువదిం చారు. ఆమె నేడు సుశీలా నారాయణ రెడ్డి సాహితీ అవార్డ్ అందుకుంటున్న సందర్భంగా ఆమెతో సంభాషణ.
ఇంటర్వ్యూ : దేశరాజు
1963 నుంచి రాస్తున్నా మీపై దిగంబర కవిత్వం, అరసం, విరసం ప్రభావాలు పడకపోడానికి కారణం?
చెప్పడానికి 1963 అని ఒక లెక్క చెప్పినా, ఒకటో తరగతిలో బీర్కూరు ప్రభుత్వ పాఠశాలలో పాటల పోటీ పెడితే నేను స్వంతంగా పాట అల్లుకుని పాడాననీ, బహుమతులుగా రిబ్బన్ ముక్క, రెండు రంగు చాక్‌పీస్‌లూ, రెండు బలపాలూ ఇచ్చారని అమ్మ చెప్పేది. రాయాలన్న తపన జన్మాంతరాల నుండి తెచ్చుకున్నట్టున్నాను. 1963 నెహ్రూ మరణం అప్పుడూ ఏవో పేరడీ పాటలు రాసిన గుర్తు. అరసాలూ, విరసాలూ ఏవైనా సమాజంలో ఒక గుర్తింపు కోసమే. ఆరోజుల్లో విరసం రెండో వార్షిక సభలకు వెళ్ళాను. శ్రీశ్రీని సభలో ఎవరో అడిగారు ‘విప్లవం మీ ఊపిరి అయితే, నా హృదయంలో నిదురించే చెలీ అని పాట ఎలా రాశారూ’ అని. ‘నా హృదయంలో నిదురించే చెలి విప్లవమే’ అన్నారా యన. ఎన్ని విప్లవాలు నాలుక చివరి నుండి వచ్చినా, దెబ్బ తగిలితే అమ్మా అనే అంటాము, అన్నమే తింటాము. ఈ ప్రపంచం నడిచేది ప్రేమ మీదే అని పించింది. బయట ఉద్యమ ప్రభావాలూ, ఇంట్లో ఛాందస భావాలూ ఏవీ నాపై ప్రభావం చూపలేదు.
కథ, నవలా రచనలో మీరు అనుసరించే రచనా వైఖరి ఏమిటి?
చిన్నప్పుడు విపరీతంగా చదువుతూ, సమస్యలకు రచనలో పరిష్కారాలు వెతుకున్న దశ తర్వాత, క్రమంగా నా చుట్టూ రోజువారీ జీవితంలో కనిపించే సమస్యలు, వాటి మూలాలు తీసుకుని నాకు తోచిన, నేను అభిలషించే పరిష్కారాలు అందించడం మొదలెట్టాను. అవే నా కథలు, నవలలు. అయితే నాకున్న పరిధిలో నా రచనలకు మూలాధారాలు మధ్య తరగతి స్త్రీల సమస్యలు. అలాగని అది ఫెమినిజం కాదు. స్త్రీలు ఎదుర్కునే చిత్ర విచిత్రమైన సంఘ ర్షణలు. గుడ్డిగా ఏవైపూ పక్షపాతం చూపను. అందుకే కొన్నిచోట్ల సెంటిమెంట్‌కు విలువ ఇవ్వడం, తప్పని చోట నియమ నిబం ధనలు తోసిరాజని అడుగు ముందుకు వెయ్యడం కనిపిస్తుంది.
తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువాదం చేసేప్పుడు ఎదురైన ప్రధానమైన ఇబ్బందులు ఏమిటి?
చాలా ఏళ్ళ పాటు తెలుగు గాలి కూడా సోకని ఉద్యోగంలో ఉండటం వల్ల నా ఆలోచన ఎప్పుడూ రెండు భాషల్లో సాగేది. అనువాదం నన్ను నేను పూర్తిగా పనిలో నిమగ్నం చేసుకు నేందుకు ఇష్టంగా అలవరచుకున్న వ్యాపకం. నిజమే మన తెలుగు నుడికారాలూ, మనకే స్వంతమైన వ్యక్తీకరణలూ ఇంగ్లీష్ లోకి రాలేవు. సంస్కృతి, ఆచార వ్యవహారాలూ, ఆహారపు అల వాట్లూ కొంచెం ఇబ్బందే. కాని మన భాషతో పాటు వాటినీ పరిచయం చెయ్యాలని నా అభిప్రాయం. అది మంచి అను వాదంగా అనిపించకపోవచ్చు. కాని మన శైలి, మన జీవన విధానం చెప్పలేకపోతే ఇక అనువాదాలెందుకు? మరొకటి మనం మనంగా కాక మరొకరిని దృష్టిలో పెట్టుకుని అనువ దించడం. మన భావం స్పష్టంగా అన్యభాషీయులకు చేరాలి. రాజీ పడకపోతే కష్టమే.
తెలుగు పాటలను ఇంగ్లీషులోకి తీసుకెళ్లేప్పుడు ఎటు వంటి పద్ధతులు అనుసరించారు? వ్యవహారికాలు, సామెతలు, మాండలిక పదాలు అనువాదానికి లొంగాయా?
జన్మతహా పాట మీద ఉన్న వ్యామోహం వల్ల కావచ్చు కొంత తెలీకుండానే ఆ దారిలోకి వెళ్ళాను. ‘నేలమ్మా, నేలమ్మా’ అనగానే వెంటనే అదే ట్యూన్‌లో ‘మదర్ సాయిల్, మదర్ సాయిల్’ అనాలనిపించింది. ఆ ఎంపిక తెలియాలంటే రెండు భాషలలో పద విజ్ఞానం పెంచుకోవాలి. నేను పేరుకో, గుర్తింపుకో అనువాదం చెయ్యడం లేదు. సో నో కాంప్రమైజ్. సామెతలు కొన్ని సరిసమానాలు ఉన్నాయి. లేనివి సృష్టించుకోవాలి. మాండలికాలూ అంతే. సరైన పదం కోసం రోజులకు రోజులు పని ఆపేసి ఆలోచించిన సందర్భాలెన్నో ఉన్నాయి.
ఆరు దశాబ్దాల సాహిత్య వ్యాసాంగాన్ని అవలోకనం చేసుకుంటే ఏమనిపిస్తుంది?
ఆరేనా? నాతోపాటు పుట్టి నాతోనే సాగుతున్న ఈ కృషి అవలోకనం చేసుకోడమంటే నా జీవితాన్ని అవలోకనం చేసుకోడమే. ప్రతిక్షణమూ జీవితంలోనూ, సాహిత్యంలోనూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. ఏదో సాధించానని ఎప్పుడూ అనిపించదు.
కవిత, కథ, నవల, పాట, అనువాదం అన్ని ప్రక్రియల్లో చేయి తిరిగిన మీకు తగిన గుర్తింపు వచ్చిందని భావిస్తున్నారా?
ఏ గుర్తింపు కోసమో రాసుకోలేదు. రోజూ ఓ కవితో, పాటో రాస్తూనే ఉంటా. నలుగురితో పంచుకుంటా. చదివి ఆనందిస్తారని. చుట్టూ మనసుకు హత్తుకునే ఘటనలు, మనసును నొప్పించే మాటలు, మనసు మెలితిప్పే బాధలు అన్నీ కవిత్వం కాలేవు. ఏదో పరిష్కారం చెప్పాలన్న తపన కథలో తప్ప సాధ్యం కాదు, సుదీర్ఘమైన జీవితం ప్రస్తావించ డానికి నవల తప్ప మరో దారిలేదు. రచన నా హెల్త్ డ్రింక్, రచన నా ఎనర్జీ బూస్టర్. అది నా ఊపిరి, ఉనికి. అవ్యక్తాన్ని వ్యక్తం చేసే బాధ్యత నాది.
స్వాతీ శ్రీపాద