ఇవి హృదయం లెక్కలు
ABN , Publish Date - Feb 10 , 2025 | 06:39 AM
తా టిశెట్టి రాజు గారి ‘ఏకాంతం’ కవితను ఇటీవలి నా ప్రియపద్యంగా విశ్లేషణకు ఎంచుకున్నాను. ప్రేమలో ఉండే స్వచ్ఛత, నిజాయితీతో కూడిన కవి భావ ప్రకటన... అదే ఈ కవిత ఆకట్టుకోడాని....

తా టిశెట్టి రాజు గారి ‘ఏకాంతం’ కవితను ఇటీవలి నా ప్రియపద్యంగా విశ్లేషణకు ఎంచుకున్నాను. ప్రేమలో ఉండే స్వచ్ఛత, నిజాయితీతో కూడిన కవి భావ ప్రకటన... అదే ఈ కవిత ఆకట్టుకోడానికి ముఖ్య కారణం. ఈ కవితలో మొదటి మూడు స్టాంజాలు మూడ్‌ని రిఫ్లెక్ట్ చేసే వాతావరణాన్ని వర్ణిస్తే, తర్వాతి పేరాలు కవి భావనని తెలియ జేస్తాయి. మన మనసుని బట్టే చుట్టూ వాతావరణం కనిపిస్తుంది. నిజానికి ఏది చీకటి? ఏది వెలుగు? ప్రతీదీ మన భాష్యమే! ప్రతీదీ మన అన్వయమే! మన అనుభూతులు మనతో ఆడుకునే ఆటల దృశ్యాలే అన్నీ!
ప్రేమ ఒక వరము, ఒక శాపము. ఆశించడం, ఆక్రోశించడం జీవితంలో భాగాలు. ప్రేమతో నిండిన హృదయానికి, బండబారినపోయిన లోకం తీరు, దాని లెక్కలు ఒక మింగుడుపడని విషయం. అందుకే ప్రేమలో ఓడిపోయినా సరే, హృదయానికే పెద్ద స్థానమిచ్చి, ఓడినా ప్రేమదే గెలుపని చెప్పాడు కవి. ప్రేమ కలిగిన మనసు స్వచ్ఛమైనది. ఆ మనసు నుండీ పుట్టే దుఃఖాలు, వ్యథలు, కన్నీళ్ళు, కవిత్వాలు ఏవైనా సరే స్వచ్ఛమైనవీ, అర్థవంతమైనవీ, విలువైనవి!
బంధం రెండు హృదయాలను కలిపే వంతెన. అది విఫలమై, ఒంటరైన హృదయంలో ప్రేమ అనాథ, బిచ్చగత్తె! లేదా లాభనష్టాల బేరీజు లోకంలో ప్రేమ దిక్కులేని అనాథ! రెండు హృదయాల మధ్య తాళ గతులు తప్పితే పొసగని బంధాలలో ప్రేమ అనాథ! మనిషి చుట్టూ ఉండే రకరకాల పరిస్థితులతో, ప్రేమకివ్వలేని విలువతో ప్రేమ అనాథ!
ప్రేమను కోల్పోయాక మళ్ళీ ప్రేమ కోసమే పరితపిస్తాడు మనిషి. అలా ప్రేమ వెతుకులాటలో మనుషుల స్వభావాల గురించి గమనింపులేనితనంలోనో, లేదా రెండు మనసుల మధ్య సామరస్యం కుదరకో పొలమారటం, పోగొట్టుకోవటం జరిగిపోతాయి. తిరిగి మరో ప్రేమ కోసమో, భరోసా కోసమో వెతుకులాట మొదలవుతుంది.
అంతులేనంత ప్రేమతో ఈ ప్రపంచం నిండి ఉంది. ఎన్నో బంధాలు మనిషిని పెనవేసుకునే ఉన్నాయి. అయినప్పటికీ తనకి తాను మాత్రమే మిగిలే ఒంటరితనం మనిషిని వెంటాడుతూనే ఉంటుంది, చివరికి ఆ ఒంటరితనమే మిగులుతుంది చాలాసార్లు. ఇదే తాత్వికతతో ఈ కవిత ముగుస్తుంది.
రాళ్ళబండి శశిశ్రీ
74163 99396
ఇవి కూడా చదవండి
Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..
Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..
Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ
For More National News and Telugu News..