ఇందిరమ్మరాజ్యంలో ఇదేమి న్యాయం?
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:47 AM
హైద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన లేదా ఆ విశ్వవిద్యాలయ పరిధిలో గత ఐదు దశాబ్దాలుగా ఉన్న నాలుగువందల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం...

హైద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన లేదా ఆ విశ్వవిద్యాలయ పరిధిలో గత ఐదు దశాబ్దాలుగా ఉన్న నాలుగువందల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం మా లాంటి వాళ్ళని కలవరపెడుతున్నది. రెండున్నర దశాబ్దాలు అధ్యాపకుడిగా బోధన చేయడం వల్ల కూడా ఆ విశ్వవిద్యాలయం పట్ల ఒక ఆత్మీయత, అభిమానం ఏర్పడ్డాయి. ఆ కాలంలో పనిచేసిన చాలామంది నాలాగే ఆశ్చర్యపోతున్నారు. ఇది విశ్వవిద్యాలయ స్వంత సమస్య కాదు, విశాల సమాజానికి, విద్యారంగానికి, విశ్వవిద్యాలయాల భవిష్యత్తుకి, తెలంగాణ సమాజ అస్తిత్వానికి సంబంధించిన సమస్య. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా ప్రాంతంలో తీవ్రంగా జరిగిన ఉద్యమాల పురిటి నొప్పుల నుండి ఇది పుట్టింది. 1960 చివరలో తెలంగాణ ఉద్యమం, అలాగే 70లలో జరిగిన జై ఆంధ్ర ఉద్యమాలకు పరిష్కారంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక ఒడంబడిక చేసుకున్నది (సిక్స్ పాయింట్ ఫార్ములా).
ఈ ఒడంబడిక అమలులో చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా దీనికి 32వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత కల్పించారు. ఈ ఆరు అంశాలలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం రెండవ పాయింట్‌లో చేరింది. బహుశా భారత రాజ్యాంగంలో ప్రస్తావింపబడని ఒకే ఒక్క విశ్వవిద్యాలయం హైదరాబాద్ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో ఏ మార్పులు చేయాలన్నా బహుశా 32వ రాజ్యాంగ సవరణను సవరించవలసి ఉంటుంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి 1973లో రూపకల్పన జరిగింది. ప్రొ. గురు బక్స్‌సింగ్‌ను మొదటి వీసీగా నియమించారు. విశ్వవిద్యాలయానికి సరోజినీ నాయుడు నివసించిన గోల్డెన్ త్రెషోల్డ్‌ని ఆ కుటుంబం చాలా ఉదారతతో ఇచ్చింది. ఇక్కడ గాంధీ నాటిన ఒక మొక్క కూడా విలువైన జ్ఞాపకంగా ఉంది. విశ్వవిద్యాలయ నిర్మాణానికి కావలసిన భూమిని ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మొదట మొహదీపట్నం దగ్గర ఉన్న దాదాపు 800ల ఎకరాల కంటోన్‌మెంట్ భూమి ఇవ్వచూపారు. మొదటి వీసీ ఒక విశిష్టమైన విశ్వవిద్యాలయ నిర్మాణం కావాలంటే కనీసం రెండువేల ఎకరాలు కావాలని ప్రతిపాదించినప్పుడు రెండువేల రెండువందల ఎకరాలను కేటాయించారు. వీసీ ఒక కోటి రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టారు.
ఈ సందర్భంలో విశ్వవిద్యాలయ కాంపౌండ్ వాల్‌కి ఇంత ప్రాధాన్యం ఏమిటని అప్పటి రిజిస్ట్రార్ జార్జిని అడిగితే, ‘పంజాబీలకు భూమి విలువ తెలుసు. ఇది అన్యాక్రాంతం కాకుండా కాపాడవలసి ఉంటుందని ఆయన భావిస్తున్నారు’ అన్నాడు. ఇప్పుడు ఆలోచిస్తే గురు బక్స్‌సింగ్ ఎంత దూరదృష్టిగలవారో అర్థమవుతుంది. ఇందిరాగాంధీ ప్రత్యేక శ్రద్ధ వల్ల, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వడం వల్ల, ఈ భూమిని రిజిస్టర్ చేయించాలని కాని, లీజ్ డీడ్ చేసుకోవాలని కానీ ఎవ్వరికీ అనిపించలేదు. ఒక్కసారి ప్రభుత్వం విశ్వవిద్యాలయానికి స్థలం ఇచ్చాక మళ్లీ దాంట్లో చేయి పెడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. హైదరాబాద్ నగరం చాలా వేగంగా విస్తరించడం, ప్రైవేటు ముఠాలు పుట్టుకరావడం ఒక విషాదం. బహుశా భారతదేశంలో ఏ పట్టణానికి కూడా ఇంత ప్రభుత్వ లేదా ప్రజల భూమి లేదు. నిజాం రాజ్యంలో హైదరాబాద్ చుట్టూ భూమి సర్ఫెఖాస్ అంటే రాజ్యానికి చెందిన భూమి. దేశ విభజన తర్వాత చాలామంది నవాబులు పాకిస్థాన్‌కు వెళ్ళడంతో వాళ్ళు వదిలేసిన భూమి, పెద్ద పెద్ద ప్యాలెస్‌లు ప్రభుత్వపరమయ్యాయి. భాషా రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఏ ప్రభుత్వరంగ సంస్థకైనా భూమి ఏ రాష్ట్రం వారు ఇస్తారూ అంటే ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో ఉండేది. అందుకే హైదరాబాద్‌లో ఎన్నో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వెలిసాయి. మొదట్లో ప్రభుత్వ భూమి హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన పాత్ర నిర్వహించింది. పందొమ్మిది వందల ఎనభై, తొంభైలలో ఆర్థిక సంస్కరణల ముద్దు పేరుతో అభివృద్ధి దిశ పూర్తిగా మారింది.
ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ ప్రభంజనం వీచడంతో, అంతకాలంగా ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అనే ప్రజాస్వామ్య భావన క్రమక్రమంగా క్షీణించి పాలకుల ఆలోచనని, అవగాహనను ఆక్రమించుకున్నది. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు నయానా, భయానా ఆక్రమించుకొనడం హైదరాబాద్ నగర స్వరూప స్వభావాలను, రూపురేఖలను మార్చివేసింది. భూదాహం విపరీతంగా పెరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో ఎన్నో నినాదాలు వచ్చినా ‘ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి’ ఒక నినాదంగా మారలేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో కేసీఆర్‌తో సహా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు తమ పదవులకు రాజీనామా చేయడంతో హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు వారికి అభినందన సభ నిర్వహించారు. ఆ సభలో కేసీఆర్, జయశంకర్, నేను ముగ్గురమే ప్రసంగించాం. ఈ ప్రసంగంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో జోక్యం చేసుకోవద్దని, దీనిని హైదరాబాద్ ఉమ్మడి సంస్కృతిలో భాగంగా భావించాలని కోరినపుడు కేసీఆర్ స్పందిస్తూ, విశ్వవిద్యాలయ ప్రతిపత్తిని కాపాడుతామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఆయన ప్రభుత్వం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఒక సందర్భంలో కేటీఆర్ హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి అంత భూమి ఎందుకు అని అడిగితే, ‘‘మీరు విదేశాలలో కూడా ఉన్నారు కదా. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి ఎనిమిదివేల ఎకరాల భూమి ఉంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఐదువేల ఎకరాలు ఉంది. విశ్వవిద్యాలయం అంటే కేవలం భవనాలే కాదు, విద్యార్థులు నిరంతరంగా ప్రకృతిలో జీవించడం వల్ల వాళ్ళ ప్రాపంచిక దృక్పథం పరిధి పెరుగుతుంది. ప్రకృతి సంపద పిల్లల సంతోషానికి కూడా దోహదపడుతుంది,’’ అని చెప్పవలసి వచ్చింది. ఈ విశ్వవిద్యాలయ భూమిలో కొంతభాగం కొన్ని ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు. ఆ రోజుల్లో బస్సు సౌకర్యం లేకపోవడం వలన రోడ్డు రవాణా సంస్థకి కొంత భూమి ఇస్తే బస్సు సౌకర్యం మెరుగుపడుతుందని భావించాం. చంద్రబాబునాయుడు రంగారెడ్డి జల్లా హెడ్‌క్వార్టర్స్‌కు కొంత భూమి కావాలంటే ఇచ్చిన భూమిలో పూర్తి నిర్మాణం జరిగాక అది ట్రిపుల్ ఐటీ (IIIT)కి ఇచ్చారు.
ఏ సంస్థకు ఇచ్చినా ప్రజాప్రయోజనానికి మాత్రమే ఇచ్చారు. ఒక దశలో ఉర్దూ యూనివర్సిటీకి భూమి కావాలని అప్పటి కేంద్ర విద్యామంత్రి బొమ్మయ్, సెక్రటరీ వైద్యనాథ్ అయ్యర్ ఇద్దరూ స్వయానా విశ్వవిద్యాలయానికి వచ్చి అడిగారు. అప్పటి వీసీ ప్రొ. గోవర్ధన్ మెహతాతో సహా అధ్యాపకులు భూమి ఇవ్వడానికి అంగీకరించలేదు. ప్రొ. మెహతా ఒక అరగంట పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేసి హైదరాబాద్ నగరం పర్యావరణ రీత్యా బాగా దెబ్బతిన్నదని, ఈ భూమి పట్టణానికి ఊపిరితిత్తుల్లా (Lung Space) పనిచేస్తున్నదని, ఇది ఇలా లేకపోతే పర్యావరణం దెబ్బతింటుందని చెప్తే మంత్రి బొమ్మయ్, మీకు అంత అభ్యంతరం ఉంటే, మేము వేరే స్థలం చూస్తామని వెళ్ళిపోయారు. ఇదీ ఒక విశ్వవిద్యాలయాన్ని గౌరవించే తాత్వికత, సంస్కారం ఉన్న రాజకీయ నాయకుడి స్పందన. హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం అన్న ఒక్క లోపం వల్ల న్యాయవ్యవస్థ కూడా అది ప్రభుత్వ భూమే అనే జడ్జ్‌మెంట్ ఇవ్వవచ్చు. భూమి నిజానికి ప్రజలది. విశ్వవిద్యాలయం ప్రజలది. ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులు చాలామంది ఐఏఎస్ అధికారులుగా, ఇద్దరు మంత్రివర్గ సభ్యులుగా ఉన్నారు. ఇక్కడి విద్యార్థులు దేశవిదేశాల్లో ఉన్నారు. విశ్వవిద్యాలయానికి అత్యంత ప్రతిష్ఠ ఉంది. ఇంతకన్నా ఏ సంస్థ ఐనా సమాజానికి ఏం ఇవ్వగలదు? అయినా ప్రకృతి సంపదను బజారులో పెట్టి అమ్మడం ఎలాంటి భవిష్యత్తును సూచిస్తున్నది? ప్రజా ప్రభుత్వాలకి చారిత్రక స్పృహ లేకపోవడం చాలా ప్రమాదం. విశ్వవిద్యాలయం భూమిని ప్రభుత్వ భూమి అని వెనక్కు తీసుకోవడం చూస్తే ఒక సంఘటన గుర్తుకువస్తున్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు పాలమూరు అధ్యయన వేదిక ఆ జిల్లాకు కృష్ణా నీళ్ల కేటాయింపులో న్యాయమైన వాటా రాలేదని ముప్పై గంటల నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించింది.
ఒక గ్రామీణ పేద మహిళ ఆ శిబిరం దగ్గర నిలబడి ఆసక్తిగా ప్రసంగాలు వింటుంటే, ఆమెను కూడా మాట్లాడమని నిర్వాహకులు ప్రోత్సహించారు. ఆమె మాట్లాడుతూ ఇందిరాగాంధీ తనకు రెండు ఎకరాల భూమి ఇస్తే కష్టపడి తన పిల్లలను చదివించాననీ, కాని పిల్లలకి ఉద్యోగాలు రాలేదు సరికదా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పేర ఆ భూమి ప్రభుత్వ భూమి అని బలవంతంగా వెనక్కి తీసుకున్నదని తెలిపింది. తానిప్పుడు మహబూబ్ నగర్ పట్టణంలో పనిమనిషిగా మారానని తనకు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యమే కావాలని ఆవేశంగా మాట్లాడింది. హైదరాబాదు విశ్వవిద్యాలయ భూమి కూడా ఈ సంఘటనకు చాలా దగ్గరగా ఉన్నది. ఇందిరాగాంధీ వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఇప్పించిన భూమిని ఇందిరమ్మ రాజ్యమే వెనక్కు తీసుకోవడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
ప్రొ. జి. హరగోపాల్