హాలీవుడ్ స్టైల్ దొంగతనం.. రోడ్డుపై డబ్బులే డబ్బులు.. ఎగబడ్డ జనం
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:44 PM
Money On Road: కొంతదూరం పోయిన తర్వాత డబ్బుల బ్యాగు ఉన్న ఓ కారును రోడ్డుపై ఉంచి, నిప్పంటించారు. జనం మంచి వాటికోసం పోటీపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సినిమాలు చూసి దొంగలు స్పూర్తి పొందుతున్నారో లేక.. దొంగలనుంచి సినిమా వాళ్లు స్పూర్తి పొందుతున్నారో తెలీదు కానీ. కొంతమంది దొంగలు పట్టపగలే బరి తెగించేశారు. హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా డబ్బుల ట్రక్కును దోచేశారు. పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకెళ్లారు. అది కూడా ఎయిర్‌పోర్టులోకి చొచ్చుకెళ్లి మరీ దొంగతనం చేశారు. కొంతదూరం పోయిన తర్వాత డబ్బుల బ్యాగు ఉన్న ఓ కారును రోడ్డుపై ఉంచి, నిప్పంటించారు. ఆ డబ్బుల కోసం జనం ఎగబడ్డారు. ఈ సంఘటన కొలంబియాలోని రియోహాచా పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం రియోహాచా సిటీలోని ఆల్మిరాంటే పడిలా ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు ఓ ట్రక్కు డబ్బుల కట్టలతో ఉంది.
ఆ ట్రక్కులో డబ్బు ఉందని ఎలా తెలిసిందో కానీ, 12 మంది దుండగులు రెండు కార్లలో ఎయిర్ పోర్టులోకి దూసుకెళ్లారు. పెన్సింగ్ మొత్తం పాడు చేసి వారు లోపలికి వెళ్లారు. వారి దగ్గర మారణాయుధాలు కూడా ఉన్నాయి. ట్రక్కులోకి చొరబడి లోపల ఉన్న డబ్బుల్ని దోచేశారు. వారిని అడ్డుకోవాలని చూసిన ఎయిర్ పోర్టు సిబ్బందిని తుపాకులతో భయపెట్టారు. దాదాపు 24 బ్యాగుల నిండా డబ్బుల్ని నింపుకుని అక్కడినుంచి బయటకు వచ్చేశారు. ఓ ఊరి దగ్గర రెండు కార్లలోని ఓ కారును ఆపారు. డబ్బున్న ఓ బ్యాగును ఉంచి ఆ కారుకు నిప్పంటించారు. తర్వాత ఒకే కారులో అందరూ వెళ్లిపోయారు. కారు మంటల్లో కాలుతుండటం చూసి జనం అక్కడికి వచ్చారు. అందులో డబ్బు ఉందని తెలిసి ఎగబడ్డారు.
ఈ నేపథ్యంలోనే కట్టల కట్టల డబ్బులు రోడ్డుపై పడిపోయాయి. వాటిలో చాలా వరకు కాలిపోయాయి. జనం మంచి వాటికోసం పోటీపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి నాలుగు డబ్బుల బ్యాగులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, దొంగలు దోచుకెళ్లిపోయిన డబ్బు విలువ ఎంతో ఇప్పటికీ తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి
Gold Rates Today: ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి పసడి ధరలు..ఏ నగరాల్లో ఎంత ఉన్నాయంటే..
Inter 2025 Results: శనివారం ఇంటర్ ఫలితాలు