Air Force: మరో 114 రాఫెల్ విమానాలు!
ABN , Publish Date - Apr 12 , 2025 | 05:02 AM
వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు 114 రాఫెల్ ‘బహుళ ప్రయోజనకర యుద్ధవిమానాలను’ (ఎంఆర్‌ఎఫ్‌ఏ) ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ఫ్రాన్స్ నుంచి కొనుగోలుకు కేంద్రం నిర్ణయం
18 ఆ దేశంలోనే తయారీ.. మిగిలిన 96 భారత్‌లో
స్థానిక కంపెనీలకు భాగస్వామ్యం
ఇప్పటికే వాయుసేన వద్ద 36 రాఫెల్ విమానాలు
నౌకాదళం కోసం మరో 26 కొత్త విమానాల్లో అమెరికా
ఎఫ్-35లు ఉంటాయంటూ గతంలో ఊహాగానాలు
లండన్, ఏప్రిల్ 11: వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు 114 రాఫెల్ ‘బహుళ ప్రయోజనకర యుద్ధవిమానాలను’ (ఎంఆర్‌ఎఫ్‌ఏ) ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. భారత్-ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం ద్వారా వీటిని సమకూర్చుకునే విధంగా కసరత్తు నడుస్తోంది. ఈ వివరాలను రక్షణశాఖకు చెందిన వర్గాలు వెల్లడించాయి. ఒప్పందంలో భాగంగా.. దాదాపు 18 విమానాలను ఫ్రాన్స్‌లోనే తయారుచేసి భారత్‌కు అందజేస్తారు. మిగిలిన 96 విమానాలను.. భారత్‌కు విడిభాగాలను తరలించి అక్కడే వాటిని అనుసంధానిస్తారు. దీనికోసం ఫ్రాన్స్‌కు చెందిన విమానాల తయారీ కంపెనీ దసో ఏవియేషన్, రక్షణరంగంలో అనుభవం ఉన్న భారతీయ కంపెనీతో కలిసి భారత్‌లో ఓ కేంద్రాన్ని నెలకొల్పుతుంది. విమాన విడిభాగాలు, ఇతర కీలకమైన యంత్రసామగ్రి తయారీ ప్రక్రియలో స్థానిక కంపెనీలకు కూడా భాగస్వామ్యం కల్పించనున్నట్లు సమాచారం. కనీసం 100 విమానాలు కొనుగోలు చేస్తేనే భారత్‌లో తయారీకేంద్రాన్ని నెలకొల్పుతామని దసో ఏవియేషన్ షరతు విధించింది.
ఇప్పటికే 36 రాఫెల్ యుద్ధవిమానాలను దసో నుంచి కొనుగోలు చేయగా.. నౌకాదళం కోసం రూ.68,236 కోట్ల వ్యయంతో 26 మెరైన్ రాఫెల్ ఫైటర్ జెట్‌ల కొనుగోలుకు ఇటీవల ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఫ్రాన్స్ రక్షణమంత్రి త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా కొనుగోలు ఒప్పందంపై సంతకాలు జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటికి అదనంగా మరో 114 విమానాల కొనుగోలుకు తాజాగా కసరత్తు నడుస్తోంది. వీటి కోసం టెండర్ల దాఖలుకు ఆహ్వానం పలుకగా అమెరికా, యూరప్, రష్యా దేశాలకు చెందిన పలు కంపెనీలు పోటీపడ్డాయి. వీటిలో దసో రాఫెల్ ఎంపికైంది. కాగా, భారత్‌కు ఎఫ్35 విమానాలను విక్రయిస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే అది సాధ్యమయ్యే పని కాదని పేర్కొంటూ ‘ఆంధ్రజ్యోతి’ అప్పట్లో ఒక విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది. తాజా పరిణామాలు దీనినే రుజువు చేయడం విశేషం.