JD Vance Trophy Mishap: పైకెత్తుతుండగా విరిగిన ఫుట్‌బాల్ ట్రోఫీ.. కావాలనే అలా చేశానన్న జేడీ వ్యాన్స్
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:54 PM
శ్వేత సౌధంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఓ ట్రోఫీని పైకెత్తుతుండగా పొరపాటున అది రెండుగా విరిగిపోయింది. దీనికి ఫన్నీగా స్పందించిన వాన్స్ ఇతర టీమ్‌కు అది దక్కకూడదనే విరగ్గొట్టానని కామెంట్ చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఫుట్‌బాల్ ట్రోఫీని పొరపాటున జారవిడిచిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇలా చేశారేంటని అడిగితే ఆయన ఇచ్చిన ఫన్నీ జవాబు మరింతమందిని ఆకట్టుకుంది. ఇటీవల ఓహాయో రాష్ట్ర ఫుట్‌బాల్ టీమ్ శ్వేత సౌధాన్ని సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జనవరిలో జరిగిన 2025 కాలేజ్ ఫుట్‌బాల్ ప్లేఆఫ్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో ఒహాయో స్టేట్ బకీస్ విజేతగా నిలిచింది. 34-23 తేడాతో నోట్రె డేమ్ ఫైటింగ్ ఐరిష్‌పై విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జట్టు సభ్యులతో పాటు కోచ్ రయాన్ డే శ్వేతసౌధానికి వచ్చారు. అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ టీమ్ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్ ట్రోఫీని గాల్లోకి ఎత్తి గర్వంగా ప్రదర్శించేందుకు ప్రయత్నించారు.
ఆ సమయంలో పొరపాటున ట్రోఫీ రెండుగా విరిగిపోయింది. వ్యాన్స్ ట్రోఫీ కింద భాగాన్ని పట్టుకుని పైకెత్తుతుండగా ఆయనకు సహాయంగా మరో వ్యక్తి ట్రోఫీ పైభాగాన్ని పట్టుకున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ట్రోఫీ రెండుగా విడిపోయింది. కింద భాగం నేలమీద పడిపోయింది. దాన్ని ఆపేందుకు జేడీ వ్యాన్స్ విశ్వప్రయత్నమే చేసి విఫలమయ్యారు. దీంతో, చుట్టుపక్కల ఉన్న వారంతా ఒకింత షాకయ్యారు. ఈ సందర్భంగా మ్యూజిక్ ప్లే చేస్తున్న బ్యాండ్ కూడా కాస్త తత్తరపాటుకు గురైంది. ఆ తరువాత ట్రోఫీ పైభాగాన్ని మాత్రమే జేడీ వ్యాన్స్ ఎత్తిపట్టుకుని ప్రదర్శించారు.
ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫొటోలు నెట్టింట పెద్ద సునామీనే సృష్టించాయి. ఇలా జరిగిందేంటో అని కొందరు ఆశ్చర్యపోతే మరికొందరు మాత్రం ఫుల్లుగా నవ్వుకున్నారు. జేడీనే ట్రోఫీని విరగొట్టారంటూ మరికొందరు సెటైర్లు పేల్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియోకు ఏకంగా 1.7 మిలియన్‌ల వరకూ వ్యూస్ వచ్చాయి. మరోవైపు, జేడీ కూడా అదేస్థాయిలో రిప్లై ఇచ్చారు. ఈ ట్రోఫీని మరో టీమ్ దక్కించుకోకూడదనే ఇలా చేశా’’ అటూ వాతావరణాన్ని తేలిక పరిచే ప్రయత్నం చేశారు. కాగా, ఎన్నో అవాంతరాలు ఎదుర్కున్నా కూడా పట్టుదలతో ఛాంపియన్ షిప్ సాధించారని ఓహాయో రాష్ట్ర జట్టుపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు.
ఇవి కూడా చదవండి:
తెలంగాణలో పుట్టిన నీలి వజ్రం.. త్వరలో వేలం.. ధర ఎంతో తెలిస్తే..
అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..
సైబర్ నేరగాళ్లను ఎలా బురిడీ కొట్టించాలో ఈ బాలికను చూసి నేర్చుకోవాలి
Read Latest and International News