Tokyo: కనండి బాబు!
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:28 AM
కొత్త సంవత్సరం తొలిరోజున జపాన్ రాజధాని టోక్యో నగరం వింత నిర్ణయం తీసుకుంది. పడిపోతున్న జననాల రేటును అరికట్టేందుకు వారంలో నాలుగు రోజులనే ప్రభుత్వ ఉద్యోగులకు పని దినాలుగా ప్రకటించింది.
జననాల రేటు పెంచుకునేందుకు టోక్యో తిప్పలు
టోక్యో, జనవరి 1: కొత్త సంవత్సరం తొలిరోజున జపాన్ రాజధాని టోక్యో నగరం వింత నిర్ణయం తీసుకుంది. పడిపోతున్న జననాల రేటును అరికట్టేందుకు వారంలో నాలుగు రోజులనే ప్రభుత్వ ఉద్యోగులకు పని దినాలుగా ప్రకటించింది. అధిక పని ఒత్తిడి కారణంగా దంపతులకు ఏకాంత సమయాలు తగ్గిపోయాయని టోక్యో ప్రభుత్వం గుర్తించింది. దీంతో వృత్తికి, కుటుంబానికి మధ్య వారు నలిగిపోతున్నారని తెలుసుకుంది. చివరకు.. వృత్తికే ప్రాధాన్యం ఇచ్చి సంతానం ఆలోచనను ఎప్పటికప్పుడు వాయిదా వేసేస్తున్నారని గుర్తించింది.
ఈ నేపథ్యంలో దంపతులు విరివిగా కలుసుకునేందుకు, పిల్లల గురించి ఆలోచించుకునేందుకు వీలుగా సెలవు దినాలను పెంచాలని నిర్ణయించామని టోక్యో మెట్రోపాలిటన్ అసెంబ్లీలో గవర్నర్ యురికో కొయికే ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. అలాగే.. చిన్న పిల్లలు ఉన్న దంపతులు తమ జీతంలో కొంత వదులుకునే ప్రాతిపదికన తోటి ఉద్యోగులతో అవగాహనకు వచ్చి.. కాస్త ముందుగానే ఆఫీసు నుంచి బయటపడే వీలు కూడా కల్పిస్తామని కొయికే తెలిపారు. ‘‘జపాన్ అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉంది. మన ప్రజల జీవనానికి, బతుకుతెరువుకు, ఆర్థిక జీవితానికి భరోసాని ఇచ్చే చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని కొయికే తెలిపారు.