Tariffs Tense: ఆటో సుంకాల తాత్కాలిక నిలిపివేత
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:36 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆటో పరిశ్రమపై విధించిన సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు సంకేతాలిచ్చారు, మరోవైపు చైనా అరుదైన లోహాల ఎగుమతులను నిలిపివేయడంతో వాణిజ్య యుద్ధం మళ్లీ ముదిరింది

సంకేతాలిచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
తమ కార్ల కంపెనీలకు ఊరటనిచ్చేందుకే..
సుంకాల నుంచి ఎవరూ తప్పించుకోలేరు
చైనా నుంచి వచ్చే ఎలకా్ట్రనిక్ ఉత్పత్తులు, ఫోన్లపై 20% సుంకాలు కొనసాగుతాయ్
అమెరికాకు చైనా భారీ ఝలక్
అరుదైన లోహాల ఎగుమతులు నిలిపివేత
వాషింగ్టన్, ఏప్రిల్ 14: తాను విధించిన ప్రతీకార సుంకాల నుంచి ఆటోమొబైల్ రంగాన్ని తాత్కాలికంగా మినహాయించే ఆలోచనలో ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కార్ల తయారీ కంపెనీలు తమ సప్లై చైన్లను సరిచేసుకోవడానికి కావలసిన సమయం ఇచ్చేందుకే ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ‘‘కెనడా, మెక్సికో, ఇతర దేశాల నుంచి తమ ఉత్పత్తిని (అమెరికాకు) తరలించడానికి వారికి కొంత సమయం కావాలి. వారు వాటిని ఇక్కడే తయారుచేయబోతున్నారు’’ అని ట్రంప్ సోమవారం వైట్‌హౌస్ లో మీడియా సమావేశంలో చెప్పారు. అమెరికాకు దిగుమతి చేసుకునే విదేశీ కార్లు, ఆటో విడిభాగాలపై 25 శాతం సుంకం విధిస్తున్నట్టు ట్రంప్ మార్చి 27న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆరోజు ఆయన.. దాన్ని శాశ్వత సుంకంగా పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు వాటి విషయంలో పునరాలోచిస్తుండడం గమనార్హం. కాగా.. ప్రతీకార సుంకాల విధింపు విషయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. మరీ ముఖ్యంగా చైనాను అస్సలు మినహాయించబోమని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు.
అమెరికాతో అసమతౌల్య వాణిజ్య బంధాలను నడిపే దేశాలు, ఆర్థికేతర అడ్డంకులు సృష్టించే దేశాలు ప్రతీకార సుంకాల బారి నుంచి తప్పించుకోలేవని తేల్చిచెప్పారు. ఒక్క చైనా మినహా మిగతా అన్ని దేశాలపైనా తాము విధించిన ప్రతీకార సుంకాల అమలును 90 రోజులపాటు నిలిపివేస్తున్నామని.. అప్పటిదాకా ఆయా దేశాల ఉత్పత్తులపై 10 శాతం సుంకాలే ఉంటాయని ట్రంప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనాపై సుంకాల విధింపు కొనసాగితే యాపిల్ ఫోన్ల ధరలు పెరిగిపోతాయని అమెరికా ప్రజలు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో.. ఆ 10 శాతం సుంకాల నుంచి కూడా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను మినహాయిస్తున్నట్టు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం కిందటి శుక్రవారం ఒక ప్రకటన చేసింది. ఈ ఉత్పత్తులు చైనా నుంచి వచ్చినా సరే, సుంకాల నుంచి మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే.. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలకు సంబంధించి కిందటి శుక్రవారం తాము ప్రకటించింది పూర్తి మినహాయింపు కాదని ట్రంప్ స్పష్టం చేశారు. 145 శాతం సుంకాలకు బదులుగా.. చైనాపై విధించిన 20% ఫెంటైనిల్ సుంకాలు అమలవుతాయని, ఆయా ఉత్పత్తులు ఇప్పుడు ప్రత్యేకసుంకాల జాబితాలోకి మాత్రమే మారాయని వివరణ ఇస్తూ తన సొంత సామాజిక మాధ్యమమైన ‘ట్రూత్ సోషల్’లో ఆయన ఒక పోస్టు పెట్టారు.
అమెరికాలో సెమీకండక్టర్ రంగం, ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్‌పై జాతీయస్థాయిలో దర్యాప్తు (నేషనల్ సెక్యూరిటీ ట్రేడ్ ఇన్వెస్టిగేషన్) ప్రారంభిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. యూఎస్ తన ఉత్పత్తులను తానే తయారుచేసుకోవాలని వ్యాఖ్యానించిన ఆయన.. ఇతర దేశాలకు.. ముఖ్యంగా వాణిజ్యపరంగా ప్రతికూలమైన చైనా వంటి దేశాలకు అమెరికా ఎప్పటికీ బందీగా ఉండబోదని తేల్చిచెప్పారు. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ కూడా ఈ అంశంపై మాట్లాడారు. చైనా నుంచి అమెరికాకు వచ్చే క్రిటికల్ టెక్నాలజీ ఉత్పత్తులపైన, సెమీకండక్టర్లపైన వచ్చే రెండు నెలల్లో మరిన్ని సుంకాలు విధించనున్నట్టు ఆయన వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 1-2 నెలల్లో ట్రంప్ కొత్త సుంకాలు విధిస్తారని ఆయన తెలిపారు.
ఇప్పుడేం చేద్దాం?
యూరోపియన్ యూనియన్‌పై విధించిన సుంకాలను ఎత్తేయాలంటే.. తమ వద్ద 350 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.30 లక్షల కోట్లు) ఇంధనం కొనుగోలు చేయాలంటూ ట్రంప్ ఏప్రిల్ 8న తేల్చిచెప్పడంతో ఈయూ సందిగ్ధంలో పడింది. ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను తగ్గించేసిన యూరప్ దేశాలు.. 2022-23 నుంచి అమెరికా ఇంధనంపై ఆధారపడ్డాయి. ఇప్పుడు ట్రంప్ దాన్ని వాణిజ్య బేరసారాలకు వాడుకునే ప్రయత్నం చేస్తుండడంతో ఆ దేశాలన్నీ మళ్లీ రష్యావైపు చూస్తున్నట్టు సమాచారం. ఉక్రెయిన్‌లో కొంతమేర శాంతి వాతావరణం నెలకొంటే తాము మళ్లీ రష్యా నుంచి ఏటా 60 నుంచి 70 బిలియన్ క్యూబిక్ మీటర్ల ఇంధనం కొనుగోలు చేయొచ్చని ఫ్రాన్స్‌కు చెందిన బహుళజాతి సంస్థ ‘ఇంజీ’ ఉపాధ్యక్షుడు డిడియెర్ హోలా అభిప్రాయపడ్డారు. యుద్ధానికి ముందు.. రష్యా నుంచి యూరప్ దేశాలు ఏటా 150 బిలియన్ క్యూబిక్ మీటర్ల ఇంధనాన్ని కొనుగోలు చేసేవి.
ఇవి కూడా చదవండి..