Share News

Donald Trump tariffs: టారిఫ్‌ల కల్లోలం

ABN , Publish Date - Apr 06 , 2025 | 03:07 AM

ట్రంప్ విధించిన దిగుమతి సుంకాల ప్రభావంతో అమెరికాలో ధరలు పెరిగిపోతున్నాయి, ప్రజలు అవసరమైన వస్తువులు ముందుగా కొనుగోలు చేస్తూ గ్రాసరీ స్టోర్లకు ఎగబడుతున్నారు. ఈ కాల్పనిక ధరల పెరుగుదలతో ప్రజలు అప్పుల్లో కూరుకుపోతుండగా, వారి జీవనశైలిలో మార్పులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Donald Trump tariffs:  టారిఫ్‌ల కల్లోలం

అమెరికాకే నష్టంగా మారిన ట్రంప్‌ సుంకాల నిర్ణయం

ఇలాంటి చర్యలే నేను తీసుకొని ఉంటే.. ఇప్పుడు మౌనంగా ఉన్నవారు అప్పుడెలా వ్యవహరించేవారో ఊహించడం కష్టం. కొత్త టారి్‌ఫలు అమెరికాకు మేలు చేస్తాయని నేను అనుకోవట్లేదు.

- బరాక్‌ ఒబామా

ఇతర దేశాల దిగుమతులపై అడ్డగోలు సుంకాల ఎఫెక్ట్‌

నిత్యావసర ధరలు పెరుగుతాయన్న ఆందోళనలో అమెరికన్లు

ఉన్నవీ, లేనివీ ఇప్పుడే కొనేందుకు ప్రయత్నాలు

స్టోర్ల ముందు బారులు.. సూపర్‌ మార్కెట్లలో సరుకులు ఖాళీ

వస్త్రాల నుంచి ఎలకా్ట్రనిక్‌ పరికరాల దాకా ఇదే పరిస్థితి

ధరలు పెంచిన వ్యాపారులు.. పాత స్టాకుకు కొత్త రేట్లు

ధరల భయంతో అవసరం లేనివి, తాహతుకు

మించినవి కొంటూ అప్పుల పాలవుతున్న అమెరికన్లు

అమెరికాలోని భారతీయులపైనా ధరాఘాతం ప్రభావం

విద్యార్థులపై ఖర్చుల వాత.. ఉద్యోగుల పొదుపులో కోత

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 5: ప్రపంచ దేశాల నుంచి చేసుకునే దిగుమతులపై ట్రంప్‌ విధిస్తున్న టారి్‌ఫలతో అమెరికాలో కల్లోలం మొదలైంది. విదేశాల ఉత్పత్తులపై గంపగుత్తగా సుంకాలు పెంచి ట్రంప్‌ వాటికి ముకుతాడు వేయడం ఏమోగానీ.. ఆ అడ్డగోలు సుంకాల ప్రభావం అమెరికాలో అప్పుడే కనిపిస్తోంది. ఆ దేశంలో వినియోగించే సరుకులు, వస్తువులలో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవే కావడంతో.. ధరలు పెరిగిపోతాయని స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ధరలు తక్కువగా ఉన్నప్పుడే అవసరమైనవన్నీ కొనిపెట్టేసుకోవాలన్న ఆలోచన పెరిగింది. దీనితో అమెరికాలోని సూపర్‌ మార్కెట్లు, గ్రాసరీ స్టోర్లకు జనం ఎగబడుతున్నారు. చాలా స్టోర్లలో సరుకుల ర్యాక్స్‌ ఖాళీగా కనిపిస్తున్నాయంటూ అక్కడి మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ట్రంప్‌ టారి్‌ఫల ప్రభావంతో అమెరికాలో ఇప్పటికే ధరాఘాతం మొదలైంది. చాలా వరకు సూపర్‌ మార్కెట్లు, గ్రోసరీల నిర్వాహకులు పనిలో పనిగా సరుకుల ధరలను పెంచేశారని అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. అధిక సుంకాలతో కూడిన సరుకులు ఇంకా రాకున్నా, ఇప్పటికే ఉన్న పాత స్టాకు ధరలను కూడా సుంకాలకు అనుగుణంగా పెంచేసినట్టు పేర్కొంటున్నాయి.


ఎందుకీ ధరల భయం.. ఎంత ప్రభావం?

అమెరికా పౌరులు వినియోగించే వాటిలో 90శాతం వరకు దిగుమతులపై ఆధారపడినవే ఉంటాయి. తయారీ రంగం మొత్తం చైనా, ఇతర దేశాలకు తరలిపోయింది. చివరికి టిష్యూ పేపర్లు కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. అందుకే ట్రంప్‌ టారి్‌ఫలతో అమెరికన్ల జీవన వ్యయంపై గట్టి ప్రభావం పడుతోంది. దిగుమతులపై ఆయా దేశాలను బట్టి 25 శాతం నుంచి 52 శాతం వరకు సుంకాలను ట్రంప్‌ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడం ఖాయం. ఇది సగటు అమెరికన్లతోపాటు అక్కడ నివసిస్తున్న విదేశీయులలోనూ కలకలం రేపుతోంది. ఉదాహరణకు సుమారు 500 డాలర్లతో నెల రోజులు గడిపేసేవారు... సుంకాలు అమల్లోకి వచ్చి ధరలు పెరిగితే, నెలకు 650 డాలర్ల నుంచి 700 డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా. అంటే నెలవారీ బడ్జెట్‌పై 30-40 శాతం వరకు అదనపు భారం పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

వాల్‌మార్ట్‌ ఒక్కటి చూసినా...

అమెరికన్‌ సమాజంలో సుంకాల దెబ్బ తీవ్రత అంచనా కోసం ఒక్క వాల్‌మార్ట్‌ స్టోర్లను పరిశీలిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. మనకు జిల్లాలు ఉన్నట్టుగా అక్కడ కౌంటీలు ఉంటాయి. ప్రతి కౌంటీలో ఓ భారీ వాల్‌మార్ట్‌ హైపర్‌ మార్కెట్‌ ఉంటుంది. చాలా మంది అందులోనే నిత్యావసరాలు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ స్టోర్లలో 90 శాతం వరకు దిగుమతి అయిన వస్తువులనే విక్రయిస్తుంటారని.. ఇప్పుడు టారి్‌ఫల ధరాఘాతంతో అందరిపైనా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

hl.gif

జీవన శైలిలోనే మార్పు తప్పదా?

అమెరికన్ల జీవన విధానం చాలా విభిన్నమని, పొదుపు చేయడాన్ని ప్రత్యేకంగా చూడని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేగాకుండా అక్కడ నెలవారీగా కాకుండా వారాంతపు వేతనాలు ఉంటాయని.. ఏవారం వేతనాలను ఆ వారం ఖర్చు పెట్టేసే తరహా జీవన శైలి ఉంటుందని వివరిస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా 30 శాతం వరకు వ్యయం పెరిగితే.. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చేయడం ద్వారా వారి జీవనశైలినే మార్చుకోవాల్సిన పరిస్థితి తప్పదని అంటున్నారు.

అప్పుల పాలవుతున్న అమెరికన్లు!

సుంకాల ధరాఘాతం నుంచి తప్పించుకునేందుకు ఎగబడి సరుకులు, వస్తువులు కొనుగోలు చేస్తున్న అమెరికన్లు.. ఇందుకోసం అప్పులు కూడా చేస్తున్నారని అక్కడి ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలలో వాహనాల విక్రయాలు ఏకంగా 11.2 శాతం పెరిగాయని, ఏప్రిల్‌ మొదటి వారంలోనూ భారీగా నమోదయ్యాయని చెబుతున్నారు. భవిష్యత్తులో తీర్చుకోవాలనుకున్న కోరికలను కూడా.. ధరలు అడ్డగోలుగా పెరుగుతాయన్న ఉద్దేశంతో ఇప్పుడే తీర్చేసుకుంటున్నారని... తాహతుకు మించి ఖర్చు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో వాహనాలు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలు, ల్యాప్‌టా్‌పలు, ఖరీదైన ఫోన్లు వంటివి కొంటున్నారని వివరిస్తున్నారు. సుంకాల ఆందోళనతో అనవసరమైన, తాహతుకు మించిన ఖర్చులు చేయవద్దని అమెరికన్లను హెచ్చరిస్తున్నారు.


(అమెరికాలోని డాలస్‌ నుంచి కృష్ణమోహన్‌ దాసరి ఇన్‌పుట్స్‌తో..)

అక్కడి భారతీయులపై మరింత భారం

ట్రంప్‌ సుంకాల ధరాఘాతం అక్కడ ఉద్యోగాలు చేస్తున్న, చదువుకుంటున్న భారతీయులపై గణనీయంగానే ప్రభావం చూపనుంది. ఇప్పటికే విదేశీ విద్యార్థులు తాత్కాలిక (పార్ట్‌టైమ్‌) ఉద్యోగాలు చేయకుండా ట్రంప్‌ ఆంక్షలు విధించడంతో... భారతీయ విద్యార్థులకు ఆ మాత్రం ఆదాయం లేకుండా పోయింది. ఇండియా నుంచి కుటుంబ సభ్యులు పంపే డబ్బే దిక్కవుతోంది. ఇప్పుడు అక్కడ ఖర్చులు పెరగడంతో... ఇక్కడి నుంచి మరింత ఎక్కువ సొమ్ము పంపక తప్పదు. ఇది తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. మరోవైపు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులపైనా ప్రభావం గణనీయంగానే ఉండనుంది. అక్కడ జీవన వ్యయం పెరగడంతో మనవాళ్ల పొదుపునకు కోత పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.


hlj.gif

ఏమేం కొనిపెట్టుకుంటున్నారు?

ట్రంప్‌ సుంకాల ప్రభావం దాదాపు అన్ని రకాల ఉత్పత్తులపై కనిపించనుంది. కానీ కొన్ని ఉత్పత్తులు చాలా వరకు విదేశాల నుంచే వస్తుండటంతో వాటి ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇందులో అమెరికన్లు ఏయే ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారన్నదానిపై అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. వాటి ప్రకారంం

విదేశాల నుంచి దిగుమతి అయ్యే గ్రోసరీ వస్తువులు, కాఫీ, చిరుతిళ్లు (స్నాక్స్‌) వంటివాటి ధరలు పెరిగే అవకాశం ఉండటంతో వీలైనంతగా కొని పెట్టుకుంటున్నారు.

అమెరికాకు చాలా వరకు ల్యాప్‌టా్‌పలు, స్మార్ట్‌ఫోన్లు, వాటి విడిభాగాలు చైనా, తైవాన్‌ల నుంచే వస్తాయి. ఇందులో తైవాన్‌పై 32శాతం, చైనాపై 52శాతం సుంకాలను ట్రంప్‌ ప్రకటించారు. దీనితో ల్యాప్‌టా్‌పలు, ఫోన్లు కొనాలని భావిస్తున్న వారంతా.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టుగా వాటికోసం బారులుతీరుతున్నారు.

అమెరికాలో తయారయ్యే ఎలకా్ట్రనిక్‌ పరికరాల్లో వాడే విడిభాగాలు చాలా వరకు చైనా, తైవాన్‌ దేశాల నుంచే దిగుమతి అవుతాయి. సుంకాలతో ధరలపై ప్రభావం పడి వాటి ధరలు పెరగడం ఖాయమనే ఉద్దేశంతో ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, మైక్రోవేవ్‌ ఓవెన్లు, కిచెన్‌ అప్లయెన్సెస్‌ వంటివి ఎక్కువగా కొంటున్నారు.

‘గ్యాప్‌, హెచ్‌ అండ్‌ ఎం‘ వంటి పెద్ద బ్రాండ్లు సహా అమెరికాలో వినియోగించే దుస్తులు, ఫుట్‌వేర్‌లో చాలా వరకు వియత్నాం(21ు పన్ను), భారత్‌, ఇండోనేషియా, బంగ్లాదేశ్‌ (37ు పన్ను) నుంచి రావాల్సిందే. దీనితో ధరలు పెరుగుతాయని జీన్స్‌, బూట్లు కొనడానికి అమెరికన్లు క్యూ కడుతున్నారు.

కొత్త కార్లు ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక రేబాన్‌ కళ్లజోళ్లు, సౌందర్య ఉత్పత్తులు, ఆస్పత్రుల్లో వాడే పరికరాలు, బెడ్లు, ట్రెడ్‌మిల్స్‌, మసాజ్‌ చైర్లు, ఇతర జిమ్‌ పరికరాలు, డైపర్లు, బొమ్మలు, స్ట్రాలర్లు తదితర ఉత్పత్తులకూ డిమాండ్‌ పెరిగింది.

అమెరికాలో వ్యవసాయం ఎక్కువే. కానీ అందుకు అవసరమైన పరికరాలు చైనా నుంచి, ట్రాక్టర్ల విడిభాగాలు జర్మనీ నుంచి, ఎరువులేమో కెనడా, రష్యాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. దీనితో స్థానికంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి.


ఇవి కూడా చదవండి..

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్

NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For National News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 03:07 AM