Share News

Delhi Results: ఢిల్లీ ఫలితాలపై ఆప్ లెక్కలివే..

ABN , Publish Date - Feb 06 , 2025 | 05:44 PM

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజుల్లో రానున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రకటించాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ లెక్కలేంటో చూద్దాం.

Delhi Results: ఢిల్లీ ఫలితాలపై ఆప్ లెక్కలివే..
Delhi Election

ఢిల్లీలో 70 శాసనసభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. ఫిబ్రవరి8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే పలు సంస్థలు ఢిల్లీ ఫలితాలపై తమ అంచనాలను ప్రకటించాయి. మెజార్టీ సంస్థలు ఢిల్లీ అసెంబ్లీలో మెజార్టీ మార్క్‌ను బీజేపీ చేరుకుంటుందని వెల్లడించాయి. రెండు నుంచి మూడు సర్వే సంస్థలు మాత్రం ఆప్ అధికారానికి అవసరమైన మోజార్టీ సీట్లు సాధిస్తుందని తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేదని, ఇండిపెండెంట్ల ప్రభావం కనిపించలేదని సర్వే సంస్థలు అంచనావేశాయి. పోటీ బీజేపీ, ఆప్ మధ్యనే కొనసాగిందని, అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే సంస్థలు తెలిపాయి. ఢిల్లీ ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపారనే విషయంలో స్పష్టత లేనప్పటికీ మహిళలు ఆప్ వైపు, యువత, మధ్యతరగతి ఉద్యోగులు బీజేపీకి ఓట్లు వేశారనే ప్రచారం జరుగుతోంది. ఉచిత హామీలను అన్ని పార్టీలు ఇవ్వడంతో హామీల ఆధారంగా ప్రజలు ఓట్లు వేయనట్లు తెలుస్తోంది. ఎవరు అధికారంలోకి వచ్చినా హామీలు అమలుచేస్తారనే ధీమా కొంతమంది ఓటర్లలో కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాల ఎగ్జిట్‌పోల్స్‌ను ఆప్ తోసిపుచ్చింది. ఇవి ఎగ్జాట్ పోల్స్ కాదని, అసలు పలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ అంతర్గత చర్చల్లో మాత్రం ఈసారి విజయం అంత ఈజీ కాదనే విషయాన్ని ఆప్ నేతలు అంగీకరించినట్లు సమాచారం. అసలు ఢిల్లీ ఫలితాలపై ఆప్ నేతల లెక్క ఏమిటో చూద్దాం.


భారీగా తగ్గనున్న సీట్లు..

గత రెండు పర్యాయాల్లో 60కి పైగా సీట్లు సాధించిన ఆప్‌కు ఈసారి భారీగా సీట్లు తగ్గుతాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైందని, ఆప్ అవినీతిపై బీజేపీ ప్రచారాన్ని కొందరు ప్రజలు విశ్వసించారనే విషయాన్ని ఆప్ నేతలు అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడం ఈజీ కాదని, వచ్చిన 35 నుంచి 40 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఆప్ నేతలు ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీవైపు మొగ్గుచూపారని, కాంగ్రెస్, బీజేపీకి ఆ ఓట్లు చీలి ఉంటే తమకు కలిసొచ్చేదని, కానీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు బీజేపీవైపు వెళ్లడం నష్టం కలిగించే అవకాశం ఉన్నట్లు ఆప్ నేతలు అంచనా వేస్తున్నారు.


తగ్గిన కేజ్రీవాల్ ఇమేజ్

గతంతో పోలిస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ ఇమేజ్ బాగా తగ్గిందనే చర్చ జరుగుతోంది. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొవడంతో పాటు, ఆప్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొందని, దీంతో గతంతో పోలిస్తే కేజ్రీవాల్ గ్రాఫ్ బాగా పడిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా అసలు ఫలితాలు ఎవరికి అనుకూలం.. ఎవరికి ప్రతికూలం తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Feb 06 , 2025 | 05:44 PM