Share News

AICC: టార్గెట్ గుజరాత్.. మనస్సులో మాట బయటపెట్టిన కాంగ్రెస్ సీనియర్లు

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:22 PM

AICC: గుజరాత్‌లో అధికార పీఠాన్ని హస్తం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తద్వారా ఢిల్లీ పీఠాన్ని అందుకోవాలని ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీంతో మోదీ పాలనకు చరమ గీతం పాడేందుకు భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకొనేందుకు ఆ పార్టీ వడి వడిగా అహ్మదాబాద్ వేదిక నుంచి శ్రీకారం చూడుతోంది.

AICC: టార్గెట్ గుజరాత్.. మనస్సులో మాట బయటపెట్టిన కాంగ్రెస్ సీనియర్లు
Jai Ram Ramesh

అహ్మదాబాద్, ఏప్రిల్ 09: ప్రధాని మోదీ పాలనతో దేశంలో ఏ వర్గం సంతోషంగా లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జై రాం రమేశ్ విమర్శించారు. గుజరాత్‌లోని ఆహ్మదాబాద్ వేదికగా రెండు రోజుల పాటు జరుగుతోన్న ఏఐసీసీ సమావేశాలు బుధవారంతో ముగిశాయి. ఈ సమావేశంలో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి జై రాం రమేశ్ మాట్లాడుతూ.. సమర్పణ్, సందర్ష్ నినాదంతో న్యాయ్ పథ్ పేరుతో ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు ఆయన వివరించారు.

న్యాయ పథం (న్యాయ్ పథ్) గా పోరాటం, గుజరాత్‌లో కాంగ్రెస్ ఎందుకు అనే రెండు అంశాలపై చర్చించి.. తీర్మానం చేశామన్నారు. ఇండియా కూటమి భవిష్యత్తులో ఎలా పోరాడాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. అలాగే దేశంలో రైతాంగం పలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుందని తెలిపారు. ఇక విద్య, వైద్య రంగాల్లో ఎన్నో సమస్యలున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.


ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో అభివృద్ధి శూన్యమని ఆయన పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో పొలిస్తే.. కేరళ, తమిళనాడు, కర్ణాటకలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి జై రాం రమేశ్ సోదాహరణగా వివరించారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా రెండు రోజులు పాటు ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశాలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 64 ఏళ్ల అనంతరం ఆ పార్టీ అహ్మదాబాద్ వేదికగా ఈ సభ నిర్వహించిందని ఈ సందర్భంగా ఆ పార్టీ అగ్రనేతలు స్పష్టం చేశారు. ఏప్రిల్ 8,9 తేదీల్లో ఈ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ఆ పార్టీ సీనియర్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీతోపాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశాలకు దాదాపు 1200 మందికి పైగా ఏఐసీసీ సభ్యులు హాజరయ్యారు.


ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు ఫుల్ పవర్స్ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికలో సైతం వారిదే కీలక భాద్యత తీసుకొనున్నారు. జిల్లా అధ్యక్షులకు ఫుల్ పవర్స్.. ఏఐసీసీ నిర్ణయమని ఈ సందర్భంగా మల్లిఖార్జున్ ఖర్గే స్పష్టం చేశారు.


ఇక గతేడాది జరిగిన మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. అయితే భవిష్యత్తులో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ.. ప్రజల్లోకి ఎలా చొచ్చుకెళ్లాలనే అంశంపై చర్చించారు. ఈ ఏడాది 2025 చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది అంటే 2026లో అసోం, తమిళనాడు, కేరళతోపాటు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఏడాది అంటే 2027లో పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2028లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.


ఇక 2029లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశా, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో బీజేపీని ఓటమి పాలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఆ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు రావడం కోసం ప్రయత్నాలు చేపట్టాలని ఈ సమావేశాల సాక్షిగా నిర్ణయం తీసుకున్నట్లు సుస్పష్టమవుతోంది. గుజరాత్ పీఠాన్ని కైవసం చేసుకోవడం ద్వారా.. ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకునేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని.. ఈ సమావేశంలో పార్టీ నేతల వ్యవహార శైలిని బట్టి అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Apr 09 , 2025 | 04:25 PM