BJP New President: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అతడే.. ఊహించని ట్విస్ట్‌తో రాజకీయ సంచలనం
ABN , Publish Date - Apr 05 , 2025 | 03:02 PM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనే చర్చకు కొద్దిరోజుల్లో తెరపడనుందా. దక్షిణ భారతం నుంచే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారా. దక్షిణ భారతదేశం నుంచి జాతీయ అధ్యక్షుడిని నియమించాలని బీజేపీ భావిస్తే ఆ ఎంపిక ఎవరు..

భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకోవడం ఎవరికి అంత ఈజీకాదు. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి తీసుకునే ప్రతి నిర్ణయం ఒక సంచలనమే. కేంద్ర మంత్రివర్గం ఎంపిక మొదలు రాష్ట్రపతి ఎంపిక వరకు ప్రతి విషయంలో ట్విస్ట్. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలోనూ బీజేపీ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షులు ఎవరనే చర్చ విస్తృతంగా సాగింది.
ఇటీవల వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఎస్పీ ఎంపీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బీజేపీ ఇంకా తమ అధ్యక్షుడిని ఎంపిక చేసుకోలేని స్థితిలో ఉందంటూ ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై అదే స్థాయిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటరిచ్చారు. ఇది పక్కనపెడితే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక నిజంగానే దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. జేపీ నడ్డా కేంద్రమంత్రి వర్గంలో ఉండటంతో తిరిగి ఆయనను అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు లేవు. అమిత్ షాను మళ్లీ ప్రెసిడెంట్ చేసే ఛాన్స్ కనిపించడంలేదు. రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీ పేర్లు వినిపిస్తున్నా వీరిద్దరూ ఇప్పటికే జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. శివరాజ్ సింగ్ చౌహన్ కేంద్రమంత్రి వర్గంలో ఉండటంతో ఆయనను అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు చాలా తక్కువ. ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాదిలో బలపడటమే లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటకలో బీజేపీకి ఢోకా లేదు. తెలంగాణలో బలంగా ఉన్నప్పటికీ అధికారంలోకి రావడం కష్టంగా మారింది. ఇక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో తన బలాన్ని పెంచుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. కేరళలో గతంతో పోలిస్తే బీజేపీ తన ఓట్ల శాతాన్ని పెంచుకుంది. తమిళనాడులో సైతం ఎవరూ ఊహించని రీతిలో 2024 లోకసభ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. నెక్ట్స్ టార్గెట్ తమిళనాడులో డీఎంకేను గద్దె దింపడమే. దీనికోసం భారీ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన వ్యక్తిని నియమిస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఎవరిని నేషనల్ ప్రెసిడెంట్ చేయబోతుందో తెలుసుకుందాం.
కొత్త అధ్యక్షుడి రేసులో
బీజేపీ తమిళనాడు రాష్ట్రశాఖ అధ్యక్షుడు కె అన్నామలై పేరు జాతీయ అధ్యక్షుడి రేసులో వినిపిస్తోంది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై తన ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు 2020లో బీజేపీలో చేరిన ఆయన పార్టీలో చాలా జూనియర్ అయినప్పటికీ అతడిలో నాయకత్వ లక్షణాలను గుర్తించిన కమలం పార్టీ 2021లో ఆయనను తమిళనాడు అధ్యక్షుడిగా నియమించింది. బీజేపీ అధిష్టానం నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించడమే కాకుండా, డీఎంకే అవినీతిపై పోరాడుతూ వచ్చాడు. రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచారు. దీనికి నిదర్శనమే 2 నుంచి 3గా ఉన్న బీజేపీ ఓట్ల శాతాన్ని 2024 లోక్‌సభ ఎన్నికల్లో 11 శాతానికి పెంచారు. సీట్లు గెలవకపోయినా బీజేపీ భారీగా ఓట్లు సాధించింది. దీనికి కారణం అన్నామలై. ఉన్నత విద్యావంతుడు కావడంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉండటంతో ఆయన పేరు జాతీయ అధ్యక్షుడి రేసులో వినిపించడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
కారణాలు ఇవే
తాజాగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి రేసులో తాను లేనని ప్రకటించడంతో అన్నామలై బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో ఉన్నారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు అన్నామలై వంటి వ్యక్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పిస్తున్నారంటే ఆయనకు అంతకటే పెద్ద పదవి వస్తుందనే చర్చ జరుగుతోంది. తమిళనాడులో బీజేపీ ఎదుగదలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తు్న్నారని దీనికోసం ఎన్నో కుట్రలు పన్నుతున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో పార్టీ బలాన్ని పెంచుకోవడంతో పాటు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం ద్వారా డీఎంకేను ఢీకొట్టాలనే ఎత్తుగడతో బీజేపీ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అన్నామలైను జాతీయ అధ్యక్షడిగా చేస్తే తమిళనాడుకు బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతాన్ని అక్కడి ఓటర్లుకు ఇవ్వడమే బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ దశలో అన్నామలై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశాలను కొట్టి పారేయలేము. అన్నామలైను బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్‌గా నియమిస్తే అది దేశ రాజకీయాల్లో సంచలనమే అవుతుంది.
ఇవి కూడా చదవండి
Axis Power Deal: జగన్ బాటలోనే చంద్రబాబు
YS Sharmila vs Jagan: మోసగాడు ఈ మేనమామ
Kasireddy Rajasekhar Reddy: కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టు షాక్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here