Delhi Elections 2025: ఫలించని జైలు సెంటిమెంట్.. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ..
ABN , Publish Date - Feb 08 , 2025 | 06:11 PM
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు "జైలు సీఎం" సెంటిమెంట్ ఏమాత్రం కలిసిరాలేదని చెప్పొచ్చు. జైలుకు వెళ్లొచ్చిన రాజకీయ నేతలు ముఖ్యమంత్రులు అవుతున్న ట్రెండ్ దేశంలో కొన్నేళ్లుగా కొనసాగుతోంది.

ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. మెుత్తం 70 స్థానాల్లో 48 స్థానాలను కైవసం చేసుకుని దేశ రాజధానిలో కాషాయం జెండా ఎగరవేసింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమై ఓటమి పాలయ్యింది. ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా అనేక మంది ఘోర పరాభవాన్ని రుచి చూశారు. రెండు సార్లు వరసగా గెలిచిన ఆప్ ఈసారి ప్రధాని మోదీ దెబ్బకు చతికలపడిపోయింది. మరోవైపు 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో బీజేపీ అధికారం చేపట్టనుంది. దీంతో ఎన్డీయే కూటమి శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.
వైఎస్ జగన్..
అయితే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు "జైలు సీఎం" సెంటిమెంట్ ఏమాత్రం కలిసిరాలేదని చెప్పొచ్చు. జైలుకు వెళ్లొచ్చిన రాజకీయ నేతలు ముఖ్యమంత్రులు అవుతున్న ట్రెండ్ దేశంలో కొన్నేళ్లుగా కొనసాగుతోంది. 2019 సంవత్సరానికి ముందు అవినీతి కేసుల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారు. దాదాపు 10 నెలలపాటు జైలులో ఉన్న జగన్.. అనంతరం 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఏకంగా 151 సీట్లు కైవసం చేసుకున్నారు.
నారా చంద్రబాబు నాయుడు..
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం దాదాపు రెండు నెలలపాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జైలులో ఉన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించిన అప్పటి వైసీపీ సర్కార్ ఆయన్ను జైలుకు పంపించింది. అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబు 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తుపెట్టుకుని ఏకంగా 164 సీట్లు కైవలం చేసుకుని వైసీపీని చిత్తు చేశారు.
రేవంత్ రెడ్డి..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. 2015 సంవత్సరంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీపెన్ సన్‌కు రేవంత్ రెడ్డి డబ్బులు ఎర చూశారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
హేమంత్ సోరెన్..
అలాగే జార్ఖండ్ ముక్తీ మోర్చా-జేఎంఎం హేమంత్ సోరెన్ సైతం 2024లో భూ కుంభకోణంలో అరెస్టయ్యారు. ఆయన కూడా దాదాపు ఐదు నెలలపాటు జైలు జీవితం అనుభవించారు. ఆ తర్వాత గతేడాది జూన్‌లో జైలు నుంచి విడుదల అయ్యారు. అనంతరం జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బర్హైత్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 39,791 ఓట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి పీఠాన్ని సోరెన్ అధిరోహించారు.
కేజ్రీవాల్..
కానీ, జైలు సీఎం ట్రెండ్‌కు ఆప్ అధినేత కేజ్రీవాల్ బ్రేక్ వేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో 21 మార్చి 2024న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. దాదాపు 6 నెలలపాటు ఆయన తీహార్‌లో జైలులో ఉన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో విడుదల అయ్యారు. ఆ తర్వాత ఆప్ నేత అతిషిని ఆయన ఢిల్లీకి సీఎంని చేశారు. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఘోర ఓటమిని చవిచూశారు. దీంతో జైలు సీఎం ట్రెండ్‌కు బ్రేక్ వేసిన నేతగా కేజ్రీవాల్ నిలిచారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అదే జరిగింది: సీఎం చంద్రబాబు..
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..