Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..
ABN , Publish Date - Feb 08 , 2025 | 04:47 PM
నెగ్గేదేలే.. అంటూ కాంగ్రెస్ మరోసారి ఢిల్లీలో చేతులెత్తేసింది. ఒకప్పుడు ఢిల్లీ కోటను అప్రతిహతంగా ఏలిన హస్తం పార్టీ వరుసగా మూడో సారి కూడా సున్నా సీట్లకే పరిమితమై రిక్త హస్తాలతో మిగిలింది. చివరకు ఢిల్లీలో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయింది.

నెగ్గేదేలే.. అంటూ కాంగ్రెస్ (Congress) మరోసారి ఢిల్లీ (Delhi)లో చేతులెత్తేసింది. ఒకప్పుడు ఢిల్లీ కోటను అప్రతిహతంగా ఏలిన హస్తం పార్టీ వరుసగా మూడో సారి కూడా సున్నా సీట్లకే పరిమితమై రిక్త హస్తాలతో మిగిలింది. చివరకు ఢిల్లీలో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయింది. పంతాలకు పోయి తాను అవమానం పాలవడమే కాకుండా ఆప్ పార్టీకి కూడా కష్టాలు తెచ్చిపెట్టింది. 2008లో చివరిసారిగా ఢిల్లీలో అధికారం సాధించిన కాంగ్రెస్ ఆ తర్వాత క్రమంగా బలహీన పడింది (Delhi Election Result).
ఢిల్లీ పీఠాన్ని 1998లో గెలుచుకున్న కాంగ్రెస్ వరుస విజయాలు సాధించి తనకు ఎదురు లేదనిపించుకుంది. షీలా దీక్షిత్ నాయకత్వంలో 1998, 2003, 2008 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించింది. అయితే ఆ తర్వాత ఢిల్లీలో పరిస్థితి మారింది. 2012లో దేశ రాజధానిలో జరిగిన నిర్భయ ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఆ తర్వాత అన్నా హజారే, అరవింద్ కేజ్రివాల్ అవినీతిపై చేసిన వ్యతిరేక పోరాటం ఢిల్లీలోనే కాదు, దేశం మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించింది. అప్పట్నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ కోలుకోలేకపోయింది. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టింది.
2013 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చాలా వరకు ఆప్ వైపు మొగ్గింది. దీంతో కాంగ్రెస్ కేవలం 8 సీట్లకే పరిమితమైంది. ఇక, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ ఎనిమిది స్థానాలను కూడా కోల్పోయి చేతులెత్తేసింది. అప్పట్నుంచి వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా సాధించలేక చతికిలపడింది. బీజేపీ విధానాలు, సిద్ధాంతాలు నచ్చని వారు ఇంతకు ముందు కాంగ్రెస్ వైపు ఉండేవారు. ఆప్ వచ్చిన తర్వాత ఢిల్లీ, సరిహద్దు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మసకబారడం మొదలైంది. కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఆప్ వైపు మళ్లిపోయింది. అప్పట్నుంచి కాంగ్రెస్‌కు ఢిల్లీలో సరైన నాయకుడే లేకుండాపోయాడు.
వ్యూహాత్మకంగా కాంగ్రెస్ చేసిన తప్పులు ఆ పార్టీతో పాటు ఆప్‌ను కూడా ఢిల్లీ ఎన్నికల్లో దెబ్బకొట్టాయి. ఇండియా కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్యన కొరవడిన సమన్వయం బీజేపీకి కలిసి వచ్చింది. ఇన్నాళ్లూ ఆప్‌తో కలిసి బీజేపీని తిట్టిన కాంగ్రెస్, ఢిల్లీ ఎన్నికలకు వచ్చే సరికి ఆప్‌ను కూడా తీవ్రంగా విమర్శించింది. ఆ ద్వంద్వ నీతిని చాలా మంది హర్షించలేదు. అలాగే ఎన్నికల్లో నడిపించే నాయకుడు కూడా లేకుండా పోవడంతో కాంగ్రెస్ నామమాత్రపు పార్టీగా మిగిలిపోయింది.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..