Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:32 PM
ఢిల్లీలోని ద్వారకా ప్రైవేటు స్కూలు యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ''లైబర్రీ అరెస్టు'' పేరుతో తమ పిల్లలను 25 రోజుల పాటు లైబ్రరీలోనే నిర్బంధించినట్టు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.

న్యూఢిల్లీ: రాజధాని నగరంలో ప్రైవేటు స్కూళ్ల ఇష్టానుసారంగా ఫీజులు పెంచేస్తుండటం, విద్యార్థులు, పిల్లలను వేధిస్తుండటంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) సీరియస్ అయ్యారు. అసాధారణ రీతీలో ఫీజులు పెంచినా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వేధించినట్టు తెలిసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు అన్ని స్కూళ్ల యాజమాన్యాలకు నోటీసులు పంపుతున్నట్టు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వస్తున్న పలు ఫిర్యాదులపై ముఖ్యమంత్రి స్పందిస్తూ తాజా హెచ్చరికలు చేశారు.
MK Stalin: స్టాలిన్ దూకుడు.. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై సూచనలకు కమిటీ
''విద్యార్థుల తల్లిదండ్రులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు స్వయంగా ఆ విషయం నన్ను కలిసి చెప్పారు. సమస్యలు నిజమే. విద్యార్థులను కానీ వారి తల్లిదండ్రులను వేధించే హక్కు ఏ స్కూలుకు లేదు. పిల్లల్ని బెదిరించడం, ఇష్టానుసారం ఫీజులు పెంచడం కుదరదు. ఫీజుల పెంపుదలకు సంబంధించి నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా పాటించాలి. ఇందుకు వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించినా విడిచిపెట్టేది లేదు. ఇందుకు సంబంధించి అన్ని స్కూళ్లకు ఈరోజు నోటీసులు పంపుతున్నాం" అని మీడియాతో మాట్లాడుతూ రేఖాగుప్తా తెలిపారు.
ఢిల్లీలోని ద్వారకా ప్రైవేటు స్కూలు యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ''లైబర్రీ అరెస్టు'' పేరుతో తమ పిల్లలను 25 రోజుల పాటు లైబ్రరీలోనే నిర్బంధించినట్టు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాల వేళల్లో విద్యార్థులను గత మార్చి 20 నుంచి లైబ్రరీలోనే నిర్బంధించినట్టు ఒక విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదులపై ప్రభుత్వం తక్షణ తనిఖీలకు ఆదేశించినట్టు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ తెలిపారు. డిప్యూటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్, అకౌంట్స్ డైరెక్టర్‌తో కూడిన ఒక కమిటీ దీనిపై విచారణ జరుపుతోందన్నారు. ఫీజుల పెంపుపై ఫిర్యాదులకు ఒక ఈమెయిల్ ఐడీని కూడా లాంచ్ చేసినట్టు చెప్పారు.
ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో బీజేపీ మిలాఖత్: ఆప్
కాగా, ప్రైవేటు స్కూళ్లు విపరీతంగా ఫీజులు పెంచడంపై బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుపట్టింది. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం, బీజేపీ మధ్య సంబంధాలున్నాయని ఆరోపించింది. ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలోని పలు ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు గణనీయంగా ఫీజులు పెంచేశాయని, దీంతో తల్లిండ్రులు నిరసనలు దిగుతున్నారని ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. బీజేపీ టీచర్స్ సెల్ ఆఫీస్ బేరర్ ఒకరు అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజిమెంట్ కమిటీ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో అతను బీజేపీలో చురుకుగా పనిచేశారని చెప్పారు. ముఖ్యమంత్రికి ఈ విషయం తెలియకుంటే తక్షణం పెరిగిన ఫీజులను రోల్‌బ్యాక్ చేయాలని, అలా చేయడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రభుత్వం ఫీజుల పెంపునకు ప్రభుత్వం సహకరిస్తోందని అర్థం చేసుకోవచ్చన్నారు.
కాగా, ఆప్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడంతోనే తప్పుడు ప్రచారం చేస్తోందని ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ తెలిపారు. విద్య, విద్యుత్, నీళ్లు, ఆరోగ్యరంగాల్లో అవినీతి కారణంగా అధికారం కోల్పోయిన ఆప్ నేతలు బీజేపీ పాలన ఏమీ బాగోలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలోని 1,665 ప్రైవేటు స్కూళ్లలో ఆడిట్ జరపాలని ఎస్‌డీఎంను మంత్రి ఆశిష్ సూద్ ఆదేశించినట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి..