Share News

Mamata Banerjee: డూప్లికేట్‌ ఎపిక్‌ నంబర్లు ఉంటే.. నకిలీ ఓటర్లు ఉన్నట్లు కాదు!

ABN , Publish Date - Mar 03 , 2025 | 02:10 AM

ఓటరు కార్డు(ఎపిక్‌) నంబర్లు ఒకేలా ఉన్నంత మాత్రాన నకిలీ లేదా డూప్లికేట్‌ ఓటర్లు ఉన్నట్లు కాదని ఆదివారం స్పష్టం చేసింది. మమత పేరు ప్రస్తావించకుండా.. రెండు రాష్ట్రాల ఓటర్లకు ఒకేరకమైన ఎపిక్‌ నంబర్లు ఉన్నాయంటూ మీడియాలో వచ్చిన కథనాలు, సోషల్‌ మీడియా పోస్టులను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. ‘

Mamata Banerjee: డూప్లికేట్‌ ఎపిక్‌ నంబర్లు ఉంటే.. నకిలీ ఓటర్లు ఉన్నట్లు కాదు!

వేర్వేరు రాష్ట్రాల్లో ఒకే విధమైన సంఖ్యలు కొన్ని ఉండొచ్చు.. మమత ఆరోపణలపై ఈసీ

ఇకపై యూనిక్‌ నంబర్లు ఇస్తామని వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): బెంగాల్‌ ఓటర్ల జాబితాల్లో హరియాణా, గుజరాత్‌లకు చెందిన నకిలీ ఓటర్లను బీజేపీ చేర్చుతోందని.. ఇందుకు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సహకరిస్తోందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై ఈసీ స్పందించింది. ఓటరు కార్డు(ఎపిక్‌) నంబర్లు ఒకేలా ఉన్నంత మాత్రాన నకిలీ లేదా డూప్లికేట్‌ ఓటర్లు ఉన్నట్లు కాదని ఆదివారం స్పష్టం చేసింది. మమత పేరు ప్రస్తావించకుండా.. రెండు రాష్ట్రాల ఓటర్లకు ఒకేరకమైన ఎపిక్‌ నంబర్లు ఉన్నాయంటూ మీడియాలో వచ్చిన కథనాలు, సోషల్‌ మీడియా పోస్టులను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. ‘కొందరు ఓటర్ల ఎపిక్‌ నంబర్లు ఒకే విధంగా ఉన్నా.. రాష్ట్రాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, పోలింగ్‌ కేంద్రాలు వేర్వేరుగా ఉంటాయి. ఎపిక్‌ నంబర్‌తో సంబంధం లేకుండా.. తమ సొంత రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలోని నియోజకవర్గంలో, పోలింగ్‌ కేంద్రంలో ఓట్లు నమోదుచేసుకున్న ఏ ఓటరైనా ఓటేయవచ్చు’ అని తేల్చిచెప్పింది. ఈసీకి సంబంధించిన ఎలక్టొరల్‌ రోల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎరోనెట్‌) ప్లాట్‌ఫాంకు ఓటర్ల సమాచారం పంపేముందు రెండు విభిన్న రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ఒకేవిధమైన అల్ఫాన్యూమరిక్‌ సిరీ్‌సను ఉపయోగించడం వల్ల తాజా సమస్య తలెత్తినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో రిజిస్టర్డ్‌ ఓటర్లందరికీ ఇకపై యూనిక్‌ ఎపిక్‌ నంబర్లు కేటాయించాలని ఈసీ నిర్ణయించింది.


ఈ ప్రక్రియకు సహకరించేందుకు ఎరోనెట్‌ 2.0 ప్లాట్‌ఫాంను ఆధునికీకరిస్తామని తెలిపింది. మమత ఆరోపణలను బెంగాల్‌ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కూడా తోసిపుచ్చారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల జాబితాల నవీకరణలో బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు), రిటర్నింగ్‌ అధికారులు(ఈఆర్‌వోలు), సహాయ రిటర్నింగ్‌ అధికారులు(ఏఈఆర్‌వోలు), జిల్లా ఎన్నికల అధికారులు(డీఈవోలు), రాష్ట్రాల సీఈవోలు పాలుపంచుకుంటారని.. రాజకీయ పార్టీలు నియమించిన బూత్‌ స్థాయి ఏజెంట్లు క్రియాశీల పాత్ర పోషిస్తారని ఆదివారం ఓ ప్రకటనలో గుర్తుచేశారు. ఓటర్ల నమోదు, జాబితాలపై ఏవైనా అభ్యంతరాలుంటే వీరి ముందు ఉంచాలని.. వాటిపై తక్షణమే దృష్టి సారిస్తున్నామని.. దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. కాగా.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక.. అక్కడ 5 నెలల వ్యవధిలోనే 48 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చారని కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తోందని.. కానీ ఈ వ్యవహారంలో సీఈవో కార్యాలయానికి ఒక్క ఫిర్యాదు మాత్రమే చేసిందని ఈసీ వర్గాలు తెలిపాయి.


మమత అబద్ధం బట్టబయలు: బీజేపీ

మమత చెప్పిన మరో అబద్ధం బట్టబయలైందని బీజేపీ ఐటీ ఇన్‌చార్జి, బెంగాల్‌ బీజేపీ సహ ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఆమె దుష్ప్రచారానికి ఒడిగట్టారని, ఎన్నికల వ్యవస్థపై ఓటర్ల విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. బెంగాల్లో ఓటర్ల ప్రక్షాళన జరపాలని ఈసీని కోరారు. అక్రమ బంగ్లాదేశీయులను, రోహింగ్యాలను ఓటర్ల జాబితాల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి

Mayawati: నేనున్నంత వరకూ నాకు వారసులు ఉండరు: మాయావతి బిగ్ స్టేట్‌మెంట్

PM Modi: 100 జిల్లాల్లో పీఎం ధన ధాన్య కృషి

Privilege Motion: జైశంకర్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 03 , 2025 | 02:10 AM