కేజ్రీవాల్‌పై ఈడీ విచారణకు కేంద్ర హోం శాఖ ఓకే
ABN, Publish Date - Jan 16 , 2025 | 06:20 AM
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్(56)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై విచారణ జరిపేందుకు ఈడీకి కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చిందని బుధవారం అధికార వర్గాలు తెలిపాయి.

న్యూఢిల్లీ, జనవరి 15: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్(56)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై విచారణ జరిపేందుకు ఈడీకి కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చిందని బుధవారం అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ఎక్సయిజ్ విధానం కేసులో నగదు అక్రమ చలామణికి పాల్పడినట్టు ఈడీ ఆయనపై ఛార్జిషీటు దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎల్‌ఎంఏ) కింద కేసు పెట్టి గత ఏడాది మార్చిలో అరెస్టు చేసింది. బెయిల్‌పై విడుదలైన ఆయన ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పీఎల్‌ఎంఏ చట్టం కింద ఆయనపై విచారణ జరిపేందుకు ఈడీకి ప్రస్తుతం హోంశాఖ అనుమతి ఇచ్చింది.
ఆయనపై విచారణ జరపాలని తొలుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా ‘కాంపెటెంట్ అథారిటీ’ అయిన హోం శాఖకు సిఫార్సు చేశారు. అందుకు హోం శాఖ సానుకూలంగా స్పందించింది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతర అధికారులపై విచారణ జరిపేందుకు కూడా హోంశాఖ అనుమతి ఇచ్చింది. రాజకీయ నాయకులు, మంత్రులు, అధికారులపై విచారణ జరిపేందుకు సీఆర్‌పీసీలోని సెక్షన్ 197(1) ప్రకారం కాంపెటెంట్ అథారిటీ నుంచి సీబీఐ ముందస్తు అనుమతి తీసుకుంటున్నట్టుగానే ఈడీ కూడా అనుమతి పొందాల్సి ఉంటుందని గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం కాంపెటెంట్ అథారిటీ అయిన కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకుంది.
Updated Date - Jan 16 , 2025 | 06:20 AM