లవర్‌తో పట్టుబడ్డ భార్య.. నిలదీస్తే.. నీకు నేవీ ఆఫీసర్ గతే పడుతుందంటూ
ABN , Publish Date - Apr 09 , 2025 | 09:52 AM
మీరట్‌లో నేవీ ఆఫీసర్ మర్డర్ కేసు దేశంలో సంచలనం సృష్టించింది. దాంతో పాటు మరో కొత్త సమస్యను కూడా తెర మీదకు తెచ్చినట్లు అర్థం అవుతోంది. వివాహేర బంధంలో ఉన్న వారు ఇప్పుడు మీరట్ దారుణాన్ని వాడుకుంటున్నారా. వివాహేతర బంధం గురించి భాగస్వామి ప్రశ్నిస్తే.. మీకు కూడా మీరట్ అధికారి గతే పట్టాలా అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఆ వివరాలు..

ఛండీగర్: నేటి కాలంలో పెళ్లికి ముందు ప్రేమల కన్నా.. పెళ్లి తర్వాత ప్రేమలు పెరుగుతున్నాయి. ఇక కొందరైతే వివాహం తర్వాత కూడా ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉండటం కోసం దారుణాలకు పాల్పడుతున్నారు. ఏకంగా కట్టుకున్న వాడిని కడదేరుస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఈ తరహా దారుణాలు రెండు ఒకదాని తర్వాత ఒకటి వెలుగు చూశాయి. ప్రేమించిన వాడి కోసం భర్తను చంపి.. ముక్కలుగా నరికి డ్రమ్ములో పెట్టింది ఓ మహిళ. మరో కేసులో.. పెళ్లైన రెండు వారాలకే భర్తను చంపేందుకు కాంట్రాక్ట్ ఇచ్చింది మరో మహిళ. అయితే ఈ దారుణాలు ఎంత సంచలనం సృష్టించాయో.. అదే స్థాయిలో అమాయకులను భయపెడుతున్నాయి. వివాహేతర బంధంలో ఉన్న కొందరు వీటిని ఆదర్శంగా తీసుకుని.. భర్త, భార్యలను ఇలానే బెదిరిస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. లవర్‌తో పట్టుబడిన ఓ మహిళ.. ఇది ఏంటని ప్రశ్నించిన భర్తను.. నీకు కూడా నేవీ ఆఫీసర్‌కు పట్టిన గతే పట్టాలని కోరుకుంటున్నావా అంటూ బెదిరించింది. ఆ వివరాలు..
ఈ సంఘటన హరియాణా, గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖర్మాన్ గ్రామానికి చెందిన మౌసం క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం అతడికి పంజాబ్‌కు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో.. వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిని ఇరు కుటుంబాలు ఆమోదించలేదు.
దాంతో మౌసం తన భార్యతో కలిసి గురుగ్రామ్‌లోని బసాయి ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నాడు. కొన్నాళ్ల వరకు వీరి కాపురం బాగానే సాగింది. ఇలా ఉండగా.. మౌసం భార్యకు.. అతడి గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. ఇలా ఉండగా రెండు రోజుల క్రితం అనగా సోమవారం నాడు మౌసం తన విధులు నిర్వహించుకుని.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. అయితే అతడి భార్య ఇంట్లో లేదు.
దాంతో మౌసం భార్యను వెతుక్కుంటూ.. టెర్రస్ మీదకు వెళ్లాడు. అక్కడ నవీన్, మౌసం భార్య చాలా సన్నిహితంగా కనిపించారు. ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించగా.. నవీన్ బెదిరింపులకు దిగాడు. తన దగ్గర ఉన్న తుపాకీ బయటకు తీసి.. మౌసం తలకు గురి పెట్టాడు. అంతేకాక మౌసం తల మీద తుపాకీతో కొట్టాడు. పైగా తమ విషయంలో కలగజేసుకుంటే.. మీరట్ నేవీ అధికారికి పట్టిన గతే పడుతుందని.. చంపి డ్రమ్ములో పెడతామంటూ బెదిరించి.. అక్కడి నుంచి పారిపోయారు.
మౌసం భార్య, నవీన్ అక్కడ నుంచి పారిపోయిన తర్వాత చుట్టుపక్కల వారు టెర్రస్ మీదకు చేరుకుని.. మౌసంను కిందకు తీసుకువచ్చారు. పోలీసులకు సమాచారం అందించారు. మౌసం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి భార్య, నవీన్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..
చరిత్ర తిరగరాయాల్సిన సమయం వచ్చింది.. ఇదే పురాతన కట్టడం..