INS Varsha Nuclear Submarine Base: 2026 నాటికి ఏపీలో అణు జలాంతర్గామి స్థావరం
ABN , Publish Date - Apr 08 , 2025 | 05:56 AM
2026 నాటికి, ఏపీలోని విశాఖపట్నం సమీపంలో అణు జలాంతర్గామి స్థావరం ‘ఐఎన్‌ఎస్ వర్ష’ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా చైనా చర్యలపై నిఘా చర్యలు మరింత సున్నితంగా నిర్వహించబడతాయి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: సముద్ర రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా మరో కీలక ముందడుగు పడనుంది. తూర్పు తీరంలో రక్షణ అవసరాల కోసం నిర్మిస్తున్న నేవీ ప్రత్యామ్నాయ స్థావరం ‘ఐఎన్‌ఎస్ వర్ష’ను 2026లో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి 50 కి.మీ. దూరాన అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో సముద్ర తీరాన్ని ఆనుకొని దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 670 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించింది. దీని తొలి దశ నిర్మాణం 2022 నాటికి, మలి దశ నిర్మాణం 2025 నాటికి పూర్తి కావలసి ఉంది. కానీ కొవిడ్ వంటి కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు తొలిదశ నిర్మాణం పూర్తి కావొచ్చింది. హిందూ సముద్ర ప్రాంతంలో చైనా చర్యలపై నిఘాకు ఈ స్థావరం ఉపయోగపడుతుంది.