Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..
ABN , Publish Date - Feb 08 , 2025 | 04:43 PM
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ముఖ్యంగా మధ్య తరగతి ఓటర్లను ఆకర్షించడంలో ఆ పార్టీ విజయం సాధించింది. గత పదేళ్లుగా ఆప్‌తో ఉన్న పేద, మధ్య తరగతి ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ వేసిన మంత్రం ఏమిటి..

ఢిల్లీలో మూడు దశాబ్ధాల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుంది. అధికారంలోకి వచ్చేందుకు 1998 నుంచి ఎంత ప్రయత్నిస్తున్నా బీజేపీకి సాధ్యం కావడంలేదు. దేశ వ్యాప్తంగా తన ఇమేజ్‌తో చారిత్రాత్మక విజయాలు అందించిన ప్రధాని మోదీ సైతం 2015, 2020 ఎన్నికల్లో బీజేపీని ఢిల్లీ శాసనసభలో గెలిపించలేకపోయారు. ఆప్ దెబ్బకు బీజేపీ తోకముడిచింది. అదే 2025లో మాత్రం సీన్ రివర్స్ అయింది. బీజేపీ కొట్టిన దెబ్బకు ఆప్‌కు సౌండ్ లేకుండా పోయింది. 2015, 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ప్రధాని ప్రచారం చేసినా.. 2025 ఎన్నికల్లో చేసినంత ప్రచారం చేయలేదు. చిన్న రాష్ట్రం కావడంతో మోదీ పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కానీ 2025లో మాత్రం టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ మోదీ అనుకున్న లక్ష్యం సాధించారు. ఓవైపు ఉచిత హామీలతో పాటు.. గెలిచేందుకు ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదు. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆ పార్టీకి కలిసొచ్చినట్లు చర్చ జరుగుతోంది. బీజేపీని ఓడించేందుకు ఆప్ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ వాటిని కమలనాధులు సమర్థంగా ఎదుర్కొన్నారు. యమునా నీటిలో బీజేపీ విషం కలిపిందని కేజ్రీవాల్ స్థాయి నాయకుడు ఆరోపించారంటే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రెండు పార్టీలు ఎంత శ్రమించాయనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. బీజేపీ విజయంలో ఎన్నో సమీకరణలు పనిచేసినప్పటికీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఆ పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం.
గెలుపులో కీలకం
కేంద్రప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా పన్ను మినహాయింపు విషయంలో కేంద్రప్రభుత్వం ప్రకటన బీజేపీ గెలుపులో ప్రధాన భూమిక పోషించిందనే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో చాలామందికి నెలకు రూ.లక్ష వరకు జీతం ఉంటుంది. దీంతో ఎంత సంపాదించినా మధ్యతరగతి ప్రజలు పన్ను రూపంలో వేలకు వేలు కట్టాల్సి వస్తోంది. దీంతో పన్ను మినహాయింపు రూ.12లక్షల వరకు పెంచడంతో మధ్య తరగతి ప్రజలు బీజేపీకి జై కొట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ గెలుపులో సగం మార్కులు పన్ను మినహాయింపుకేనంటూ ప్రచారం జరుగుతోంది.
హోరాహోరీ..
ఢిల్లీలో గెలుపుకోసం బీజేపీ, ఆప్ తీవ్రంగా ప్రయత్నించాయి. చివరి వరకు విజయం కోసం హోరాహోరీగా తలపడ్డాయి. సామాన్యుడినంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, రాజభవనాల్లో ఉంటున్నారని బీజేపీ విమర్శిస్తూ వచ్చింది. తాము విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న విషయాన్ని ఆప్ నేతలు ఖండించినప్పటికీ.. కొందరు నేతలు మాత్రం వంద కోట్లకు బీజేపీ హడావుడి చేస్తోందని, వేల కోట్ల రూపాయిలను బీజేపీ దోచుకుంటుందని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆప్ మూల సిద్దాంతం అవినీతి రహిత ప్రభుత్వం కావడంతో.. ప్రజలు ఆప్ అవినీతిని సహించలేకపోయారని, దీనికి నిదర్శనం ప్రస్తుత ఫలితాలనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here