Share News

Surat: స్కూల్‌ ఫేర్‌వెల్‌కు 35 లగ్జరీ కార్లతో ర్యాలీ.. విన్యాసాలు

ABN , Publish Date - Feb 14 , 2025 | 05:10 AM

వారంతా 12వ తరగతి విద్యార్థులు..! వార్షిక పరీక్షల వేళ.. స్కూలులో నిర్వహించిన ఫేర్‌వెల్‌ పార్టీకి 35 లగ్జరీ కార్లతో కాన్వాయ్‌ నిర్వహించి, స్టంట్లు చేశారు. తల్లిదండ్రులను పోలీసు కేసుల్లో ఇరికించారు.

Surat: స్కూల్‌ ఫేర్‌వెల్‌కు 35 లగ్జరీ కార్లతో ర్యాలీ.. విన్యాసాలు

  • గుజరాత్‌లోని సూరత్‌లో ఘటన

  • విద్యార్థుల తల్లిదండ్రులపై ఎఫ్‌ఐఆర్‌లు

  • 22 కార్లు సీజ్‌.. మిగతావాటి కోసం గాలింపు

సూరత్‌, ఫిబ్రవరి 13: వారంతా 12వ తరగతి విద్యార్థులు..! వార్షిక పరీక్షల వేళ.. స్కూలులో నిర్వహించిన ఫేర్‌వెల్‌ పార్టీకి 35 లగ్జరీ కార్లతో కాన్వాయ్‌ నిర్వహించి, స్టంట్లు చేశారు. తల్లిదండ్రులను పోలీసు కేసుల్లో ఇరికించారు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూరత్‌లోని ఓల్పాడ్‌ ప్రాంతంలోని ఓ స్కూల్‌లో ఇటీవల ఫేర్‌వెల్‌ పార్టీని నిర్వహించారు. పలువురు 12వ తరగతి విద్యార్థులు బెంజ్‌, పోర్షే, బీఎండబ్ల్యూ వంటి 35 లగ్జరీ కార్లలో పార్టీకి చేరుకున్నారు. అంతకు ముందు నగరంలో ప్రమాదకరంగా కార్లను నడుపుతూ.. స్టంట్లు చేశారు.


కొందరు విద్యార్థులు డోర్లపై ప్రమాదకరంగా కూర్చోగా.. మరికొందరు సన్‌రూ్‌ఫపై స్మోక్‌గన్‌లను పట్టుకుని హంగామా చేశారు. దారంతా అరుపులు, కేరింతలతో కార్లను నడిపారు. ఈ కాన్వాయ్‌, స్టంట్లకు సంబంధించిన డ్రోన్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నగరవాసులు ఈ స్టంట్లపై తీవ్ర విమర్శలు చేశారు. దాంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. మొత్తం ఆరు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. 35 కార్లలో 26 వాహనాలను గుర్తించారు. 22 కార్లను సీజ్‌ చేశారు. మిగతా 13 కార్ల కోసం గాలిస్తున్నారు. కార్లను నడిపిన డ్రైవర్లు, రాష్‌ డ్రైవింగ్‌ చేసిన మైనర్‌ విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు.

Updated Date - Feb 14 , 2025 | 05:10 AM