Mob Beat Temple Priest: మరీ ఇంత దారుణమా.. పూజారి అనే కనికరం కూడా లేకుండా
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:30 PM
అర్ధరాత్రి ఆలయంలోకి చొచ్చుకు వచ్చిన అల్లరి మూక.. గుడి తెరవాల్సిందిగా డిమాండ్ చేశారు. అందుకు పూజారి అంగీకరించకపోవడంతో.. అతడిపై దాడికి దిగారు. వీరంతా ఎమ్మెల్యే కొడుకు అనుచరులు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు..

భోపాల్: అధికారం, డబ్బుందనే అహాంకారంతో కొందరు కన్నుమిన్ను కానక ప్రవర్తిస్తుంటారు. తాతలు, తండ్రి సంపాదించిన డబ్బులతో దర్జాగా జల్సాలు చేస్తూ.. దౌర్జన్యాలకు పాల్పడుతుంటారు కొందరు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి వెలుగు చూసింది. ఎమ్మెల్యే కొడుకు ఒకరు.. దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అర్థరాత్రి తన అనుచరులతో వచ్చి.. ఆలయం తలుపులు తెరవాలంటూ డిమాండ్ చేశాడు. గుడి పూజారి అందుకు అంగీకరించకపోవడంతో.. ఎమ్మెల్యే కొడుకు అనుచరులు.. పూజారిపై దాడి చేశారు. సుమారు 30 మంది వరకు ఈ దాడిలో పాల్గొన్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఈ సంఘటన శుక్రవారం రోజు అర్ధరాత్రి మధ్యప్రదేశ్, షాజాపూర్ జిల్లాలో వెలుగు చూసింది. ప్రముఖ ఆలయం మాతా టేక్రి గుడి పూజారిపై దాడి చేశారు నిందితులు. సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో ప్రకారం.. గతంలో నేర చరిత్ర ఉన్న జీతూ రఘువంశీ అనే వ్యక్తి శుక్రవారం అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో.. సుమారు 30 మందితో కలిసి ఎనిమిది నుంచి పది కార్ల కాన్వాయ్‌లో ఆలయానికి వచ్చాడు. గుడి తలుపులు తెరవమని డిమాండ్ చేశారు. అయితే ఆలయ పూజారి ఉప్‌దేశ్ నాథ్ అందుకు అంగీకరించకపోవడంతో.. అతడిపై దాడికి దిగారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ.. "మేము అర్ధరాత్రి సమయంలో ఆలయ ద్వారాలు మూసివేస్తాం. అయితే శుక్రవారం నాడు జీతూ రఘువంశీ నేతృత్వంలోని గుంపు అర్ధ రాత్రి 12:40 గంటలకు ఆలయం వద్దకు వచ్చింది. అప్పటికే నేను ద్వారాలు మూసివేశాను. ఆలయం మూసివేసినట్టు నేను వారికి చెప్పడంతో.. తెరవమని బెదిరించారు. అందుకు నేను అంగీకరించలేదు. దాంతో నన్ను చంపుతామని బెదిరించారు.. నాపై దాడి కూడాచేశారు" అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
అనంతరం ఉప్‌దేశ్ స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆలయ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్‌ని కలెక్ట్ చేశారు. దాన్ని పరిశీలించిన తర్వాత నిందితుల మీద తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
సంస్కారం అనే పదం ఎలా వచ్చిందో తెలుసా.. దానికి నిజమైన అర్థం ఇదే
West Bengal Waqf protests: వక్ఫ్ విధ్వంసం.. ముగ్గురు మృతి.. 150 మంది అరెస్ట్