Maha Kumbh Mela: వావ్, 60 కోట్లు దాటేసిన మహా కుంభమేళా భక్త జనం.. చివరి రోజుకు ఇంకా పెరిగే ఛాన్స్..

ABN, Publish Date - Feb 22 , 2025 | 09:19 PM

మహా కుంభమేళా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలోనే జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకు 60 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం శనివారం అధికారికంగా ప్రకటించింది.

Maha Kumbh Mela: వావ్, 60 కోట్లు దాటేసిన మహా కుంభమేళా భక్త జనం.. చివరి రోజుకు ఇంకా పెరిగే ఛాన్స్..
maha Kumbh Mela

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా(Maha Kumbh Mela)కు దేశంతోపాటు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే మరో అరుదైన రికార్డుకు చేరువైంది. ఈరోజు అంటే శనివారం (ఫిబ్రవరి 22న) సాయంత్రం 6 గంటల వరకు 1.29 కోట్ల మంది భక్తులు స్నానాలు ఆచరించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 60.2 కోట్లకు పైగా భక్తులు సంగమంలో పుణ్య స్నానాలు చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

అంతేకాదు ఫిబ్రవరి 26 నాటికి ఈ భక్తుల సంఖ్య 65 కోట్లకు పైగా చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే చివరి రోజుకు మరో నాలుగు రోజుల సమయం ఉంది. ఈ క్రమంలో ముఖ్యంగా శివరాత్రి చివరి పవిత్ర స్నానోత్సవం కోసం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది.


మళ్లీ స్నానం చేసిన సీఎం..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్, మంత్రులు స్వతంత్ర దేవ్ సింగ్, నంద్ గోపాల్ గుప్తా కూడా ఆయనతో పాటు పాల్గొన్నారు. ఈ నాయకులందరూ కలిసి సంగమంలో స్నానం ఆచరించారు. ఆ తర్వాత నడ్డా తన కుటుంబంతో కలిసి సూర్య భగవానుడికి ప్రార్థనలు చేసి, గంగా తల్లికి చీర, కొబ్బరికాయ, పూలు భక్తితో సమర్పించారు. ఈ సందర్భంగా నడ్డా ఇద్దరు పిల్లలు కూడా సంగమంలో స్నానం చేయడానికి ఆయనతో కలిసి వచ్చారు.


ఈ ప్రముఖులు కూడా..

మహా కుంభమేళాలో ఇప్పటివరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, ఎంపీ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పుణ్య స్నానం చేశారు.

దీంతోపాటు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ, మణిపూర్ సీఎం ఎన్ బిరేన్ సింగ్, సీఎం యోగి, ఆయన మొత్తం మంత్రివర్గం, అఖిలేష్ యాదవ్, రవి కిషన్, కవి కుమార్ విశ్వాస్ కూడా పవిత్ర స్నానం చేశారు. మరోవైపు 73 దేశాల ప్రతినిధులు, భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యాల్ వాంగ్‌చుక్ సహా అనేక మంది ఇతర ప్రముఖులు కూడా ఈ సంగమంలో స్నానం చేశారు.


సనాతన ధర్మాన్ని పాటించేవారి సంఖ్య..

ఈసారి మహా కుంభమేళాలో 40 కోట్ల మంది భక్తులు పవిత్ర సంగమంలో స్నానమాచరిస్తారని యూపీ ప్రభుత్వం మొదట అంచనా. కానీ ప్రభుత్వ అంచనా ప్రకారం ఇప్పటికే 60 కోట్ల మందికిపైగా భక్తులు స్నానం ఆచరించారు. ప్యూ రీసెర్చ్ సర్వే 2024 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని పాటించే వారి సంఖ్య 1.2 బిలియన్లు (120 కోట్లు) ఉంటే, అందులో దాదాపు 50 శాతం కంటే ఎక్కువ మంది సంగమంలో స్నానం చేశారని తెలిపింది. అంతేకాదు ఇండియాలో 143 కోట్ల మంది ఉంటే, వారిలో సుమారు 110 కోట్ల మంది సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నట్లు వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

Maha Kumbh Mela 2025: చివరి రోజు మహా కుంభమేళా మాములుగా ఉండదు.. శివరాత్రికి భారీగా ఏర్పాట్లు

Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Aadhaar Update: అలర్ట్.. ఆధార్‌లో మీ నంబర్, పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 22 , 2025 | 09:46 PM