Mallikarjun Kharge: తగ్గేదే లే..!
ABN, Publish Date - Apr 04 , 2025 | 05:00 AM
వక్ఫ్ భూమిని కబ్జా చేశారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ బుధవారం లోక్‌సభలో చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.

నాపై ఆరోపణల్ని రుజువు చేస్తే రాజీనామా చేస్తా లేకపోతే అనురాగ్ ఠాకూర్ చేయాల్సిందే
రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: వక్ఫ్ భూమిని కబ్జా చేశారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ బుధవారం లోక్‌సభలో చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. రాజకీయ దాడులకు తాను బెదిరిపోనన్నారు. పుష్ప సినిమాలోని ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పారు. గురువారం రాజ్యసభలో ఖర్గే మాట్లాడారు. ‘‘బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నాపై అసత్య ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నించడంతో ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.వక్ఫ్ భూమిపై ఆరోపణలను ఠాకూర్ నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. లేదంటే ఆయన చేయాల్సిందే. ఇలాంటి రాజకీయ దాడులతో బీజేపీ నేతలు నన్ను భయపెట్టాలని చూస్తున్నారు. నేనెవరికీ భయపడను. తలొగ్గను’’ అని ఖర్గే స్పష్టం చేశారు. కాగా, వక్ఫ్ బిల్లు రాజ్యాంగంపై తీవ్ర దాడి అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆమె మాట్లాడుతూ.. సమాజంలో విభజన తీసుకొచ్చేందుకు బీజేపీ వ్యూహంలో భాగమే ఈ బిల్లు అని ఆక్షేపించారు.
Updated Date - Apr 04 , 2025 | 05:00 AM