CM Biren Singh : మణిపూర్ సీఎం క్షమాపణ
ABN, Publish Date - Jan 01 , 2025 | 04:37 AM
జాతుల వైరం సుదీర్ఘకాలంగా కొనసాగుతుండటంపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
హింసలో 200 మందికిపైగా మరణించారు
కొత్త ఏడాదిలోనైనా శాంతి నెలకొనాలి: బీరేన్ సింగ్
ఇంఫాల్/న్యూఢిల్లీ, డిసెంబరు 31: జాతుల వైరం సుదీర్ఘకాలంగా కొనసాగుతుండటంపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మైతేయి, కుకీ తెగల మధ్య ఘర్షణతో 2023 మే నుంచి ఆ రాష్ట్రంలో హింస కొనసాగుతోంది. 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది ఇళ్లను వీడిపోయారు. ఇప్పటికీ అనేకమంది పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. దీనిపై మంగళవారం మీడియా ఎదుట విచారం వ్యక్తం చేసిన బీరేన్ సింగ్ ప్రజలను క్షమాపణ కోరారు. ‘ఈ ఏడాదంతా చాలా దురదృష్టకర పరిణామాలతోనే కొనసాగింది. గతేడాది మే 3 నుంచి ఇప్పటి వరకు జరిగినదానికి క్షమించమని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. నూతన సంవత్సరం-2025 రాష్ట్రంలో శాంతి, సాధారణ పరిస్థితులను పునరుద్ధరిస్తుందని ఆశాభావంతో ఉన్నా. జరిగిందేదో జరిగిపోయింది. గత తప్పులను మరచిపోయి ఇప్పుడు మనమంతా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. శాంతియుత మణిపూర్, సుసంపన్న మణిపూర్ కోసం మనమంతా కలిసి జీవించాలని రాష్ట్రంలోని అన్ని కులాలను కోరుతున్నా’ అన్నారు.
Updated Date - Jan 01 , 2025 | 04:37 AM