Strengthening BIMSTEC: మోదీ యూనస్ భేటీ
ABN, Publish Date - Apr 05 , 2025 | 03:24 AM
బ్యాంకాక్ సదస్సులో బిమ్ స్టెక్ ను బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ 21 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. వివిధ దేశాలతో చెల్లింపు వ్యవస్థలు అనుసంధానం చేస్తే పర్యాటక వాణిజ్య రంగాలలో ప్రయోజనాలు అందుతాయని తెలిపారు

బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతకు భరోసా ఇవ్వాలి
ప్రజాస్వామ్య, సుస్థిర, సమ్మిళిత, శాంతియుత
బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు ఉంటుంది
అక్రమ చొరబాట్లను అడ్డుకోవాలి: ప్రధాని మోదీ
షేక్ హసీనా అప్పగింతపై చర్చించిన యూనస్
‘బిమ్‌స్టెక్’ను బలోపేతం చేద్దాం
21 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించిన మోదీ
సభ్య దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐ అనుసంధానం
స్థానిక కరెన్సీలో వాణిజ్యానికి ప్రోత్సాహం
మోదీ 21 సూత్రాల ప్రణాళిక ప్రతిపాదన
బిమ్‌స్టెక్ సదస్సులో
బ్యాంకాక్ విజన్-2030కు ఆమోదం
బ్యాంకాక్, ఏప్రిల్ 4: బిమ్‌స్టెక్ దేశాల చెల్లింపు వ్యవస్థలతో భారత యూపీఐని అనుసంధానించాలని ప్రధాని మోదీప్రతిపాదించారు. దీనిద్వారా సభ్య దేశాల మధ్య పర్యాటకాభివృద్ధితో పాటు వాణిజ్యం, పరిశ్రామిక రంగాలకు విస్తృత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. బ్యాంకాక్‌లో శుక్రవారం నిర్వహించిన 6వ బిమ్‌స్టెక్ సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రపంచ శ్రేయస్సును మరింత మెరుగుపరచడానికి ఈ ఫోరం ఒక ముఖ్యమైన వేదికగా మోదీ అభివర్ణించారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం అత్యవసరమని, దీనికోసం 21 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదిస్తున్నానని అన్నారు. దీనిలో భాగంగా బిమ్‌స్టెక్ దేశాలకు చెందిన 300మంది యువతకు భారత్‌లో ఏటా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఐటీ రంగ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకొని ఈ వేదికను సాంకేతికంగా బలోపేతం చేద్దామని మోదీ పిలుపునిచ్చారు.
సభ్య దేశాల మధ్య వ్యాపార సంబంధాలను పెంపొందించడానికి బిమ్‌స్టెక్ చాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఏర్పాటు చేయాలని, వార్షిక వ్యాపార సదస్సులు నిర్వహించడంతో పాటు స్థానిక కరెన్సీలో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు. విపత్తు నిర్వహణ, సహాయ, పునరావాసంలో సహకారం దిశగా బిమ్‌స్టెక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డిజార్టర్ మేనేజ్‌మెంట్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. బిమ్‌స్టెక్ పరిధిని, సామర్థ్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. సభ్య దేశాలకు మానవ వనరుల శిక్షణ, నానో ఉపగ్రహాల తయారీ, ప్రయోగాలు, రిమోట్ సెన్సింగ్ డేటా వినియోగం కోసం గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నలంద యూనివర్సిటీల్లో బిమ్‌స్టెక్ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాలని, సభ్యదేశాలకు చెందిన దౌత్యవేత్తలకు ఏటా శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. యువత భాగస్వామ్యం కోసం ఈ ఏడాది బిమ్‌స్టెక్ యంగ్ లీడర్స్ సమ్మిట్ నిర్వహిస్తామని, బిమ్‌స్టెక్ హ్యాకథాన్, యంగ్ ప్రొఫెషనల్ విజిటర్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. కాగా, బంగాళాఖాతం ప్రాంతంలో భద్రత, సమ్మిళితత్వం పట్ల భాగస్వామ్య నిబద్ధతను సాకారం చేయడానికి బిమ్‌స్టెక్ సమావేశం బ్యాంకాక్ విజన్-2030ను ఆమోదించింది. థాయ్‌లాండ్ ఆతిథ్యం ఇస్తున్న ఈ సదస్సుకు భారత్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, భూటాన్ దేశాధినేతలు హాజరయ్యారు.
హిందువుల భద్రతకు భరోసా ఇవ్వండి
బిమ్స్‌టెక్ సదస్సు నేపథ్యంలో ప్రధాని మోదీతో బంగ్లాదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు యూనస్ బ్యాంకాక్‌లో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయొద్దని యూన్‌సను మోదీ ఈ సందర్భంగా హెచ్చరించారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రతకు భరోసా ఇవ్వాలని కోరారు. గతేడాది ఆగస్టులో హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నుంచి ఈ రెండు దేశాల నేతలు కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య, సుస్థిర, శాంతియుత, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. సరిహద్దు భద్రతపై కూడా నేతలు చర్చించారు. బిమ్‌స్టెక్ అధ్యక్ష పదవిని చేపట్టిన బంగ్లాదేశ్‌కు మోదీ అభినందనలు తెలిపారు. కాగా, హసీనా అప్పగింతపై మోదీ, యూనస్ ఈ భేటీలో చర్చించారని విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. దీనిపై ఇప్పుడు ఇంతకుమించి వ్యాఖ్యానించడం సరికాదని ఆ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ప్రధాని మోదీ శుక్రవారం బ్యాంకాక్‌లో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, బ్యాంకాక్‌లోని వాట్ ఫో ఆలయంలో విశ్రాంతి తీసుకుంటున్న భంగిమలో ఉన్న 46 మీటర్ల పొడవైన బుద్ధుడి విగ్రహాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. నాలుగు సింహాలతో కూడిన అశోక చక్రం ప్రతిమను మందిరానికి బహూకరించారు.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News
Updated Date - Apr 05 , 2025 | 03:24 AM