Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై కత్తి దాడి.. వెలుగులోకి సంచలన విషయాలు..
ABN, Publish Date - Jan 16 , 2025 | 01:32 PM
ముంబైలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి సంచలనంగా మారింది. అసలు సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఏం జరిగింది? వైద్యులు ఏమంటున్నారు? సైఫ్, కరీనా బృందాలు ఏం చెబుతున్నాయి? అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం..
Mumbai: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి సంచలనంగా మారింది. నేడు తెల్లవారుజామున ముంబైలోని తన ఇంటి వద్ద ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఏం జరిగింది? వైద్యులు ఏమంటున్నారు? సైఫ్, కరీనా బృందాలు ఘటనపై ఏం చెబుతున్నాయి? అనే విషయాలను తెలుసుకుందాం..
జనవరి 16న సైఫ్ ఇంట్లో ఏం జరిగింది:
సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని తన ఇంట్లో 11వ అంతస్తులో నిద్రిస్తుండగా అనుమానాస్పద శబ్దాలు రావడంతో అతనికి మేలుకువ వచ్చింది.
ఓ వ్యక్తి ఇంట్లో దొంగతనానికి యత్నించగా సైఫ్ అతడిని పట్టుకోబోయాడు.. అయితే, ఆ దుండగుడు సైఫ్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది.
ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో జరిగింది.
సైఫ్ నుండి తప్పించుకునేందుకు ఆ ఆగంతకుడు సైఫ్‌పై ఆరుసార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. అతడి కేకలు విన్న కుటుంబసభ్యులు వెంటనే అప్రమత్తమై హుటాహుటినా అతడిని ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై బాంద్రా పోలీసులకు తెల్లవారుజామున 3 గంటలకు ఫిర్యాదు చేశారు.
లీలావతి హాస్పిటల్ ఏం చెప్పింది?
సైఫ్ అలీఖాన్‌ను బాంద్రా ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారని, తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారని లీలావతి హాస్పిటల్ సిఓఓ డాక్టర్ నీరాజ్ తెలిపారు.
సైఫ్ అలీఖాన్ ఆరు కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడ్డారని..వాటిలో ఒకటి వెన్నెముకకు ప్రమాదకరంగా ఉందని తెలిపారు.
న్యూరోసర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ నిషా గాంధీ నేతృత్వంలోని వైద్యుల బృందం సైఫ్ అలీఖాన్‌కు 2.5 గంటల పాటు న్యూరో సర్జరీ చేసింది.
సైఫ్ ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించారు.
నటుడు ప్రస్తుతం కోలుకుంటున్నారని, వైద్యులు అతని పురోగతిని పర్యవేక్షిస్తున్నారని సైఫ్ అలీ ఖాన్ బృందం ప్రకటన చేసింది.
పోలీసులు ఏం చెప్పారు?
బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఆగంతకుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడని, దాడి జరిగిన సమయంలో కొందరు నటుడి కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో ఉన్నారని పోలీసు అధికారి తెలిపారు.
సైఫ్ అలీఖాన్ ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు అటెండర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.
నిందితుడి కోసం క్రైమ్ బ్రాంచ్ 7 బృందాలను ఏర్పాటు చేసింది.
క్లూల కోసం ఓ బృందం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తోంది.
ముంబైలోని వివిధ ప్రాంతాలకు మూడు బృందాలు బయలుదేరాయి.
నిందితుడి కోసం ముంబై నుంచి ఓ బృందం వెతుకుతుంది.
గురువారం ఉదయం బాంద్రా (పశ్చిమ)లోని సైఫ్ ఇంటి బయట స్నిఫర్ డాగ్స్ కనిపించాయి.
ముంబై పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
సైఫ్, కరీనా బృందాలు ఏం చెబుతున్నాయంటే..
సైఫ్ అలీఖాన్ బృందం ఓ ప్రకటనలో "మిస్టర్ సైఫ్ అలీఖాన్ నివాసంలో ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియా, అభిమానులు సమయమనం పాటించాలి" అని తెలిపారు. మిగిలిన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని కరీనా కపూర్ బృందం ధృవీకరించింది. ఆ ప్రకటనలో ఇలా ఉంది, "నిన్న రాత్రి సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ నివాసంలో ఓ వ్యక్తి చోరీకి ప్రయత్నించాడు. ఈ ఘటనలో సైఫ్ కు గాయాలు అయ్యాయి, అతను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు" అని వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం, సైఫ్ అలీ ఖాన్ బృందం అధికారిక ప్రకటనలో సైఫ్ అలీ ఖాన్ ప్రమాదం నుండి బయటపడ్డారని.. అతను ప్రస్తుతం కోలుకుంటున్నారని.. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని, ఆయన అభిమానుల ప్రార్థనలు ఫలించాయని, ఆపరేషన్ చేసిన వైద్య బృందానికి ధన్యవాదాలని తెలిపారు.
Updated Date - Jan 16 , 2025 | 01:53 PM