Share News

MUDRA loans: జూట్‌ బ్యాగులు తయారుచేస్తున్నా

ABN , Publish Date - Apr 09 , 2025 | 02:54 AM

ముద్రా రుణాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన లభించి, ఉద్యోగదాతలుగా మారారని ప్రధాని మోదీ తెలిపారు. ఈ పథకం ద్వారా 70% మంది మహిళలు లబ్ధి పొందారని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మద్దతుగా నిలిచిందన్నారు.

 MUDRA loans: జూట్‌ బ్యాగులు తయారుచేస్తున్నా

బ్యాంకు రూ.రెండు లక్షల ముద్రా రుణం ఇచ్చింది

సకాల రుణ చెల్లింపుతో మరో 9.5 లక్షలు ఇచ్చారు

వ్యాపారాన్ని విస్తరించా.. నా వద్ద 15మంది పనిచేస్తున్నారు

ప్రధానికి తెలిపిన ఏపీకి చెందిన ముద్రా లబ్ధిదారు

ముద్రా యోజనకు పదేళ్లు... మహిళలతో మోదీ భేటీ

రూ.33 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని వెల్లడి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): సమ్మిళిత సామాజిక వృద్ధిని, ఆర్థికస్వేచ్ఛను ముద్రా రుణాలు మహిళలకు అందించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చి పదేళ్లు అయిన సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని తన అధికార నివాసంలో ముద్రా రుణాల లబ్ధిదారులతో ప్రధాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళతో ప్రధాని సంభాషించారు. ముద్రా రుణాల వల్ల తనకు కలిగిన లబ్ధిని మోదీకి ఆమె వివరించారు. ‘‘2009లో నాకు పెళ్లయింది. 2019 వరకు ఇంటికే పరిమితం అయ్యాను. ఆ ఏడాదే జనపనార సంచుల వ్యాపారం ప్రారంభించాను. దీనికోసం ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో పదమూడురోజులపాటు శిక్షణ తీసుకున్నాను. ముద్రా యోజన కింద కెనరా బ్యాంకు ద్వారా రూ.2 లక్షల రుణం తీసుకున్నాను. బ్యాంకు రుణ మంజూరు కోసం ఎటువంటి పూచీకత్తూ అడగలేదు. రుణ వాయిదాలను సక్రమంగా చెల్లించడంతో 2022లో కెనరా బ్యాంక్‌ అదనంగా రూ.9.5 లక్షలు మంజూరు చేసింది. ఆ డబ్బులతో నా వ్యాపారాన్ని మరింతగా విస్తరించాను.’’ ప్రధాని మోదీకి ఆమె తెలిపారు. ‘మీ వద్ద ఎంతమంది పనిచేస్తున్నార’ని ప్రధాని ఆరా తీశారు. ప్రస్తుతం తన కింద 15 మంది పనిచేస్తున్నారని ఆమె బదులిచ్చారు. కాగా, దశాబ్ద కాలంలో రూ. 33 లక్షల కోట్లను రుణాలరూపంలో ముద్రా లబ్ధిదారులకు ఇచ్చినట్టు ప్రధాని తెలిపారు. ‘‘ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించేస్థాయికి యువతను ఎదిగించడం ముద్రా రుణాల లక్ష్యం.


పారిశ్రామిక, వ్యాపార స్ఫూర్తిని మహిళల్లో నింపాలనేది మా ప్రయత్నం. నిర్లక్ష్యానికి గురైనవారికి ఆర్థిక చేయూతను అందించాం. వారికి ఉన్న అనేక కలలను నిజం చేశాం.’’ అని మోదీ వివరించారు. ఈ పథకం నుంచి మహిళలు ఏ మేరకు లబ్ధి పొందారనేది నేరుగానే తెలుసుకుంటానని చెప్పారు. తలుచుకుంటే భారతీయులకు అసాధ్యం అనేది లేదనేది ముద్రా పథకం రుజువు చేసిందని ‘ఎక్స్‌’ ఖాతాలో ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ పథకం నుంచి మహిళల్లో 70 శాతం మంది లబ్ధి పొందారని, అందులోనూ ఎస్సీ,ఎస్టీ, ఓబీసీలు అధికంగా ప్రయోజనం పొందారని ఆయన వివరించారు. కాగా, వ్యక్తిగత రుణ సంస్థలైన షెడ్యూలింగ్‌ కమర్షియల్‌ బ్యాంకులు (ఎస్‌సీబీలు), రీజినల్‌ రూరల్‌ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బీలు), నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌ఎ్‌ఫసీలు), మైక్రో ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూట్‌లు (ఎమ్‌ఎ్‌ఫఐలు) ముద్రా రుణాలను సమకూర్చుతున్నాయి. తయారీ, వాణిజ్యం, సేవలు, వ్యవసాయ సంబంధ కార్యకలాపాలు, చిన్న వ్యాపారాలు.. ఇలా ఏదో ఒక పని చేస్తున్నవారికి చేయూతను అందిస్తున్నాయి. కాగా, నిజంగానే నారీశక్తిని ముద్రా రుణాలు శక్తివంతం చేశాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కాగా, ముద్రా రుణాలను నాలుగు కేటగిరీల్లో మంజూరు చేస్తారు. శిశు కేటగిరీలో రూ.50 వేలు, కిశోర రూ.50వేలు-రూ.ఐదులక్షలు,, తరుణ రూ. ఐదు లక్షలు- రూ.పదిలక్షలు అందిస్తారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించినవారికోసం తరుణ ప్లస్‌ కేటగిరీని సృష్టించారు. వీరికి రూ. 20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Updated Date - Apr 09 , 2025 | 02:54 AM