Share News

వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే

ABN , Publish Date - Mar 31 , 2025 | 10:55 AM

ఔరంగజేబు సమాధి కేంద్రంగా సాగుతోన్న వివాదంపై మహారష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్ర తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవాలి కానీ.. వాట్సాప్‌లో కాదని స్పష్టం చేశాడు. ఆ వివరాలు..

వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే
aj Thackeray

ముంబై: ఔరంగజేబు సమాధి కేంద్ర బిందువుగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని భావిస్తోన్న వారికి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే గట్టి వార్నింగ్ ఇచ్చాడు. చరిత్ర తెలుసుకోవాలంటే.. వాట్సాప్ నుంచి కాదు.. పుస్తకాలను చదివి తెలుసుకోవాలని సూచించాడు. అంతేకాక చరిత్రను కులం, మతం అనే కోణంలో చూడవద్దని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా వాట్సాప్ వేదికగా వచ్చే చారిత్రక అంశాలను నమ్మవద్దని సూచించాడు. ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఉన్న ఔరంగజేబు సమాధిని తొలగించాలంటూ వస్తోన్న డిమాండ్లపై స్పందిస్తూ రాజ్ ఠాక్రే ఈ విధంగా స్పందించారు. ఔరంగజేబు సమాధిని తొలగించాలంటూ ఆందోళన చేయడంతో మార్చి నెలారంభంలో నాగ్‌పూర్‌లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే.


మార్చి 30, ఆదివారం గుడిపడ్వా సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న రాజ్ ఠాక్రే ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. "మొఘలులు ఛత్రపతి అనే ఆలోచనను చంపేయాలని భావించారు.. కానీ ఆ విషయంలో వారు విఫలం అయ్యి చివరకు మహారాష్ట్రలోనే చనిపోయారు" అని చెప్పుకొచ్చాడు. "ఈ ప్రజలు(మొఘలులు) మహారాష్ట్రను నాశనం చేయాలని భావించారనే విషయాన్ని మనం ప్రపంచానికి తెలియచేయకూడదు. దాని బదులు వారు ఎలా తుడిచిపెట్టుకుపోయారు అన్నది ప్రపంచానికి గుర్తు చేయాలి. అందుకే వాట్పాప్‌లో చరిత్ర తెలుసుకోకుండా.. పుస్తకాలు చదివి వాస్తవ చరిత్ర తెలుసుకొండి" అని సూచించాడు. శివాజీకి ముందు, శివాజీకి తర్వాత సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పుకొచ్చాడు రాజ్ ఠాక్రే.


అంతేకాక తాజాగా విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమాను ప్రస్తావిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశాాడు రాజ్ ఠాక్రే. "ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను మర్చిపోతున్నాం. హిందువులు ఏదైనా సినిమా చూసినప్పుడే మేలుకోవడం వల్ల ప్రయోజనం లేదు. విక్కీ కౌశల్ వల్ల శంభాజీ మహారాజ్ త్యాగాల గురించి, అక్షయ్ ఖన్నా వల్ల ఔరంగజేబు గురించి తెలుసుకున్నారా" అని ప్రశ్నించాడు. అంతేకాక తమ రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నవారు.. ఔరంగజేబు ఎక్కడ జన్మించాడు అనే విషయం మర్చిపోవద్దు అంటూ హెచ్చరించాడు.


అలానే "మతం అనేది మీ ఇంటి నాలుగు గోడల మధ్య ఉండాలి. కానీ ఇప్పుడు ముస్లింలు రోడ్ల మీదకు వచ్చినప్పుడో.. ఘర్షణలు చెలరేగినప్పుడు మాత్రమే హిందువును హిందువుగా గుర్తిస్తున్నారు. లేకపోతే.. హిందువులు కులం ఆధారంగా చీలిపోతున్నారు" అని విమర్శించాడు. అలానే మతం పేరుతో నదులను కలుషితం చేయడంపై కూడా రాజ్ ఠాక్రే అభ్యంతరం వ్యక్తం చేశాడు. గంగా నది ప్రక్షాళన కోసం 33 వేల కోట్లరూపాయలు ఖర్చు చేశాం.. ఇప్పటికి ఆ ప్రక్రియ కొనసాగుతుండటం విచారకరం అన్నాడు.

ఇవి కూడా చదవండి:

బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

బెదిరింపులు ఎవరివి.. ఒత్తిళ్లు ఎవరివి..

Updated Date - Mar 31 , 2025 | 10:58 AM